నాలుగో ఏడాది ఇంతేనా?

రాజకీయ నాయకుడు ఎక్కడైనా రాజకీయ నాయకుడే. అతని అంతిమ లక్ష్యం అధికార సాధనే. ఒకసారి అధికారం సాధించిన తర్వాత దాన్ని కాపాడుకోవడంపైనే అతని దృష్టి అంతా కేంద్రీకృతమవుతోంది. [more]

Update: 2020-01-21 18:29 GMT

రాజకీయ నాయకుడు ఎక్కడైనా రాజకీయ నాయకుడే. అతని అంతిమ లక్ష్యం అధికార సాధనే. ఒకసారి అధికారం సాధించిన తర్వాత దాన్ని కాపాడుకోవడంపైనే అతని దృష్టి అంతా కేంద్రీకృతమవుతోంది. ఇందుకోసం కులాలు, మతాలు, ప్రాంతం, జాతి వంటి ఏ ఒక్క అంశాన్ని విస్మరించడు. వీటిల్లో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏదో ఒక దానిని ఉపయోగించుకుని లబ్దిపొందాలని చూస్తుంటాడు. పంచాయతి, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, ఆఖరుకు అంతర్జాతీయ స్థాయి నాయకులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చూస్తుంటే పై అభిప్రాయం కలగక మానదు. ఆయన ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష్య ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఆఖరుకు ఇరాన్ తో యుద్ధాన్ని చేసి ప్రజల దృష్టిలో హీరోగా నిలిచిపోయి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.

ఈ ఏడాది ఎన్నికలు కావడంతో….

మనదేశంలో మాదిరిగా అమెరికాలో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించదు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నవంబరు నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు ఎన్నికలు జరుగుతాయి. దానినే సూపర్ ట్యూస్ డే అని పిలుస్తారు. ఈ లెక్కన ఈ ఏడాది నవంబరు 3వ తేదీన అధ్యక్ష్య ఎన్నికలు జరుగుతాయి. అమెరికా ఎన్నికల్లో రెండు అంశాలు కీలకం. ఒకటి ముందు పార్టీ టిక్కెట్ సాధించడం. రెండోది ఎన్నికల్లో గెలుపు. పార్టీ టిక్కెట్ ట్రంప్ కే ఖరారయింది. ఇక ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకం. గత నాలుగేళ్లుగా అనేక వివాదాస్పద నిర్ణయాలతో ట్రంప్ ప్రజల్లో వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో గెలుపుపై ఆయనకు అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటూ రాజకీయంగా ట్రంప్ అప్రతిష్ట పాలయ్యారు. 20 సంవత్సరాల చరిత్రలో ముగ్గురు అధ్యక్షులకు మాత్రమే ఈ పరిస్థితి ఎదురయింది. వారిలో ఇటీవల కాలంలో బిల్ క్లింటన్ తర్వాత ట్రంప్ మాత్రమే. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన అభిశంసన తీర్మానం సెనెటకు వచ్చే మంగళవారం రానుంది. సెనెట్ లో రిపబ్లికన్లకు బలం ఉన్నందున ట్రంప్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే రాజకీయంగా ఆయన ఇమేజ్ దెబ్బతినింది.

ఎన్నికల గండాన్ని…..

ఈ పరిస్థితుల్లో ఎన్నికల గండం గట్టెక్కేందుకు ఏదో ఒక భావోద్వేగ అంశం కావాలి. అది ప్రజల మనసులను తాకాలి. వారిలో జాతీయ భావాలు రగలాలి. తద్వారా తాను ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది ట్రంప్ వ్యూహం. అందుకే ఇరాన్ తో యుద్ధం అంశాన్ని తెలివిగా తెరపైకి తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చడం వెనక అసలు వ్యూహం కూడా ఇదే. ఇంతటితో సరిపెట్టకుండా పశ్చిమాసియాల దేశమైన ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, దాడులు చేస్తామని, అవసరమైతే యుద్ధం చేస్తామన్న ట్రంప్ ప్రకటనలు ఎన్నికల కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆధిపత్యం ఉండాలన్నదిద అమెరికన్ల భావన. ఈ విషయంలో వారు రాజీ పడలేరు. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అంతే. గతంలో బరాక్ ఒబామా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇరాన్ తో యుద్ధానికి తెగబడే ప్రమాదం ఉందని 2011 లో స్వయంగా ట్రంప్ ట్విట్టర్ లో ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.

అందరూ అంతే…..

1999లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానం ఎదుర్కొంటున్న సమయంలో ఇరాన పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇరాన్ తో యుద్ధం చేయాలన్న ట్రంప్ ఆలోచనలను అంత తేలిగ్గా తోసిపుచ్చలేం. నిజానికి ట్రంప్ ఆలోచనలన్నీ మొదటి నుంచి ప్రజల భావోద్వేగాలతో ముడిపడినవే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన విదేశీయుల రాక వల్ల అమెరికన్ యువత ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ వచ్చారు. అందువల్లే వీసీ నిబంధనలను కఠినతరం చేస్తూ వచ్చారు. యువతను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశ్యంతోనే ఇలా వ్యవహరించారన్న విమర్శ ఉంది. పొరుగుదేశమైన మెక్సికో నుంచి వలసలను అడ్డుకోవడంలోనూ కఠినంగా వ్యవహరించారు. ఎంతకాదనుకున్నా ట్రంప్ కూడా సగటు రాజకీయ నాయకుడే. ఆయన ఆలోచనలూ సహజంగానే ఆ దిశగానే ఉంటాయి. దానిని తోసిపుచ్చలేం.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News