దినకరన్ వల్ల అవుతుందా?

తమిళనాడు ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతుంది. అంటే హ్యాట్రిక్ విజయమన్నమాట. అది సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతుంది. [more]

Update: 2020-10-09 18:29 GMT

తమిళనాడు ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతుంది. అంటే హ్యాట్రిక్ విజయమన్నమాట. అది సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతుంది. జయలలిత బతికుండగా రెండుసార్లు వరసగా పార్టీని విజయపథాన నిలిపి తన సత్తాను చాటారు. కానీ జయలలిత లేకుండా విజయం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు ఆ పార్టీ ముఖ్య నేతల నుంచే సరైన సమాధానం దొరకడం లేదు. ఒకటి మాత్రం చెబుతున్నారు. శశికళ పార్టీ పగ్గాలు చేపడితే విజయం దక్కే అవకాశాలున్నాయంటున్నారు.

ప్రయత్నాలు మొదలు పెట్టినా…

ఇందులో భాగంగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. దినకరన్ శశికళ జైలు నుంచి విడుదలయ్యే లోపు చిన్నమ్మకు గ్రౌండ్ రెడీ చేద్దామనుకుంటున్నారు. దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పెట్టారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మోస్తరు విజయాలను సాధించారు. ఆర్కేపురం ఉప ఎన్నికల్లో తాను గెలిచిందే తప్ప శాసనసభ ఉప ఎన్నికల్లో ఆయన సారథ్యంలో ఎవరూ గెలుపునకు నోచుకోలేదు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు…..

పైగా పళనిస్వామి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్ అనేకసార్లు ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించి విఫలయమ్యారు. దినకరన్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా పడింది. అప్పటి వరకూ అన్నాడీఎంకేను తమ చేతుల్లోకి తీసుకుంటారన్న నమ్మకంతో వారు దినకరన్ వైపు వెళ్లారు. ఇప్పుడు ఆ నమ్మకం మరోసారి శశికళ రాకతో ఏర్పడిందంటున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ వస్తే ఆమెతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు.

సంధికి యత్నాలు…..

ఈ నేపథ్యంలో దినకరన్ అన్నాడీఎంకేతో సంధికి ప్రయత్నాలు చేస్తున్నారు. శశికళకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారట. దీనికి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సహకరిస్తుందంటున్నారు. పళని, పన్నీర్ నాయకత్వంపై నమ్మకం లేని బీజేపీ శశికళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచిదని సూచిస్తుందట. మరి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు దినకరన్ అంటేనే మండిపడుతున్నారు. ఆయన చేసే సయోధ్య ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్నది ప్రశ్నార్థకమే.

Tags:    

Similar News