విశాఖలోనూ కూల్చుడు షురూ

అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి జగన్ కన్నెర్ర చేయడం కాదు కానీ రాష్ట్రంలోని అధికారుల్లో ఎక్కడ లేని చురుకు పుట్టుకొస్తోంది. ఇక కూల్చుడే అంటూ అక్రమ భవనాల మీద [more]

Update: 2019-06-28 12:30 GMT

అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి జగన్ కన్నెర్ర చేయడం కాదు కానీ రాష్ట్రంలోని అధికారుల్లో ఎక్కడ లేని చురుకు పుట్టుకొస్తోంది. ఇక కూల్చుడే అంటూ అక్రమ భవనాల మీద ఒక్కసారిగా పడిపోతున్నారు. అక్రమాలను సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కి చెందిన జయభేరి సంస్థ అక్రమ కట్టడాలను విశాఖ జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. ఇక్కడ పాత కార్ల అమ్మకాలు, కొనుగోళ్ళ షో రూం కోసం జయభేరీ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు చేసింది. దాంతో తొలి అడుగు ఇటే అంటూ జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ఇపుడు ఆ పక్కనే ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీస్ మీద కూడా జీవీఎంసీ కన్ను పడింది. అది కూడా అనుమతులు లేకుండా కట్టిన అక్రమ నిర్మాణమేనని అంటున్నారు. దానితో పాటే అనకాపల్లికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు రెడీ అయిపోతున్నాయి.

సాగర తీరం టార్గెట్ :

ఇదిలా ఉండగా విశాఖ సాగర తీరంలో కోస్టల్ రెగ్యులేటరీ అధారిటీ నిబంధనలు కాలరాస్తూ పెద్ద సంఖ్యలో అక్రమంగా భవనాలు వెలిశాయి. ఇందులో ఐమాక్సులు, హొటళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్ని గత ప్రభుత్వాలు చూసీ చూడనట్లుగా అనుమతులు ఇచ్చినవే. దీంతో వీటి పని పట్టాలని మాజీ విశ్రాంత అధికారి, పర్యావరణ ఉద్యమకారుడు ఈఏఎస్ శర్మ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. అమరావతిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా వేదిక కూల్చివేతను కూడా సమర్ధించారు. అలాగే విశాఖ బీచ్ రోడ్డు నిండా అక్రమ నిర్మాణాలు కనిపిస్తాయని అంటున్నారు దాంతో ఇపుడు జగన్ ఈ అక్రమ కట్టడాలను ఏం చేస్తారా అన్న చర్చ సాగుతోంది.

గోదారి తీరంలోనూ :

ఇదే విధంగా గోదావరి తీరంలోనూ కూడా వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. నదీ గర్భంలో చొచ్చుకుని పోయేలా గుడులు, గోపురాలు ఇలా ఎన్నో ఉన్నాయి. పర్యాటకానికి సంబంధించి రిసార్టులు కూడా ఉన్నాయి. ఇపుడు వీటి సంగతి కూడా ముఖ్యమంత్రి జగన్ తేల్చేస్తారని అంటున్నారు. ఇందులో చూసుకుంటే ప్రభుత్వ శాఖ అయిన పర్యాటక రంగానికి సంబంధించిన భవనాలను కూల్చడం సులభమే అయినా రాజకీయ నాయకుల అక్రమ కట్టడాలు కూల్చడం ఓ సవాల్ అంటున్నారు. అయితే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ముఖ్యమంత్రి జగన్ జారీ చేయడంతో ఏపీవ్యాప్తంగా ఇక అక్రమ కట్టడాల మీద యుధ్ధమే జరుగుతుందని అంటున్నారు. విశాఖలో చూసుకుంటే బీచ్ రోడ్డు నిండా అక్రమ నిర్మాణాలు కనిపిస్తాయని అంటున్నారు. వీటన్నింటినీ జగన్ కూల్చేస్తే నిజంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కూడా అంటున్నారు

Tags:    

Similar News