డిగ్గీరాజా… చేజేతులా కాంగ్రెస్ కు…?

దిగ్విజయ్ సింగ్… కాంగ్రెస్ లో ఒకప్పుడు కీలక నేత. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన నేత. ఆయన వరసగా కాంగ్రెస్ కు కష్టాలు తెచ్చి పెడుతున్నారు. మధ్యప్రదేశ్ రాజకీయాలను [more]

Update: 2020-03-24 18:29 GMT

దిగ్విజయ్ సింగ్… కాంగ్రెస్ లో ఒకప్పుడు కీలక నేత. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన నేత. ఆయన వరసగా కాంగ్రెస్ కు కష్టాలు తెచ్చి పెడుతున్నారు. మధ్యప్రదేశ్ రాజకీయాలను ఒడబోసిిన ఈ వృద్ధనేత రెండు రాష్ట్రాలను తన సొంత చేతులతో కాంగ్రెస్ కు దక్కనివ్వకుండా చేశారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడానికి దిగ్విజయ్ సింగ్ ఒంటెద్దు పోకడలేనన్నది అందరూ అంగీకరించే విషయమే.

గోవా ఎన్నికల్లోనూ….

గోవాలో గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు దిగ్విజయ్ సింగ్ గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా దిగ్విజయ్ సింగ్ అప్రమత్తం కాలేదు. గోవా ముఖం కూడా చూడలేదు. కాంగ్రెస్ కు గోవాలో 17 స్థానాలు రాగా, బీజేపీకి 13 స్థానాలే వచ్చాయి. దిగ్విజయ్ సింగ్ కాలక్షేపం చేస్తుంటూ కూర్చుంటే రాత్రికి రాత్రి బీజేపీ గోవాలో అధికారంలోకి వచ్చింది. ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సయితం ఎగరేసుకు వెళ్లింది.

పీకి పారేసినా…..

అప్పట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ దిగ్విజయ్ సింగ్ మీద మండి పడ్డారు. ఆయనకు గోవాతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జి పదవి నుంచి తొలగించారు. ఇక మధ్యప్రదేశ్ లోనూ దిగ్విజయ్ సింగ్ అదే రీతిన వ్యవహరించారు. కమల్ నాధ్ కు, దిగ్విజయ్ సింగ్ అసలు పొసగదు. కేవలం జ్యోతిరాదిత్య సింధియాను ఒంటరి చేయడానికే దిగ్విజయ్ సింగ్ కమల్ నాధ్ తో చేతులు కలిపారు. సింధియా పార్టీని వీడి వెళతారని ఊహించకుండా ఆయన్ను ఇబ్బందుల పాలు చేశారు. దిగ్విజయ్ సింగ్ చేష్టలతో కేవలం సింధియా మాత్రమే కాదు అధికారం కూడా పార్టీకి దూరం అవుతుందని భావించలేదేమో?

ఏడు పదుల వయసులో…..

కనీసం 22 మంది ఎమ్మెల్యేలు సింధియా వెంట ఉన్నారని తెలుసుకోకుండా దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిస్థితిని తెచ్చిపెట్టాయని చెప్పక తప్పదు. అంతా అయిపోయాక దిగ్విజయ్ సింగ్ ఏడు పదుల వయసులో పోరాట బాట పట్టారు. చేతుల కాలాక ఆకులు పట్టుకున్న మాదిరి దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు. మొత్తం మీద సీనియర్ నేతననే చెప్పుకునే దిగ్విజయ్ సింగ్ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు కష్టాలు తెచ్చిపెట్టారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News