ఊహించిందే అయినా?

అనుకున్నదే జరిగింది. ఇది ఊహించిందే అయినా అతి స్వల్ప ఓట్లు తేడాతో గెలవడం ఆయన నైతికంగా ఓడిపోయినట్లే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకున్నారు. [more]

Update: 2020-02-06 18:29 GMT

అనుకున్నదే జరిగింది. ఇది ఊహించిందే అయినా అతి స్వల్ప ఓట్లు తేడాతో గెలవడం ఆయన నైతికంగా ఓడిపోయినట్లే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా సెనెట్ లో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకున్నట్లే అయింది. సెనెట్ లో ట్రంప్ కు అనుకూలంగా 52 ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 48 మంది ఓట్లు వేశారు. నాలుగు ఓట్ల తేడాతో ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు.

ప్రధాన కారణమిదే….

ట్రంప్ అభిశంసనను ఎదుర్కొనడానికి ప్రధాన కారణం. డెమొక్రటిక్ పార్టీ నేత జో బిడెన్. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తరుణంలో ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఉక్రెయిన్ సహజవాయువు సంస్థలో కీలక పదవిలో నియమితులయ్యారు. ఉక్రెయిన్… ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగం. సోవియట్ యూనియన్ విడిపోయాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. దీని రాజధాని నగరం పేరు కీవ్. ప్రస్తుతం జో బిడెన్ డెమొక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో హంటర్ నియామకంపై దర్యాప్తు చేయించాలని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెవిన్ స్కీపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది అభియోగం. ఒకవేళ దర్యాప్తు చేయించకపోతే ఆ దేశానికి 40 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని నిలిపివేస్తానని బెదిరించడం ద్వారా ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ప్రతినిధుల సభలో ఓడి….

అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశద్రోహం, ముడుపుల స్వీకరణ, ఇతర తీవ్ర నేరాలకు అధ్యక్షుడు పాల్పడినప్పుడు అధ్యక్షుడిని ప్రతినిధుల సభ అభిశంసించవచ్చు. అయితే వీటిని తీవ్ర నేరాలుగా పరిగణించాలన్న విషయమై రాజ్యాంగంలో స్పష్టత లేదు. అయితే ట్రంప్ అధికార దుర్వినియోగం తీవ్ర నేరంగా పరిగణించవచ్చని డెమొక్రాట్లు గట్టిగా వాదించారు. ప్రతినిధుల సభలో డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సెనెట్ లో ఎటూ బలం ఉంది కాబట్టి ట్రంప్ గెలుస్తారని అందరూ ఊహించిందే అయినప్పటికీ అతి తక్కువ ఓట్లు రావడం కలవరపర్చే అంశమే.

ఎన్నికలకు ముందు….

ఈ ఏడాది నవంబరు నెలలోనే అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి మళ్లీ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడతారు. అలాగే విపక్ష డెమొక్రట్ల నుంచి జోయ్ బిడెన్ పోటీ చేయనున్నారు. బిడెన్ కూడా బలమైన నేత కావడంతో ఈసారి ట్రంప్ విజయంపై కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే సెనెట్ లో అభిశంసన నుంచి గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్ నైతికంగా ఓటమి పాలయినట్లేనని, ఎన్నికలకు ముందు ఇది ఆయనకు చెంపదెబ్బ అని డెమొక్రట్ పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ కు స్పల్ప ఊరట లభించిందనే చెప్పాలి.

Tags:    

Similar News