ఇద్దరూ అదో రకం...ఏం జరుగుతుందో?

Update: 2018-06-11 16:30 GMT

ఈ నెల 12వ తేదీన జరగనున్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల సమావేశంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మొదట్లో వివిధ కారణాల వల్ల సమావేశం జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ట్రంప్ సానుకూల ప్రకటనతో మళ్లీ ఆశలు చిగురించాయి. సింగపూర్ లోని ‘‘సింటోసా’’ అనే దీవిలో స్థానిక కాలమానం ప్రకారం రేపు ఉదయం 9గంటలకు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ఉప్పు, నిప్పుగా ఉండే ఇద్దరు అధినేతలు సమావేశం కావడం విశేషం. ఏప్రిల్ 27న ఉత్తరకొరియా, దక్షిణ కొరియా అధినేతలు కిమ్ జాంగ్ ఉన్న, సున్ మధ్య సరిహద్దు గ్రామంలో చర్చలు జరిగాయి. ఇవి సత్ఫలితాలను ఇచ్చాయి.

కిమ్ మామూలోడు కాదు.....

ఉత్తరకొరియా, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు చెప్పగానే అంతర్జాతీయ సమాజం ఒకింత ఆశ్చర్యంగా చూస్తుంది. ‘‘ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి ’’అన్నట్లు ఉంటుంది కిమ్ వైఖరి. మొండితనం, పెంకితనానికి ఆయన మారుపేరు. మాటలు,చేతల్లో ఎంతమాత్రం సంయమనం ఉండదు. హెచ్చరికలు, రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం ఆయనకు అలవాటు. ధిక్కారస్వరం ఆయన సొంతం. తనను తాను ఓ అంతర్జాతీయ నాయకుడిగా, తన దేశాన్ని ఓ అంతర్జాతీయ శక్తిగా పరిగణిస్తుంటారు. ప్రపంచంలో ఒక్క చైనాతో తప్ప మరే దేశంతో ఎంతమాత్రం పడదు. ఇరాక్, రష్యాలతో ఒకింత సత్సంబంధాలున్నాయి. దక్షిణ కొరియా, జపాన్, అమెరికా అంటే ఒంటికాలుపై లేస్తాడు. ప్రజల అన్నపానీయాల కన్నా అణ్వస్త్రాలే మిన్న అని భావిస్తాడు. పేదరికం కన్నా ఆయుధాలే ముఖ్యమని బలంగా విశ్వసిస్తాడు. ఉత్తర కొరియా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రగల్భాలకు తక్కువ లేదు. అంతర్జాతీయ చిత్రపటంలో చాలా చిన్న దేశమైన ఉత్తర కొరియా మొత్తానికి అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడంలో విజయవంతమైంది. ప్రజాస్వామ్యం, అభివృద్ధి, స్వేచ్ఛ, ప్రజల నిరసనలను పట్టించుకోని కిమ్ అమెరికా సామ్రాజ్యవాదం గురించి, జపాన్, దక్షిణ కొరియాల గురించి అదేపనిగా ధ్వజమెత్తుతుంటాడు. అలాంటి నాయకుడు చర్చలకు ముందుకు రావడం విశేషమే. అయితే సన్నిహిత మిత్రదేశమైన చైనా ఒత్తిడితోనే చర్చలకు కిమ్ సిద్ధపడ్డారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఉత్తర కొరియాను దారిలో పెట్టడం మిత్రదేశమైన చైనా బాధ్యత అని అమెరికా హెచ్చరించింది. దీంతో బీజింగ్ వత్తిడితో ప్యాంగ్ యాంగ్ దిగివచ్చింది.

ట్రంప్ ఏమాత్రం తీసిపోరు.....

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సయితం మాటలు, చేతల పరంగా కిమ్ కు ఏమాత్రం తీసపోడు. ఓ అగ్రరాజ్య అధినేతగా, ఓ ప్రపంచ నాయకుడిగా ఉండాల్సిన పరిణితి, సంయమనం ఆయన లో కన్పించదు. మొదట్లో చర్చలకు సంబంధించిన తేదీ ఖరారైనప్పటికీ సమావేశంలో పాల్గొనే విషయంపై అస్పష్టంగా మాట్లాడారు. ఇప్పటికీ సానుకూల పరిస్థితులు లేకపోతే సమావేశం నుంచి వాకౌట్ చేస్తానని ప్రకటించాడు ట్రంప్. చర్చలు సఫలమైతే కిమ్ ను శ్వేతసౌధానికి ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. చర్చలకు ముందు ట్రంప్ జపాన్ ప్రధాని షింజో అబేని కలిశారు. కిమ్ చేత నిరాయధీకరణపై ప్రకటన చేయించాలని అమెరికా, దాని మిత్ర దేశాలు బలంగా కోరుకుంటున్నాయి. కొరియాల యుద్ధాన్ని నివారించేందుకు నిరాయుధీకరణే పరిష్కారమన్నది అంతర్జాతీయ సమాజం అంచనా. కిమ్ తన కోసం, తన కుటుంబం కోసం, తన ప్రజల కోసం నిరాయుధీకరణకు హామీ ఇవ్వాల్సిన అగత్యం ఉంది. ఎంతో కాలం అగ్రదేశాన్ని, పొరుగున బాగా అభివృద్ధి చెందిన జపాన్, దక్షిణ కొరియాలను కాదని మనుగడ సాగించడం కష్టం. ఉత్తరకొరియా ప్రభుత్వ అత్యున్నత అధికారి ‘కిమ్ యంగ్ చోల్’ చర్చలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఉత్తరకొరియా అధినేత కిమ్ కు అత్యంత సన్నిహితుడు. 2000 నుంచి వైట్ హౌస్ తో సత్సంబంధాలున్నాయి. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహిత సంబంధాలు నెరిపేవారు. ఆ సాన్నిహిత్యం ఇప్పుడు ట్రంప్ తో చర్చలకు తోడ్పడింది. ఇటీవల తన అధినేత కిమ్ రాసిన కథను స్వయంగా ఆయన ట్రంప్ కు అందజేయడం విశేషం. కిమ్ యాంగ్ చోల్ ఉత్తర కొరియా అధినేత కిమ్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. గతంలో అధ్యక్షుడు తండ్రి కిమ్ జోంగిల్ కు అంగరక్షకుడిగా పనిచేశారు. తాజాగా ఇరుదేశాల అధినేతల మధ్య చర్చలకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఉత్తర కొరియాను పలుమార్లు హెచ్చరించినప్పటికీ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కిమ్ యంగ్ చోల్ పాత్ర అత్యంత కీలకం. ఆయన అమెరికా హోంమంత్రి మైక్ పాంపియాతో కూడా చర్చలు జరిపారు.

కిమ్ అంగీకరిస్తారా.....?

ఉత్తర కొరియా నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని, తన అణు పరీక్షల స్థావరాలను ధ్వంసం చేయాలని చర్చల్లో అమెరికా ప్రధానంగా డిమాండ్ చేయనుంది. వీటికి ఉత్తరకొరియా ఎంతవరకూ అంగీకరిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అమెరికా వత్తిడికి తలొగ్గినట్లయితే....తమ బలం తరిగిపోతుందన్నది దాని భయం. గతంలో లిబియా విషయంలో కూడా అమెరికా ఇలాంటి డిమాండ్లే పెట్టిందని అది గుర్తు చేస్తోంది. 2003లో లిబియా అన్ని రకాల ఆయుధాలు, అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకుంది. అయినప్పటికీ లిబియాలో అమెరికా అంతర్గత కలహాలను సృష్టించింది. ఈ అనుభవాల నేపథ్యంలో కిమ్ తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. అందుకే అమెరికాకు అత్యంత సన్నిహితమైన, తన పొరుగుదేశం దక్షిణ కొరియాతో పాత వైరాన్ని మరచి చేతులు కలిపారు. మరో శక్తిమంత దేశమైన చైనా, అగ్రరాజ్యమైన రష్యాతో స్నేహం నెరుపుతున్నారు. చర్చల్లో కొంతవరకూ దిగివచ్చినా పూర్తిగా ట్రంప్ మాటలకు తలొగ్గుతారని చెప్పలేం. ఏదైనా ఈ సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పడం తొందరపాటే అవుతుంది.

Similar News