ధర్మాన బుక్ అయినట్లే

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు బుక్ అయినట్లేనా అన్న చర్చ ఇపుడు జరుగుతోంది. ధర్మాన కాంగ్రెస్ సర్కార్ లో [more]

Update: 2020-01-10 05:00 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు బుక్ అయినట్లేనా అన్న చర్చ ఇపుడు జరుగుతోంది. ధర్మాన కాంగ్రెస్ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన వైఎస్ హయాంలో పలు కీలకమైన శాఖలను చూశారు. ధర్మాన ప్రసాదరావుపైన నాటి వాన్ పిక్ కేసు బూజు మళ్ళీ దులిపేందుకు సీబీఐ రెడీ అవుతోంది. ఈ మేరకు విచారణ చేపట్టవచ్చునని సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధర్మాన ప్రసాదరావు ఇరాకాటంలో పడ్డారు. వాన్ పిక్ కేసులో ధర్మాన ముద్దాయిగా ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద ఆయన మీద ఆరోపణలు అప్పట్లో నమోదు అయ్యాయి. వాటి మీద ధర్మాన ప్రసాదరవును విచారించేందుకు సీబీఐ కోర్టు తాజాగా అనుమతించింది.

బిగ్ షాకే…..

ధర్మాన ప్రసాదరావు విషయంలో ఇది బిగ్ షాక్ గా భావిస్తున్నారు. నిజానికి ఈ కేసు విషయంలో ఇపుడు ధర్మాన ప్రసాదరావు రిలీఫ్ గా ఉన్నారు. ఆయన మీద మళ్ళీ విచారణ అంటూ సీబీఐ కేసు ఫైల్ చేయడంతో ఇక ధర్మాన కూడా ప్రత్యేక న్యాయస్థానం చుట్టూ తిరగకతప్పదని అంటున్నారు. అదే విధంగా సీబీఐ కూడా ఆయన్ని విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ మీదట ఏ రకమైన పరిణామాలు జరుగుతాయో కూడా ఎవరికీ తెలియదు అంటున్నారు. మరి ఉన్నట్లుండి ధర్మాన ప్రసాదరావు కేసు విషయం ఇలా బయటకు రావడానికి కారణాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అసంతృప్తిగా…

మరో వైపు ధర్మాన ప్రసాదరావు వైసీపీలో ఉన్నా కూడా మంత్రి పదవి లేదు, కేవలం సాధారణ ఎమ్మెల్యేగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఆయనని ఇతర పార్టీలు కూడా తమతో చేరమని ఆహ్వానించినట్లుగా కూడా గతంలో ప్రచారం అయింది. బీజేపీలో ధర్మాన చేరుతారని కూడా అప్పట్లో అనుకునేవారు. అయితే ఎందుకో ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయ్యారు. ఆయన మెల్లగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కి సన్నిహితం అయ్యేందుకు కూడా ఇటీవల ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో సీబీఐ దూకుడు పెంచడం అంటే కొత్త డౌట్లు కూడా వస్తున్నాయని ప్రచారం సాగుతోంది.

నాని ద్వారా…..

మరో వైపు జిల్లా ఇంచార్జి మంత్రి కొడాలి నాని మధ్యవర్తిత్వం ద్వారా ధర్మాన ప్రసాదరావుకు, జగన్ కి మధ్య విభేదాలు తగ్గిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ గట్టిగా ఉండాలంటే ధర్మాన ప్రసాదరావు వంటి నేత మంత్రివర్గంలో ఉండడం ముఖ్యమని నాని భావిస్తున్నారు. ఆయన జిల్లా రాజకీయాలపైన ఇప్పటికే జగన్ కి నివేదించారని కూడా అంటున్నారు. జగన్ కనుక తలచుకుంటే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి కూడా పెద్ద కష్టం కాబోదు, దానికి రెండున్నరేళ్ళు ఆగాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఇపుడు సీబీఐ ప్రాసిక్యూట్ చేయడానికి ముందుకు రావడంతో ధర్మాన ప్రసాదరావుకు లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యాయని అంటున్నారు. మరి సీబీఐ అంటేనే సుదీర్ఘమైన విచారణ ఉంటుంది. దాంతో ధర్మాన ప్రసాదరావుకు దారులు మూసుకు పోయాయని అంటున్నారు. ఇదే విషయమై అనుచరులు కూడా ఖంగు తింటున్నారు.

Tags:    

Similar News