అమెరికా అత్యంత చెత్త అధ్యక్షుడు ఈయనేనట

రెండున్నర శతాబ్దాల చరిత్ర గల అమెరికాను అనేక మంది అధ్యక్షులు పాలించారు. వారిలో కొందరు దేశ ప్రతిష్టను పెంచారు. మరి కొందరు దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు. మరి [more]

Update: 2021-03-11 16:30 GMT

రెండున్నర శతాబ్దాల చరిత్ర గల అమెరికాను అనేక మంది అధ్యక్షులు పాలించారు. వారిలో కొందరు దేశ ప్రతిష్టను పెంచారు. మరి కొందరు దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు. మరి కొందరు బలహీనపరిచారు. ఇంకొందరు శాంతి కాముకులుగా గుర్తింపు పొందారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిల్లో ఏ ఒక్క కోవలోకి రారు. అమెరికా చరిత్రలో అత్యంత అప్రతిష్ఠను మూటకట్టుకున్న అధినేతగా మిగిలిపోతారు. ఈ మాటలు వినడానికి ఒకింత కఠినంగా ఉన్నప్పటికీ వాస్తవం. 45వ అధ్యక్షుడిగా 2017 జనవరి 20 నుంచి 2020 జనవరి 20 వరకు నాలుగేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా గుర్తింపు పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈనెల 14న డొనాల్ఢ్ ట్రంప్ అభిశంసన గండం నుంచి
గట్టెక్కినప్పటికీ అమెరికా చరిత్రలో ఆయన ప్రస్థానం చీకటి అధ్యాయాన్ని తలపిస్తుంది.

ఇప్పటి వరకూ ముగ్గురు….

ఇప్పటివరకు ముగ్గురు అధ్యక్షులు అభిశంసన గండాన్ని ఎదుర్కొన్నారు. అయితే వీరెవరూ శిక్షకు గురికాకపోవడం ఒకింత ఉపశమనం కలిగించే విషయం. 1868లో నాటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ అభిశంసన గండాన్ని ఎదుర్కొన్నారు. తరవాత 1998లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ ఈ పరిస్థితికి గురయ్యారు. మోనికా లెవిన్సీతో అక్రమ లైంగిక సంబంధాలకు సంబంధించి ఆయన అమెరికా కాంగ్రెస్ ముందు నిలబడాల్సి వచ్చింది. తరవాత ఈ దుస్థితికి గురైన మూడో అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఈ ముగ్గరు అధినేతలు నిర్దోషులుగా బయటపడటం విశేషం. అభిశంసనను ఎదుర్కొన్న ఈ ముగ్గురు అధ్యక్షులూ అనంతర ఎన్నికల్లో ఓడిపోవడం విశేషం.

రెండుసార్లు ఎదుర్కొని…..

అభిశంసనకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ది ప్రత్యేక పరిస్థితి. ఆయన రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్నారు. గతంలో ఏ అధ్యక్షుడికీ ఇటువంటి దుర్భర పరిస్థితి ఎదురవకపోవడం గమనార్హం. తొలిసారి 2019 డిసెంబరులో ఆయనపై అభిశంసనను నాటి విపక్ష డెమొక్రట్ సభ్యులు ప్రతిపాదించారు. అయితే సెనెట్లో తగినంత మెజార్టీ లేకపోవడంతో అది వీగిపోయింది. తాజాగా రెండోసారి కూడాడొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు డెమొక్రట్ పార్టీ గట్టిగా ప్రయత్నించింది. ఈసారీ సెనెట్ లో తగినంత మెజార్టీ లేక భంగపడింది. అమెరికా సెనెట్ మన దేశంలో రాజ్య సభ వంటిది. రాజ్యసభకు మన ఉప రాష్ర్టపతి అధ్యక్షత వహించి నట్లే అమెరికాలో సెనెట్ కు ఉపాధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు. మన ఉప రాష్ర్టపతి మాదిరిగానే అక్కడ ఉపాధ్యక్షుడు కీలక సమయాల్లో తన ఓటుహక్కు ను వినియోగించుకుంటారు. దీనినే కాస్టింగ్ ఓటు అని వ్యవహరిస్తారు. ఇక్కడ సహజంగానే ఉప రాష్ర్టపతి అధికార పార్టీ నాయకుడే అయి ఉంటారు. అమెరికాలోనూ అధికార పార్టీ నాయకుడే ఉపాధ్యక్షుడవుతారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు హోదాలో కమలా హారిస్ సెనెట్ ఛైర్మన్ గా వ్యవహరించారు.

బతుకుజీవుడా అంటూ…..

సాధారణంగా అభిశంసన తీర్మానం నెగ్గాలంటే సెనెట్లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. సెనెట్లో మొత్తం వంద మంది సభ్యులకు గాను తీర్మానం నెగ్గాలంటే 67 మంది మద్దతు అవసరం. కానీ 57 మందే మద్దతు పలికారు. 47 మంది అభిశంసనను అడ్డుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన ఏడుగురు రిపబ్లికన్ సభ్యులు బిల్ కాసిడి (లూసియానా), రిచర్డ్ బర్డ్ (నార్త్ కరోలినా), మిట్ రోమ్నీ (ఉటాచ్), బెన్ సాస్నిస్ ( నెబ్రాస్కా), లిసా ముర్కోన్సీ(అలస్కా), పాట్ టూమీ (పెన్సిల్వేనియా), సుసాన్ కాలిన్స్ (మైనె) ట్రంప్ నకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. మొత్తానికి 57-43 ఓటింగ్ తో తీర్మానం వీగిపోవడంతో బతుకు జీవుడా అంటూ డొనాల్డ్ ట్రంప్ బయటపడ్డారు. సభ్యుల మద్దతు లేక సాంకేతికంగా అబిశంసన వీగిపోయినప్పటికీ అమెరికా ప్రజలు ఆయనను ఎప్పుడో అభిశంసించారన్నది వాస్తవం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News