దుష్యంత్ దుమ్ము లేపారుగా

దుష్యంత్ చౌతాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో దేశమంతా దుష్యంత్ చౌతాలా చుట్టూనే తిరుగుతూ ఉంది. అసలు దుష్యంత్ [more]

Update: 2019-10-24 17:30 GMT

దుష్యంత్ చౌతాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో దేశమంతా దుష్యంత్ చౌతాలా చుట్టూనే తిరుగుతూ ఉంది. అసలు దుష్యంత్ చౌతాలా ఎవరు? ఆయన హర్యానా రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారారు. దుష్యంత్ చౌతాలా అనుగ్రహం కోసం అన్ని ప్రధాన పార్టీలూ ప్రయత్నిస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటో చెప్పకనే తెలుస్తోంది. హర్యానా ఎన్నికల్లో ఇప్పుడు దుష్యంత్ చౌతాలా హాట్ టాపిక్ గా మారారు. ఆయన చేతిలోనే అధికారం ఎవరన్నది తేలుతుంది.

ఎవరీ దుష్యంత్…?

హర్యానా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దేవీలాల్. దేవీలాల్ హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని నిర్వహించారు. కేంద్ర మంత్రి పదవినీ ఆయన చేశారు. దేవీలాల్ కుమారుడు ఓంప్రకాష్ చౌతాలా. ఆయనకు ఇద్దరు కుమారులు. అభయ్ సింగ్ చౌతాలా, అజయ్ సింగ్ చౌతాలా. ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రెండో కుమారుడైన అజయ్ సింగ్ చౌతాలా కుమారుడే దుష్యంత్ చౌతాలా. దేవీలాల్ కు మునిమనవడు అవుతాడు. ఓంప్రకాష్ చౌతాలా తనయుడు అభయ్ సింగ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీని పెట్టి చూసుకుంటున్నారు.

ఏడాది కిందటే పార్టీ పెట్టి….

కానీ దుష్యంత్ చౌతాలా జన నాయక్ జనతా పార్టీని స్థాపించారు. గతంలో దుష్యంత్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఐఎన్ఎల్డీ నుంచి బయటకు వచ్చి జేజేపీని స్థాపించారు. యువకుడు కావడం, తన తాత, ముత్తాతల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న దుష్యంత్ చౌతాలా పార్టీ ఇలాంటి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఏడాది కిందటే జేజేపీని స్థాపించడం.

దేవీలాల్ లాగానే…..

ముఖ్యంగా జాట్ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడంలో దుష్యంత్ చౌతాలా సక్సెస్ అయ్యారు. ఒక కెరటంలా దూసుకు వచ్చారు. తన ముత్తాత దేవీలాల్ అనుసరించిన రీతిలోనే ఆయన వెళ్లడం కలసి వచ్చిందంటున్నారు. ఇప్పుడు దుష్యంత్ చుట్టూనే హర్యానా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన ఎవరిని కరుణిస్తే వారిదే అధికారం. కాంగ్రెస్ అయితే ఏకంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఏడాది కిందటే పార్టీని స్థాపించి 90 స్థానాలున్న హర్యానా రాజకీయాలనును శాసించే స్థాయికి దుష్యంత్ చౌతాలా ఎదగడం విశేషంగా చెప్పుకోవాలి.

Tags:    

Similar News