ఆ.. యోగం లేనట్లే…..!!

ధర్మాన ప్రసాదరావు…సీనియర్ నేత. రాజకీయాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరు మోసిన లీడర్. ధర్మాన ప్రస్తుతం సైలంట్ గా ఉన్నారు. అంతకంటే ఆయనకు వేరే ఆప్షన్ లేదనుకోండి. ధర్మాన [more]

Update: 2019-07-04 14:30 GMT

ధర్మాన ప్రసాదరావు…సీనియర్ నేత. రాజకీయాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరు మోసిన లీడర్. ధర్మాన ప్రస్తుతం సైలంట్ గా ఉన్నారు. అంతకంటే ఆయనకు వేరే ఆప్షన్ లేదనుకోండి. ధర్మాన ప్రసాదరావు తనకు మంత్రి పదవి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తొలి మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు జగన్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించడం ఆయనకు కొంత ఊరట అయినా రెండున్నరేళ్ల తర్వాత అయినా తనకు మంత్రి పదవి వస్తుందన్న గ్యారంటీ లేకపోవడమే ధర్మాన ప్రసాదరావును కలచి వేస్తుందంటున్నారు.

రెండున్నరేళ్ల తర్వాతైనా….?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఒక ప్రకటన చేశారు. ఈ మంత్రివర్గం రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుందని, రెండున్నరేళ్ల తర్వాత తిరిగి కొత్త మంత్రి వర్గం ఏర్పాటవుతుందని వెల్లడించారు. ఈదఫా రాని వారికి వచ్చే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో మంత్రి పదవులు దక్కని వారు సయితం రెండున్నరేళ్లు వేచిచూద్దామనే ధోరణిలో ఉన్నారు. కానీ ధర్మాన ప్రసాదరావుది విచిత్రమైన పరిస్థితి. ఆ జిల్లాలో తన సోదరుడు దర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవిని ఇచ్చారు. అలాగే మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం ను స్పీకర్ గా ఎంపిక చేశారు.

ఛాన్స్ లేదన్నది…..

తమ్మినేని సీతారాంను స్పీకర్ పదవి నుంచి తొలగించే అవకాశం లేదు. కృష్ణదాస్ ను రెండున్నరేళ్ల తర్వాత తొలగించినా ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇస్తారన్న ఆశలేదు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దఫా ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కే యోగం లేదంటున్నారు. మంత్రి పదవి దక్కకపోవడానికి, ధర్మానను జగన్ పక్కన పెట్టడానికి కూడా కారణాలు లేకపోలేదు. ధర్మాన ప్రసాదరావు కారణంగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యామన్నది పోలింగ్ తర్వాత పార్టీ జరిపిన విశ్లేషణలో వెల్లడయినట్లు చెబుతున్నారు.

క్రాస్ ఓటింగ్ కు…..

శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకున్నప్పటికి వైసీపీ ఎంపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడుచేతిలో కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ధర్మాన ప్రసాదరావు అని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే జగన్ కు ఫిర్యాదుచేశారు. కింజారపు, ధర్మానలు ఒకే సామాజిక వర్గం కావడంతో క్రాస్ ఓటింగ్ కు ధర్మాన ప్రసాదరావు బలగం పాల్పడిందన్న అనుమానాలు పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి. దీంతోనే జగన్ ధర్మానకు తొలి దశలో మంత్రిపదవి ఇవ్వలేదంటున్నారు. దీంతో పాటు సోదరుడు కృష్ణదాస్ తనకోసం అప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ప్రసాదరావు కంటే తనకు ముందుగా మద్దతు పలకడం వంటివి ఆయనకు కలసి వచ్చాయంటున్నారు. మొత్తం మీద ధర్మానకు ఈ ఐదేళ్ల పాటు మంత్రి యోగం లేనట్లేనన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News