ఆ నాలుగే కీలకమయ్యాయే…!!

తమిళనాడులో ఆసక్తికర పోరు జరుగుతోంది. ఇప్పటి వరకూ 40 లోక్ సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు మే [more]

Update: 2019-05-02 18:29 GMT

తమిళనాడులో ఆసక్తికర పోరు జరుగుతోంది. ఇప్పటి వరకూ 40 లోక్ సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు మే 19 వ తేదీన జరగనున్నాయి. ఈ నాలుగు నియోజవర్గాలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్పిడి కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉండటంతో అన్ని పార్టీలు తీవ్రంగ శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష డీఎంకే అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల వరకూ డీఎంకే ఆగలేకపోతోంది. అన్నీ కలసి వస్తే మే 23వ తేదీ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధికారం చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.

మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో….

తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మ్యాజిక్ ఫిగర్ కుదగ్గరలో ఉంది. 113 మంది సభ్యులు మాత్రమే అన్నాడీఎంకే కు ఉన్నారు. ఇటీవల జరిగిన 18 అసెంబ్లీ స్థానాలకు, మే 19వ తేదీన జరగబోయే నాలుగు స్థానాల్లో కనీసం పదిహేను స్థానాలను దక్కించుకోగలితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కన్పిస్తుంది. అందుకోసమే డీఎంకే, అన్నాడీఎంకే నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఈ ఉప ఎన్నికల్లో అధిక స్థానాలను దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే అధికారం చెక్కుచెదరదని వారు భావిస్తున్నారు.

మరో నాలుగు నియోజకవర్గాలకు….

తమిళనాడులో మే 19వ తేదీన సూలూరు, అరవకురిచ్చి, తిరుప్పరకుండ్రం, ఒట్ట పిండారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే డీఎంకే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. లోక్ సభ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఉప ఎన్నికలను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నాలుగు స్థానాల్లో గెలిచేందుకు 82 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించారంటేనే అర్థం చేసుకోవచ్చు. సీనియర్ నేతలను ఉప ఎన్నికల బరిలోకి స్టాలిన్ దించారు. మే 1వ తేదీ నుంచి స్టాలిన్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి.

అన్నాడీఎంకేను దెబ్బకొట్టేందుకే….

ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీటీవీ దినకరన్ పార్టీ అమ్మ మున్నేట్ర కళగం, కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ లు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అన్నాడీఎంకేను దెబ్బకొట్టేందుకు టీటీవీ దినకరన్ లోపాయికారీగా డీఎంకే తో చేతులు కలుపుతారన్న ప్రచారం ఉంది. కమల్ హాసన్ మాత్రం తన పార్టీ సత్తా చూపుతానంటున్నారు. మొత్తం మీద తమిళనాడులో లోక్ సభ ఎన్నికల కన్నా ఉప ఎన్నికల విషయంలోనే పార్టీలు ఆరాటపడుతుండటం విశేషం. ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటములే వారి రాజకీయ జీవితాన్ని నిర్దేశిస్తాయనడం మాత్రం నిజం. చివరకు గెలుపు ఎవరిది అవుతుందో చూడాలి.

Tags:    

Similar News