మొత్తానికి ధర్మాన నెగ్గించుకున్నారు ?

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు రాజకీయంగా, పాలనాపరంగా విశేష అనుభవం ఉంది. ఇక ఆయన సమయం చూసుకుని పార్టీ వేదికల మీద తన అభిప్రాయాలను కుండబద్దలుకొడతారు. ఇది [more]

Update: 2020-08-15 13:30 GMT

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు రాజకీయంగా, పాలనాపరంగా విశేష అనుభవం ఉంది. ఇక ఆయన సమయం చూసుకుని పార్టీ వేదికల మీద తన అభిప్రాయాలను కుండబద్దలుకొడతారు. ఇది ఒకందుకు మంచిదేనని ఇపుడు వైసీపీ నేతలు అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు డిమాండ్ ను ప్రభుత్వం ఆమోదిస్తే అది పార్టీకే మేలుగా ఉంటుంది. అదే విపక్షం రచ్చ చేసి సాధించుకుంటే ఆ క్రెడిట్ వారికే పోతుందని కూడా అంటున్నారు. ఇపుడు జగన్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయాన్ని మార్చేలా చేసి ప్రసాదరావు తమ మాటను నెగ్గించుకున్నారు. యువ ముఖ్యమంత్రి వద్ద తనకు గట్టి పట్టు ఉందని కూడా నిరూపించుకున్నారు.

ఎచ్చెర్ల ఉంటుందిట….

పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే శ్రీకాళం నుంచి మూడు కీలక‌ నియోజకవర్గాలు పోతాయని, అంతే కాదు, అభివృధ్ధి మూడు దశాబ్దాల వెనక్కు పోతుందని కూడా ఏకంగా పార్టీ వేదికలు ఎక్కి మరీ ధర్మాన ప్రసాదరావు గర్జించారు. ఇలా అయితే వైసీపీకి పొలిటికల్ గా కూడా ఇబ్బందేనని కూడా చెప్పేశారు. ధర్మాన ప్రసాదరావు ఇలా గట్టిగా చెప్పడం వల్లనే జగన్ కొత్త జిల్లాల విషయంలో కమిటీని ఏర్పాటు చేశారు అంటున్నారు. అంతే కాదు, ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించమంటున్నారు. ఈ క్రమంలో ఎచ్చెర్లను శ్రీకాకుళంలో ఉంచాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారుట. దాంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జగన్ దగ్గర వెయిట్ బాగా పెరిగింది అని అంటున్నారు.

అన్నీ అక్కడే …..

నిజానికి ఎచ్చెర్ల శ్రీకాకుళానికి గుండెకాయ లాంటిది ఇక్కడే పారిశ్రామిక వాడ ఉంది. అంబేద్కర్ యూనివర్శిటీ ఉంది. అంతే కాదు, ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఆదాయవనరుగా ఈ ప్రాంతం ఉంది. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో ఎచ్చెర్ల కీలక భూమిక పోషిస్తోంది. దీన్ని కనుక విజయన‌గరానికి ఇచ్చేస్తే సిక్కోలు జిల్లాకు ఇక్కట్లు తప్పవన్న విశ్లేషణలు ఉన్నాయి. దీని మీద మొదట ధర్మాన ప్రసాదరావు నోరు తెరచాకా టీడీపీ లాంటి విపక్షాలు కూడా గొంతు కలిపాయి. ఇపుడు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కలుగచేసుకుని శ్రీకాకుళంలో ఎచ్చెర్లను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ధర్మాన ప్రసాదరావు నోటి ధాటి ఏంటో తెలిసిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

చక్రం తిప్పారా…?

సరైన సమయంలో అన్న ధర్మాన కృష్ణ దాస్ రెవిన్యూ మంత్రి కూడా కావడంతో చక్రం తిప్పారని అంటున్నారు. శ్రీకాకుళం ఇప్పటికే వెనకబడిపోయిందని, అటువంటి చోట అభివృధ్ధి ఉండాలని క్రిష్ణదాస్ కూడా ముఖ్యమంత్రికి వివరించారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ కూడా శ్రీకాకుళానికి అన్యాయం జరగరాదని గట్టిగా అభిప్రాయపడ్డారని భోగట్టా. ఇక ఇదే జిల్లాలోని పాలకొండ, రాజాం మాత్రం విజయనగరం జిల్లాలో కలవనున్నాయని నంటున్నారు. ఇక పాలకొండ గిరిజన ప్రాంతం. అది కొత్త గిరిజన జిల్లాలో భాగం ఆవుతుందేమో చూడాలి. మొత్తం మీద శ్రీకాకుళంతో మొదలైన జిల్లాల విభజన ముసలం ముదర‌కుండా సాఫీగా ముగిసినట్లే. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జగన్ ఆయన మాటకు విలువ ఇస్తున్నారని వైసీపీలో ఇపుడు వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News