ద్రోణం రాజకీయం ముగిసినట్లేనా ?

భారతంలో ద్రోణాచార్యుని బాణానికి తిరుగులేదు. ఆధునిక రాజకీయ భారతంలో ద్రోణంరాజు కుటుంబానికి ఎదురులేదు అని చెప్పుకునేవారు. దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఉత్తరాంధ్రా రాజకీయాన్ని దివంగత ద్రోణంరాజు [more]

Update: 2020-10-01 03:30 GMT

భారతంలో ద్రోణాచార్యుని బాణానికి తిరుగులేదు. ఆధునిక రాజకీయ భారతంలో ద్రోణంరాజు కుటుంబానికి ఎదురులేదు అని చెప్పుకునేవారు. దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఉత్తరాంధ్రా రాజకీయాన్ని దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ ప్రభావితం చేశారు. ఆయన వారసుడిగా వచ్చిన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇప్పటికి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. కాంగ్రెస్ లో అనేక కీలకమైన పదవులు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడారు, కానీ ఆయన్ని జగన్ గుర్తించి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ( వీఎంఆర్డీఏ) చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన పదవిని కట్టబెట్టారు.

పోటీతో అలా….

అయితే అప్పట్లో కేవలం ఏడాది కాలం మాత్రమే ఆ పదవిలో ద్రోణంరాజు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చారు. చైర్మన్ తప్ప పూర్తి బోర్డు ని కూడా నియమించలేదు. ఈ లోగా ఆయన పదవీకాలం ముగిసింది. కొనసాగించేందుకు జగన్ సుముఖంగా ఉన్నా ఆ పదవికి పోటీ ఎక్కువైంది. చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వచ్చి శ్రీనివాస్ కి మొదటి దఫాయే ఆ పదవి ఇవ్వడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుపట్టాయి. ఇపుడు మళ్ళీ రెన్యువల్ చేస్తే ఊరుకోమని అనడంతో ఎవరికీ ఇవ్వకుండా జగన్ సర్కార్ ఖాళీగా ఉంచేసింది. దాంతో ద్రోణంరాజు శ్రీనివాస్ ఒక్కసారిగా మాజీ అయిపోయారు. వీఎంఆర్డీఏ వ్యవహారాలను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.

జగన్ దయ మీదనే…..

ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా ఆయనకంటూ సొంత వర్గం లేదు. హై కమాండ్ కరుణించి పదవులు ఇస్తేనే తీసుకోవాలి. పైగా అగ్రవర్ణానికి చెందిన వారు కావడం ఆయనకు మైనస్ గా మారుతోంది. ఇక వైఎస్సార్ కుటుంబంతో ఆయన కుటుంబానికి మంచి రిలేషన్ షిప్ ఉంది. దాంతోనే జగన్ ఆయన మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి మరకలు లేని స్వచ్చమైన ద్రోణంరాజు శ్రీనివాస్ నాయకత్వం అంటే ఇష్టపడతారు. జగన్ దయ ఉంటేనే ఆయనకు భవిష్యత్తులో ఏ పదవి అయినా వైసీపీలో వస్తుందని, లేకపోతే ఒక సాధారణ నాయకుడిగానే గడపాల్సి ఉంటుందని అంటున్నారు.

ఆశలు లేవా….?

ఇదిలా ఉంటే విశాఖ సౌత్ నియోజకవర్గంలో ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకంటూ కొంత పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా జగన్ టికెట్ ఇస్తారా అన్నది కూడా చూడాలి. ఇప్పటికే అక్కడ నుంచి పోటీకి చాలా మంది రెడీగా ఉన్నారు. మైనారిటీ కోటాలో ఎస్ఎ రహమాన్ టీడీపీ నుంచి వచ్చి సిధ్ధంగా ఉన్నారు. అలాగే ఎన్నికల నాటికి మరింతమంది టీడీపీ నుంచి వస్తారని కూడా అంటున్నారు. దాంతో ప్రత్యక్ష ఎన్నికల మీద ద్రోణంరాజు శ్రీనివాస్ ఆశలు లేవు అనుకోవాలి. అయితే శాసనమండలి ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా ద్రోణంరాజు శ్రీనివాస్ ని జగన్ పంపిస్తారా అన్న ఆశలు కూడా ఆయన అభిమానుల్లో ఉన్నాయట. ఏది ఏమైనా జగన్ తలచుకోవాలి. లేకపోతే ద్రోణంరాజు శ్రీనివాస్ రాజకీయానికి ముగింపు కార్డు పడినట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News