తంబి మైండ్ గేమ్ మొదలుపెట్టారే

డీఎంకే మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇది ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే మీద మాత్రం కాదు. తన కూటమిలో ఉన్న పార్టీలపై డీఎంకే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే [more]

Update: 2020-09-29 16:30 GMT

డీఎంకే మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇది ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే మీద మాత్రం కాదు. తన కూటమిలో ఉన్న పార్టీలపై డీఎంకే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ వెంట ఉన్న పార్టీలు జారిపోకుండా చూసుకోవడమే కాకుండా, అదే సమయంలో సీట్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకునట్లుంది. అందుకే సీట్ల పంపకాల్లో ఆచితూచి వ్యవహరించాలని డీఎంకే నిర్ణయించింది.

అన్నీ అనుకూలంగా ఉండటంతో…..

తమిళనాడులో మరికొద్దినెలల్లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం డీఎంకే తీవ్రంగా శ్రమిస్తుంది. వాతావరణం, సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉండటంతో మరింత జోష్ మీద డీఎంకే ఉంది. డీఎంకే గత కొన్ని దఫాలుగా కూటమితోనే ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఒక్క డీఎంకే మాత్రమే కాదు తమిళనాడులోని ప్రధాన పార్టీలన్నీ కూటమిని కట్టేందుకే ప్రాధాన్యత ఇస్తాయి.

మిత్రపక్షాలను…..

తమిళనాడు అసెంబ్లీ లో మొత్తం 234 స్థానాలున్నాయి. డీఎంకే కూటమిలో పది వరకూ చిన్నా చితకా పార్టీలున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ తో పాటు సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్‌ కట్చి వంటి పార్టీలున్నాయి. ఈ కూటమి నుంచి విడిపోయే పార్టీలు పెద్దగా ఉండవనే చెప్పాలి. అయితే తమిళనాడులో కొత్త పార్టీలు పుట్టుకువస్తుండటంతో ఎన్నికల సమయంలో చిన్న పార్టీల డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. వీరు ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టనున్నారు. ఇదే డీఎంకే కు సమస్యగా మారనుంది.

200 స్థానాలు కావాలంటూ…..

అందుకే డీఎంకే మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. రానున్న ఎన్నికల్లో డీఎంకే 200 స్థానాల్లో పోటీ చేయాలని స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి డిమాండ్ చేశారు. ఈయనకు కోరస్ గా సీినియర్ నేత టీఆర్ బాలు ఉన్నారు. 200 స్థానాలను డీఎంకే తీసుకుంటే, మిగిలిన 34 స్థానాలను మిత్రపక్షాలకు పంచాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 200 సీట్లు డిమాండ్ చేస్తే కొంతలో కొంత అటుఇటుగా పోటీ చేయవచ్చన్నది డీఎంకే ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక పార్టీలు పుట్టుకొస్తున్న వేళ తమిళనాడులో మిత్రపక్షాలను సీట్ల విషయంలో సంతృప్తి పర్చడం స్టాలిన్ కు కత్తిమీద సామే అవుతుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News