పరువు…పరపతి పోయిందే

“చావు తప్పి కన్ను లొట్ట పోయిన పరిస్థితి” అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని చూసిన తర్వాత ఈ పాత తెలుగు సామెత గుర్తుకు రాక మానదు. [more]

Update: 2020-01-07 18:29 GMT

“చావు తప్పి కన్ను లొట్ట పోయిన పరిస్థితి” అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని చూసిన తర్వాత ఈ పాత తెలుగు సామెత గుర్తుకు రాక మానదు. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్ ను అభిశంసించడంతో ఆయన ప్రతిష్ట అథపాతాళానికి పడిపోయింది. తన మాటలు, చేతలు, కనుసైగలతో యావత్ ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యానికి నేత స్వదేశంలో అభిశంసనకు గురి కావడం ఆయన పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేదే. అంతమాత్రాన ఆయన పదవికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రతినిధుల సభ అధిగమించినప్పటికీ సెనేట్ కూడా ఆమోదిస్తేనే ట్రంప్ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. వంద మంది సభ్యులు గల సెనేట్ లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లదే ఆధిపత్యం. ఆయన పార్టీకి 53 మంది సభ్యులున్నారు. డెమొక్రాట్రకు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులున్నారు. సెనేట్ లో సంఖ్యాబలం కారణంగా ట్రంప్ కు వచ్చిన ఇబ్బందులు లేవు. అధ్యక్షుడు తప్పు చేశారని ప్రకటించడానికి సెనేట్ లో రెండు వంతులు (67 మంది) మెజార్టీ అవసరం.

ట్రంప్ కు ఇబ్బంది లేకున్నా…

బలాబలాలను పక్కన పెడితే ప్రతినిధుల సభలో ట్రంప్ కు చుక్కెదురు కావడం ఆయన ప్రతిష్టను మసక బారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాది జనవరి నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలను ఈ అంశం ఎంతో కొంత ప్రభావితం చేయక మానదు. అదే సమయంలో అధ్యక్ష్య ఎన్నికల్లో డెమొక్రట్లకు ఇది ఒక కీలక ప్రచారాంశంగా మారుతుంది. అంతర్గతంగా కూడా ట్రంప్ నకు కొన్ని ఇబ్బందులున్నాయి. అధ్యక్ష్య పదవి అభ్యర్థికి సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఎన్నికలలో కూడా అభిశంసన అంశం ఖచ్చితంగా ఒక మైనస్ పాయింట్ అవుతుంది. అభిశంసన ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా అధ్యక్షుడు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆయన మాటకు విలువ ఉండదు. దాదాపు నిమిత్త మాత్రుడవుతాడు. అమెరికాను వ్యతిరేకించే చైనా, రష్యా తదితర అగ్రదేశాల ముందు పలచన అవుతారు. అంతర్జాతీయ వేదికలపై అభాసుపాలయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. అసలు అభిశంసన ప్రతిపాదన రావడమే అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అది ఒక చట్ట సభ ఆమోదం పొందడం విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది.

ముగ్గురు అధ్యక్షులకే…..

దాదాపు రెండున్నర దశాబ్దాల అమెరికా చరిత్రలో ఇటు వంటి దయనీయ పరిస్థిితి కేవలం ముగ్గురు అధ్యక్షులకే ఎదురైంది. అందులో ట్రంప్ ఒకరు కావడం గమనార్హం. 1974లో వాటర్ గేట్ కుంభకోణంలో రిచర్డ్ నిక్సన్ ఆభిశంసనకు గురయ్యారు. కానీ అభిశంసన ప్రక్రియకు ముందే ఆయన రాజీనామా చేశారు. 1868లో నాటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ అభిశంసనకు గురయ్యారు. దేశ చరిత్రలో ఒక అధ్యక్షుడు అభిశంసనకు గురికావవడం ఇదే ప్రధమం. నాటి యుద్ధ శాఖ నుంచి ఎడ్వర్డ్ స్టాంటన్ ను తొలగించడంలో వివాదం రాజుకుంది. కానీ ప్రతినిధుల సభ జోక్యం చేసుకుని స్టాంటన్ ను మళ్లీ నియమించింది. దీంతో జాన్సన్ ఆయనను మళ్లీ తొలగించారు. దీనిపై ప్రతినిధుల సభ ఆయనను 126-47 ఓట్లతో అభిశంసించింది. కానీ సెనెట్ లో అది వీగిపోవడంతో జాన్సన్ కు పదవీ గండం తప్పింది.

క్లింటన్ వేధింపు కేసులో…

అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడు బిల్ క్లింటన్. ఇది ఇటీవల చరిత్ర. 1994లో పోలా జోన్స్ అనే మహిళ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. 1998 జనవరిలో ఈ కేసు విచారణ సందర్భంగా మెనికా లెవిస్కీ తో తనకు వివాహేతర సంబంధం లేదని క్లింటన్ ప్రమాణం చేసి చెప్పారు. అదే ఏడాది జులైలో మాత్రం మెనికా లెవెస్కీతో వివాహేతర సంబంధంపై అబద్ధం చెప్పానని క్లింటన్ ఒప్పుకున్నారు. క్లింటన్ తో జరిపిన సంభాషణల రికార్డులను లెవెస్కీ బయటపెట్టారు. దీంతో 1998 డిసెంబరు 11న క్లింటన్ ను ప్రతినిధుల సభ 228 – 206 ఓట్లతో అభిశంసించింది. కానీ సెనెట్లో 55-45 ఓట్లతో క్లింటన్ నెగ్గారు. దీంతో పదవీ గండం తప్పింది. పదవి కోల్పోయారా? లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. అసలు అభిశంసన రావడమే అప్రతిష‌్ట. రెండున్నర దశాబ్దాల చరిత్రలో కేవవలం ముగ్గురు అద్యక్షులే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారంటే వారి పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. యావత్ ప్రపంచాన్ని శాసిించే నేతలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తద్వారా ఆయన ప్రతిష్టతో పాటు దేశ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేకే ట్రంప్ ఇంత పరాభవాన్ని ఎదుర్కొనాల్సి వచ్చంది. ట్రంప్ చరిత్ర వచ్చే అధ్యక్షులకు ఓ హెచ్చరిక.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News