మంత్రి పదవి లేనట్లేనట

ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయనది దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. దాదాపు పదమూడేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి ధర్మాన ప్రసాదరావుకు మలి [more]

Update: 2019-10-21 00:30 GMT

ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయనది దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. దాదాపు పదమూడేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి ధర్మాన ప్రసాదరావుకు మలి విడత విస్తరణలోనూ మంత్రి పదవి దక్కే అవకాశం లేదన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఆయన ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసి శ్రీకాకుళం సమస్యలను వివరించారు. జగన్ సానుకూలంగా స్పందించారన్న వార్తలు వచ్చాయి. అయితే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావును ప్రాంతీయ మండలి ఛైర్మన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

తొలి విడతలోనే….

నిజానికి సీనియారిటీని చూసుకుంటే ధర్మాన ప్రసాదరావుకు తొలి విడతలోనే మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే ఆయన గతంలో, ఇటీవల చేసిన పొరపాట్లు కారణంగా ధర్మాన ప్రసాదరావును జగన్ పక్కన పెట్టారని చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు జగన్ ను విమర్శించారు. దీంతో పాటుగా పార్టీకి అవసరమైనప్పుడు కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలో చేరిపోయారు. కానీ ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ తొలి నుంచి జగన్ ను నమ్ముకుని ఉన్నారు. అందుకే ఆయనను మంత్రిపదవికి ఎంపిక చేశారు.

నియోజకవర్గానికే…..

ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమిత మయ్యారు. ఆయన తన కుమారుడికే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. పార్టీలో అధికారంలోఉందని కొందరు అనుచరులు సిఫార్సు చేయమని తన వద్దకు వచ్చినా ధర్మాన ప్రసాదరావు నో చెబుతున్నారు. తనకు ఎలాంటి అధికారం లేదని ఆయన పనికోసం వచ్చిన వారికి చెబుతుండటం విశేషం. ధర్మాన మౌనంగా ఉండటానికి కారణం నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ చెప్పడమే కారణమన్న ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంది.

నామినేటెడ్ పోస్టు అట…..

ధర్మాన ప్రసాదరావుపై జగన్ కు కొందరు లేని పోనివి చెప్పారని ఆయన అనుచరులు అంటున్నారు. వైసీపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేకపోవడానికి ధర్మాన ప్రసాదరావు కారణమని, ఆయన లోపాయికారీగా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారని ధర్మాన ప్రసాదరావు వ్యతిరేక వర్గీయులు జగన్ కు చేరవేశారు. ఈ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించడంతో ధర్మాన ప్రసాదరావు మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అందుతున్న సమాచారం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత కూడా ధర్మాన ప్రసాదరావుకు జగన్ కేబినెట్ లో చోటు ఉండదు. ఈ ప్రచారం మాత్రం సిక్కోలులో జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News