డీకే కు ఖాయమైనా?

పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాన్చుడు ధోరణిని అనుసరిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కు పదవి [more]

Update: 2020-02-23 16:30 GMT

పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాన్చుడు ధోరణిని అనుసరిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కు పదవి ఖాయమని తేలిపోయింది. ఆయనపై ఈడీ వంటి కేసులున్నా చివరకు ఆయనకు అప్పగించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే రేపు, మాపు అంటూనే పీసీీసీ చీఫ్ నియామకంలో జాప్యం చేయడానికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది.

రాజీనామా చేసి…..

కర్ణాటకలో ఉప ఎన్నికల ఓటమితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి దినేష్ గుండూరావు, శాసనసభ పక్ష నేత పదవికి సిద్ధరామయ్యలు రాజీనామా చేశారు. ఇందులో సిద్ధరామయ్య రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించలేదు. దినేష్ గుండూరావు రాజీనామాను మాత్రం ఆమోదించారు. అయితే కొత్త నేత ఎంపికపై సుదీర్ఘకాలంగా కసరత్తు జరిపింది. డీకే శివకుమార్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినా సిద్ధరామయ్య మాత్రం కొర్రీలు వేశారు.

సిద్ధూ కొర్రీలతో…..

పీసీసీ చీఫ్ పదవితో పాటు నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని సిద్ధరామయ్య అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచారు. మైనారిటీల నుంచి మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, ఎస్టీల నుంచి సతీష్ జార్ఖిహోళి, లింగాయత్ వర్గం నుంచి ఈశ్వర్ ఖండ్రే, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆంజనేయ లేకుంటే ధృవనారాయణ పేర్లను సిద్ధరామయ్య ప్రతిపాదించారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి డీకే శివకుమార్ అంగీకరించలేదు.

మరోసారి చర్చించిన తర్వాత…..

దీంతో కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ నియామకంపై ఇంకా అధికార ప్రకటన చేయలేదు. మరోసారి సిద్ధరామయ్యతో మాట్లాడిన తర్వాత డీకే పేరును ఖరారు చేయాలన్న యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల పర్యటనలు చేస్తున్నారు. సిద్ధరామయ్య మనసు నొప్పించకుండా డీకే శివకుమార్ కు పీసీసీ పీఠం అప్పగించాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. మరి ఎప్పటి వరకూ సాగదీస్తారో చూడాలి.

Tags:    

Similar News