బాధ్యత ఎవరిది?

సమాజంలో చైతన్యం వెల్లువెత్తింది. హైదరాబాద్ గల్లీలు మొదలు అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వరకూ ప్రతిస్పందించింది. అతివలపై అమానుషకాండకు అంతం పలకాలని భారతావని ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. [more]

Update: 2019-12-08 15:30 GMT

సమాజంలో చైతన్యం వెల్లువెత్తింది. హైదరాబాద్ గల్లీలు మొదలు అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వరకూ ప్రతిస్పందించింది. అతివలపై అమానుషకాండకు అంతం పలకాలని భారతావని ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. మహిళా లోకం గళమెత్తింది. మగాళ్లు సైతం గొంతు కలిపారు. దీని పర్యవసానం కావచ్చు. ఈ ఉదంతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కావచ్చు. ‘దిశ’ హత్యాచారంలో నిందితులు నలుగురూ ఎన్ కౌంటర్ కు గురయ్యారు. తక్షణ న్యాయం జరిగిందని యువత, మహిళలు పోలీసులకు నీరాజనాలు పలికారు. అంతా బాగానే ఉంది. అయినా ఇందులో మరో కోణంపైన కూడా మేధోవర్గాల్లో చర్చ మొదలైంది. ఏ దారుణానికైనా తక్షణ న్యాయం సంతృప్తి కలిగిస్తుంది. అయితే ఇటువంటి సంఘటనలపై విస్త్రుత ప్రచారంతో ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ చైతన్యం పెల్లుబుకినప్పుడు భవిష్యత్తులో సంఘటనలు పునరావ్రుతం కాకుండా ఉంటాయి. ఎన్ కౌంటర్ తో సంఘటన తీవ్రతపై చర్చకు పుల్ స్టాప్ పెట్టేసినట్లయింది. చట్టపరమైన మార్పులను డిమాండ్ చేస్తూ సమాజం నుంచి వచ్చే ఒత్తిడికీ బ్రేక్ పడింది.

సహజ న్యాయం ..సాగదీత…

నిజానికి ఒక ఘోర సంఘటన చోటు చేసుకున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా మనుషులు రాక్షసులుగా మారినప్పుడు వారిని రాక్షసంగానే శిక్షించాలని సంఘం కోరుకుంటుంది. ఒక అసహాయ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను దారుణ హింసకు గురిచేసి చంపడమంటే వారికి ఈ భూమిపై బ్రతికే హక్కులేదనేది సహజన్యాయం. చట్టాలూ అత్యంత అరుదైన కేసుల్లోమరణదండనే సరైన పరిష్కారమని సూచిస్తున్నాయి. అయితే ఈ న్యాయం జరిగే విధానంలో విపరీత జాప్యమే వ్యవస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. సాగదీత ధోరణి కారణంగా చట్టపరమైన శిక్షల కంటే ధిక్కార స్వరమే మేలని ప్రజలు భావిస్తున్నారు. దానికి నిదర్శనమే ఎన్ కౌంటర్ లో మానవ మ్రుగాలు నేలకొరిగినప్పుడు ప్రజల్లో కనిపించిన స్పందన. వెల్లువెత్తిన సంబరాలు. అమ్మాయిలపై అకృత్యాలకు సంబంధించిన సంఘటనలు జరిగినప్పుడు చట్టపరంగా రావాల్సిన మార్పులపై విస్త్రుతమైన చర్చ సాగాలి. ప్రజల్లో కనిపించే భావోద్వేగాలు, ఆవేశం అప్పటికప్పుడు చల్లారిపోతే రాజకీయ శ్రేణులకు ఉపశమనం లభిస్తుంది. పోలీసులపై ఒత్తిడి తగ్గుతుంది. అందువల్లనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు ధోరణి కనిపించినప్పుడు తక్షణ న్యాయం అన్న పావును ప్రభుత్వాలు, పోలీసువర్గాలు ప్రయోగిస్తుంటాయి.

చట్టం చుట్టమేనా…

నిజంగా చట్టంలో ఉన్న విధివిధానాలు సక్రమంగా అమలు చేస్తే దేశంలో న్యాయం జరగడానికి చాలా అవకాశం ఉంది. అయితే ఉన్నత, రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉన్నవారి విషయంలో దర్యాప్తు సంస్థలు ప్రభావితం కావడంతోనే చట్టమంటే భయం లేకుండా పోతోంది. ఈలోపం బయటపడకుండా కొన్ని కేసుల విషయంలో పోలీసులు, ప్రభుత్వాలు చాలా వేగంగా స్పందిస్తున్నాయి. సమాజంలో తలెత్తే అలజడిని అప్పటికప్పుడు చల్లబరుస్తున్నాయి. ఇన్ ప్లూయిన్స్ కలిగిన వర్గాల విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. ఇక్కడ చట్టం రెండు రకాలుగా పని చేస్తోంది. చట్టం ద్రుష్టిలో అంతా సమానులే అన్న అన్న ఆదర్శ వాక్యం ఆచరణలో కొరగాకుండా పోతోంది. సమాజంలో పెను అలజడికి, ఆందోళనకు దారితీసిన తీవ్ర సంఘటనల్లో ప్రజాబాహుళ్యం కోరుకునే న్యాయం వెంటనే జరిగి పోవాలంటే భారత న్యాయవ్యవస్థ అంగీకరించదు. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం.

రోజులు మారాలి…

రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ ను అభినందిస్తూ తమ బాధ్యతను తప్పించుకోవాలని చూస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, సత్వర న్యాయానికి సంబంధించిన చట్టాలు వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ తో తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకోజాలవు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో రూపుదిద్దిన 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్, 1872 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో అనేక సంస్కరణలు చేయాల్సి ఉంది. కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్యను నేరాల సంఖ్యకు అనుగుణంగా పెంచాల్సి ఉంది. అధునాతనమైన మౌలిక వసతులు, టెక్నాలజీని న్యాయవ్యవస్థకు అందించాల్సి ఉంది. ఈ బాధ్యతలన్నీ ప్రభుత్వాలు, చట్టసభలవే. వీటిని సమర్థంగా నిభాయించకుండా తీర్పులు చెప్పడంలో న్యాయవ్యవస్థ జాప్యం చేస్తోందన్నట్లుగా అటువైపు తోసేయడం దేశానికి మంచిది కాదు. రాష్ట్రపతి మొదలు కేంద్ర న్యాయశాఖ మంత్రి వరకూ అంతా ఒకే విధంగా స్పందించడం గమనిస్తున్నాం. వీరి అభిప్రాయాన్ని ప్రజాతీర్పుతో ముడిపడిన రాజకీయ కార్యనిర్వాహకవర్గ స్పందనగానే చూడాలి. అయితే చట్టాల్లో మార్పులు, న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యతగా పార్లమెంటు, ప్రభుత్వాలు గుర్తించాలి. దేశమంతా ఒక సెంటిమెంట్ , భావోద్వేగంలో ఉన్న తరుణంలో కూడా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే స్పందించిన తీరు న్యాయవ్యవస్థ దృక్పథానికి అద్దం పట్టింది. సాక్ష్యాధారాల ప్రాతిపదికపైనే తీర్పులు ఉంటాయి. పగ, ప్రతీకారంగా న్యాయం కనిపించకూడదు. ఒక సంఘటన జరిగిన వెంటనే తక్షణం తీర్పు ఆశించడమంటే న్యాయ లక్షణాలను మార్చాలనుకోవడమే అని విస్పష్టంగానే ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల్లో చట్టం పట్ల గౌరవం పెరిగేలా, నేరగాళ్లకు భయం పుట్టేలా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News