ఈయన చెప్పిందే వేదమా…??

తమిళనాడు రాష్ట్రంలో ఒక పొత్తు పొడిచింది. భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పొత్తు కుదిరింది. ఇక విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు కావాల్సి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరితో [more]

Update: 2019-02-21 18:29 GMT

తమిళనాడు రాష్ట్రంలో ఒక పొత్తు పొడిచింది. భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పొత్తు కుదిరింది. ఇక విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు కావాల్సి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరితో కలసి మొత్తం 40 పార్లమెంటు స్థానాలుండగా, కూటమిలో చిన్నా చితకా పార్టీలన్నీ కలిపీ దాదాపు ఏడు వరకూ ఉన్నాయి. వీటన్నింటికీ సీట్ల సర్దుబాటు చేయడం డీఎంకే అధినేత స్టాలిన్ కు సమస్యగా మారింది. ఇప్పటికే కూటమి పార్టీలతో చర్చల కోసం స్టాలిన్ కమిటీ ఏర్పాటు చేశారు. డీఎంకేతో కలసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇండియన్ ముస్లింలీగ్, ఎండీఎంకే, ఎంఏకే, వీసీకే పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలకు జట్టు కట్టాలని నిర్ణయించాయి.

తేడా వస్తుందా….?

అయితే ఉన్న నలభై సీట్ల పంపకంలో బేధాభిప్రాయాలు తలెత్తకుండా స్టాలిన్ జాగ్రత్తలు తీసుకుంన్నారు. డీఎంకే మొత్తం 40 స్థానాల్లో 25 స్థానాల్లో పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకుంది. మిగిలిన పదిహేను స్థానాలను మిత్రపక్షాలకు ఇస్తామని ఇప్పటికే స్టాలిన్ కుండబద్దలు కొట్టేశారు. ఇందులో కాంగ్రెస్ కు ఎనిమిది సీట్లు (ఇందులో పుదుచ్చేరి కూడా ఉంది), మిగిలిన పార్టీలన్నింటికీ కలిపి ఒక్కో సీటు ఇస్తామని ప్రతిపాదించారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము పుదుచ్చేరిలో ఎటూ అధికారంలో ఉన్నాం కాబట్టి అది వదిలేసి, తమిళనాడులో తొమ్మిది స్థానాలను కేటాయించాలని గట్టిగా కోరింది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు డీఎంకే తొలుత నో చెప్పినా చిివరకు స్టాలిన్ దిగిరాక తప్పలేదు. మొత్తం తమిళనాడు,పుదుచ్చేరిలలో కలిపి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది.

గత ఎన్నికల ఫలితాలను…..

గత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అన్ని స్థానాల్లో ఓటమి పాలయింది. దీనిని ఉదాహరణగా డీఎంకే పక్షాలు చూపుతున్నాయి. అయితే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రాష్ట్రంలో కుదేలైపోయిందని, ఆ పార్టీకి ఓటు బ్యాంకు కూడా లేదని స్టాలిన్ అభిప్రాయం. ఇప్పటి వరకూ జాతీయ వార్తా సంస్థలు చేసిన సర్వేల్లోనూ డీఎంకే ముందుంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ స్టాలిన్ చేస్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు స్టాలిన్ తొలుత అంగీకరించ లేదు.

ఉప ఎన్నికలు కూడా ఉండటంతో…..

లోక్ సభ ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మిత్రుల మద్దతు స్టాలిన్ కు అవసరం. ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రంలో 2021 వరకూ అధికారం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే మిత్రులనూ సీట్ల పేరుతో దూరం చేసుకోకూడదని భావిస్తున్నారు. అలాగని 25 స్థానాల్లో పోటీ చేయాల్సిందేనని స్టాలిన్ పట్టుదలగా ఉన్నా కాంగ్రెస్ గట్టిగాకోరడంతో కొంచెం వెనక్కు తగ్గారు. అయితే సీట్ల సంఖ్యవిషయంలో స్పష్టత వచ్చినా ఏఏ సీట్లను కాంగ్రెస్ కు ఇస్తారన్నది తేలలేదు. మిగిలిన పక్షాలకు ఎక్కడెక్కడ? ఎన్ని సీట్లన్నదీ కూడా ఇంకానిర్ణయించలేదు.ఏ సీట్లన్నదీ స్టాలిన్ మాత్రమే నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News