ఈ టీడీపీ నేత గ్రాఫ్ పెరిగిందా ?

టీడీపీలో నేత‌ల‌కు గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి కూడా క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. అనేక మంది కీల‌క నేత‌లు.. ప‌లు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు కూడా అయ్యారు. [more]

Update: 2021-07-04 06:30 GMT

టీడీపీలో నేత‌ల‌కు గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి కూడా క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. అనేక మంది కీల‌క నేత‌లు.. ప‌లు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు కూడా అయ్యారు. టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర.. ఇలా అనేక మంది కేసుల్లో ఇరుక్కుని.. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారే. ఇదే విధంగా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ దిగ్గజం, ఐదు సార్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కూడా ఇటీవ‌ల సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడ్డారంటూ.. సీఐడీ పోలీసులు.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం తెలిసిందే.

సంగం డెయిరీలో…

త‌ర్వాత కొన్నాళ్లు ధూళిపాళ్ల న‌రేంద్ర జైల్లో ఉండ‌డం.. ఆ త‌ర్వాత ఇటీవ‌ల‌ బెయిల్ రావ‌డం తెలిసిందే. అయితే.. టీడీపీలో ఇప్పటి వ‌ర‌కు అరెస్టయి.. బెయిల్‌పై వ‌చ్చిన నేత‌ల‌కు, ధూళిపాళ్ల న‌రేంద్రకు చాలా తేడా ఉంది. కొల్లు ర‌వీంద్ర ఓ హ‌త్య కేసులోను, అచ్చెన్నాయుడును ఈఎస్ ఐ మందుల కుంభ‌కోణానికి సంబంధించిన‌ అవినీతిలోను అరెస్టు చేశారు. కానీ, సంగం డెయిరీ చైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల వ్యవ‌హారానికి వ‌చ్చేస‌రికి.. వేలాది మంది రైతుల‌కు, ల‌క్షల కుటుంబాల‌కు సంబంధించిన విష‌యం. సంగం డెయిరీ ద్వారా ఆయ‌న అక్రమాల‌కు పాల్పడ్డార‌ని ప్రభుత్వం తెలిపింది.

పెల్లుబికిన సానుభూతి….

అయితే.. నిజంగానే ధూళిపాళ్ల న‌రేంద్ర అక్రమాల‌కు పాల్పడి ఉంటే.. రైతులు, వారి కుటుంబాలపై ప్రభావం ప‌డి ఉండాలి. దీంతో ధూళిపాళ్ల ప్రాతినిధ్యం వ‌హించిన పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంపై అరెస్టు ప్రభావం ఖ‌చ్చితంగా ఉండాలి. ప్రజ‌ల‌ను ధూళిపాళ్ల న‌రేంద్రపై ఆగ్రహంతో ఉండాలి. కానీ, చిత్రంగా ధూళిపాళ్ల న‌రేంద్రపై సానుభూతి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ధూళిపాళ్లపై ఇప్పటి వ‌ర‌కు ఈ పాతికేళ్లలో ఒక్క మ‌ర‌క కూడా లేక‌పోవ‌డం.. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం వంటివి ఆయ‌న‌కు మంచి మార్కులు వేయిస్తున్నాయి.

ఆఫర్లు వచ్చినా…?

అంతేకాదు.. జ‌గ‌న్ స‌ర్కారు దూకుడు స‌రికాద‌ని.. ధూళిపాళ్ల న‌రేంద్ర వంటి నేత‌పై రాజ‌కీయంగా ప్రజా క్షేత్రంలో ఏదైనా ఉంటే చూసుకోవాలి.. త‌ప్ప ఇలా వ్యక్తిగ‌త క‌క్షల‌కు దారితీసేలా వ్యవ‌హ‌రించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే ధూళిపాళ్లకు వైసీపీలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని గ‌ట్టిగా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఆయ‌న పార్టీ మార‌లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న్ను ప్రభుత్వం సంగం డెయిరీ కేసుల్లో అరెస్టు చేసినా కావాల‌నే టార్గెట్ చేసింద‌న్న సంకేతాలే ప్రజ‌ల్లోకి ఎక్కువగా వెళ్లాయి. మొత్తంగా చూసుకుంటే.. తాజా సంగం వివాదం అనంత‌రం..ధూళిపాళ్ల న‌రేంద్రకు సానుభూతి పెరిగింద‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News