అన్నదమ్ములు దమ్ము చూపిస్తారా?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు రూట్ మార్చారు. ముఖ్యమంత్రి జగన్ బాటలోకి వచ్చారు. నాలుగు నెలల అలకను [more]

Update: 2019-10-16 06:30 GMT

శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు రూట్ మార్చారు. ముఖ్యమంత్రి జగన్ బాటలోకి వచ్చారు. నాలుగు నెలల అలకను వీడి స్వయంగా అమరావతి వెళ్ళి మరీ జగన్ ని కలిసివచ్చారు. అధికార పార్టీ సభ్యునిగా తన బాధ్యతను సకాలంలో బాగానే గుర్తించిన ధర్మాన ప్రసాదరావు జగన్ ని ప్రసన్నం చేసుకున్నారు. పరిధులు పరిమితులు గుర్తుంచుకుని మరీ జగన్ కి, వైసీపీ సర్కార్ కి సమయోచిత సలహాలు కూడా ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిత్వం పదికాలాలు పరిడవిల్లాలని కూడా ఆకాంక్షించారు. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు తనకు తానే విధించుకున్న ఎడబాటుని తానే తొలగించుకుని వైసీపీకి మరీ ముఖ్యంగా జగన్ కి చేరువ కావడానికి గట్టిగానే ప్రయత్నం చేశారు.

శ్రీకాకుళంపై శ్రధ్ధ….

ఎన్నికల సమయంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి తాను ఇచ్చిన హామీల మేరకు పలు అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టాల్సివుందని, దానికి సమగ్రమైన కార్యాచరణతో పాటు, పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయని జగన్ దృష్టికి ధర్మాన ప్రసాదరావు తెచ్చారు. అదే సమయంలో హామీ ఇస్తే కాదని, జగన్ సమక్షంలోనే తగిన యాక్షన్ ప్లాన్ ప్రకటించి అధికారులకు నిధులు విధులు అప్పగించాలని కూడా కోరినట్లుగా తెలిసింది. వీటన్నిటికీ జగన్ అంగీకారం తెలపడమే కాదు తానే స్వయంగా శ్రీకాకుళం అభివృధ్దికి దగ్గరుండి మరీ ప్లాన్ తయారుచేయిస్తానని చెప్పడంతో ధర్మాన ప్రసాదరావు గట్టి విజయం సాధించినట్లైంది. అదే సమయంలో మొత్తం శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పూర్తి అభివృధ్ధికి కూడా ప్రణాళిక రచించాలని ధర్మాన ప్రసాదరావు జగన్ ని కోరడం విశేషం. తనకు ఉన్న విశేష అనుభవంతో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో వివరించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొత్తం జిల్లాను అభివ్రుధ్ధిపధంలో నడిపించేందుకు వైసీపీ సర్కార్ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా జగన్ కి విశదపరచారని తెలుస్తోంది.

ధర్మానకు లైన్ క్లియరేనా…?

జగన్ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు, సామాజికసమీకరణలు చూసుకుంటే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి మళ్ళీ దక్కడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఆయన తమ్ముడు క్రిష్ణదాస్ కి మంత్రి పదవి ఇచ్చినా సమర్ధుడుగా ఆయన నిరూపించు కోలేకపోయారు. ఈ దశలో ధర్మాన ప్రసాదరావు మౌనంతో జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకుని కూడా వైసీపీ రాజకీయంగా దారుణంగా నష్టపోతోంది. ఇంకోవైపు కాళింగులను ముందు వరసలో ఉంచి రాజకీయం చేయాలనుకున్న జగన్ కి స్థానిక పరిస్థితులు కొంత అంతరాయం కలిగిస్తున్నాయి. ఇక జగన్ శ్రీకాకుళంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని అనుకున్న దశలో ధర్మాన ప్రసాదరావు అలకపానుపు వీడడం శుభపరిణామంగా పేర్కొంటున్నారు. అనుభవశాలి అయిన ధర్మాన ప్రసాదరావు సేవలు కనుక అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడితే సిక్కోలులో టీడీపీకి ఇబ్బందేనని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ధర్మాన ప్రసాదరావుకు నామినెటేడ్ పదవి కూడా ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది. మరి సిక్కోలులో ఇపుడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్న దమ్ములు చూపిస్తారా చూడాలి.

Tags:    

Similar News