ట్రంప్…దెబ్బకు.. కంపు..కంపు…!!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల పాలనను విశ్లేషిస్తే విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా కనపడతాయి. ఇది ఏదో విపక్షమో, లేదా విమర్శకుల మాటో కానే కాదు. [more]

Update: 2019-02-17 18:29 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల పాలనను విశ్లేషిస్తే విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా కనపడతాయి. ఇది ఏదో విపక్షమో, లేదా విమర్శకుల మాటో కానే కాదు. సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలోనే అంతర్గతంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. 2016 నవంబరు మొదటి వారంలో జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఓడించారు డొనాల్డ్ ట్రంప్. 2017 జనవరి 20న అగ్రరాజ్యం 45వ అధినేతగా అధికార పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన అంతర్జాతీయ ‘‘విదూషకుడి’’ పాత్రను పోషిస్తున్నారనడం అతిశయోక్తి కాదు. ప్రవర్తన, వ్యవహారశైలి వంటి విషయాల్లో ఆయన తెలుసుకోవాల్సిందీ… నేర్చుకోవాల్సిందీ ఎంతో ఉందన్న అభిప్రాయం కలగక మానదు. అమెరికా అధినేతగా ఆయనను ఆదేశంతో పాటు అంతర్జాతీయ సమాజం వెయ్యికళ్లతో పరికిస్తుంది. ఆయన మాటలను, చేతలను, విధానాలను,అభిప్రాయాలను శల్య పరీక్ష చేస్తుంది. అధ్యక్ష పదవికి ఉండాల్సిన హుందాతనం, సంయమనం, ఆచితూచి వ్యవహరించడం వంటి లక్షణాలు ఆయనలో మచ్చుకైనా కనపడవు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం అమెరికా ప్రయోజనాలకు మేలు చేస్తుందని చెబుతున్నప్పటికీ, అంతిమంగా నష్టమే జరుగుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. విపరీతమైన జాతీయవాదంతో అగ్రరాజ్య స్థాయిని తగ్గిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కొత్త తలనొప్పులను తెచ్చుకుంటున్నారు. మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు.

అభాసుపాలై…..

తాజాగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం విషయంలో మొండి పట్టుదలకు పోయి అభాసుపాలయ్యారు. గోడ నిర్మాణానికి అవసరమైన 570 కోట్ల డాలర్ల సొమ్మును కేటాయించాలన్న డిమాండ్ ను విపక్ష డెమొక్రాట్లు అడ్డుపడటంతో యావత్ ప్రభుత్వ కార్యకలాపాలను స్థంభింపచేశారు. ఇలా జరగడం అమెరికా చరిత్రలో కొత్తేమీ కాకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాల స్థంభన (షట్ డౌన్) వల్ల ఉద్యోగులు, అధికారులు జీతాలు రాక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వంలో ఉండే మొత్తం 15 విభాగాల్లో వాణిజ్యం, వ్యవసాయం, రవాణా, న్యాయ, అంతర్గత భద్రత తదితర 9 రంగాల్లో అనిశ్చితి ఏర్పడింది. 1976 నుంచి ఇలా ‘‘షట్ డౌన్’’ జరగడం ఇది 21వ సారి. తన డిమాండ్ నెరవేరనప్పటికీ వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడితో తాత్కాలికంగా ట్రంప్ వెనక్కు తగ్గారు. మున్ముందు ఎలా ఉంటారో చూడాలి.

దిగజారిన ప్రతిష్ట….

ట్రంప్ హయాంలో అమెరికా ప్రాబల్యం, ప్రతిష్ట పెరగకపోగా మరింత తగ్గింది. వాతావరణ మార్పులపై 2015 డిసెంబరు లో 200 దేశాలు సంతకం చేసిన ‘‘పారిస్ ఒప్పందం’’ నుంచి అమెరికా వైదొలిగింది. ఇది అంతర్జాతీయంగా అనేక విమర్శలకు దారితీసింది. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే సిరియా, లిబియా, సుడాన్, సోమాలియా, యెమన్, ఇరాక్, ఇరాన్ తదితర ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంతో అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమయింది. చివరకు అమెరికా న్యాయ స్థానాలు ఈ నిర్ణయాన్ని కొట్టిపారేయడంతో ఖంగుతిన్నారు. ఓ మతం పేరు చెప్పి నిషేధం విధించడం ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం తగదని న్యాయస్థానాలు అక్షింతలు వేయడంతో ట్రంప్ దిగిరాక తప్పలేదు. మొన్నటి దాకా అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఉండేది. గత రెండేళ్ల కాలంలో చైనా, రష్యాలు బలోపేతమై వివిధ విషయాల్లో అమెరికాను సమం చేయడం గమనించదగ్గ అంశం. చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అమెరికా డాలర్ పెత్తనాన్ని ప్రశ్నిస్తోంది. సిరియా విషయంలో అమెరికా నిస్సహాయంగా మిగిలిపోయింది. అక్కడి అధ్యక్షుడు అల్ బహర్ అసద్ ను దారికి తీసుకురావడంలో విఫలం కావడంలో అసద్ కు రష్యా మద్దతు ఉండటమే అసలైన కారణమని చెప్పక తప్పదు.

అర్థరహితమైన నిర్ణయాలు….

సిరియా, ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు చక్కబడక ముందే ఆయా దేశాల నుంచి సైన్యాన్ని వెనక్కు రప్పించాలన్న నిర్ణయం అర్థరహితమైందన్న వాదన వినపడుతోంది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఆప్ఘనిస్థాన్ కు అన్ని విధాలా చేయూత అందిస్తున్న భారత్ ను విమర్శించడం కేవలం అవగాహనా రాహిత్యమే అవుతుంది. రమారమి రెండు లక్షల కోట్ల కు పైగా సాయమందించిన భారత్ కేవలం ‘‘గ్రంధాలయం’’ మాత్రమే నిర్మించిందనడం ఆయన వాచాలత్వానికి నిదర్శనం. తాజాగా లాటెన్ అమెరికా దేశమైన వెనెజులాలో ప్రతిపక్ష నాయకుడి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వాన్ని గుర్తించడం, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశానికి తగని నిర్ణయం. ‘‘వీసా’’ నిబంధనలను కఠినతరం చేయడంతో భారత సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. కఠినమైన ఆంక్షల కారణంగా ఎంతో మంది యువకులు అమెరికా గడప తొక్కలేకపోతున్నారు. అన్ని అమెరికన్లకే అన్న నినాదం వినడానికి బాగున్నప్పటికీ అమెరికా ప్రగతికి అవరోధంగా మారుతుందన్నది విశ్లేషకుల వాదన. వాణిజ్యంలో అక్రమ విధానాలను చైనాను కట్టడిచేయడం, వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల, అమెరికా పరిశ్రమలలు, కార్మికులకు మేలు చేసేలా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ను ఓడించడం వంటి విజయాలు ఉన్నప్పటికీ మొత్తానికి వైఫల్యాలే ఎక్కువ ఉన్నాయి. ఫలితంగా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

 

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News