ధర్మానకు జగన్ అల్టిమేటం…?

జగన్ కి ఇపుడు సీనియర్ల మీద చిర్రెత్తుకు వస్తోంది. ఎంతో అనుభవం ఉన్న వారు సైతం సైలెంట్ గా ఉండడంతో పాటు పార్టీని కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు [more]

Update: 2020-11-17 13:30 GMT

జగన్ కి ఇపుడు సీనియర్ల మీద చిర్రెత్తుకు వస్తోంది. ఎంతో అనుభవం ఉన్న వారు సైతం సైలెంట్ గా ఉండడంతో పాటు పార్టీని కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అని జగన్ భావిస్తున్నారుట. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఈ మధ్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఇదే జిల్లా నుంచి ఏపీ కొత్త టీడీపీ ప్రెసిడెంట్ గా కింజరాపు కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడుని చంద్రబాబు కావాలనే ఎంపిక చేసి పెట్టారు. సీనియర్ గా, రాజకీయ చతురుడిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు లాంటి వారికి సరిగ్గా ఇదే సమయంలో పెద్ద బాధ్యత పడింది అంటున్నారు.

ఆపేందుకు రెడీనా…?

బిగ్ పొలిటికల్ ఫిగర్ గా ఉన్న అచ్చెన్నాయుడిని జిల్లాలో ఆపాలంటే అది సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు లాంటి వారి వల్లనే అవుతుంది. ఆ సంగతి తెలిసిన జగన్ ఆయనకు పార్టీలో చురుకుగా ఉండమంటున్నారుట. అన్న, మంత్రి అయిన క్రిష్ణ దాస్ ద్వారా ప్రసాదరావుకు ఈ మేరకు కబుర్లు కూడా వెళ్లాయి అంటున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు మాత్రం తన పట్టు, బెట్టుని అసలు వీడడంలేదు. ఆయనకు మంత్రి పదవిని జగన్ ఇవ్వలేదు. తన అనుభవం కావాల్సివచ్చినపుడు దాన్ని ప్రభుత్వంలోనే వినియోగించువచ్చు కదా అన్నది ధర్మాన ప్రసాదరావు వాదన. ఆయన పూర్తిగా ఇంటికీ, తన అనుచరులకే పరిమితమైపోయారు. దాంతో వైసీపీ జిల్లాలో పడకేస్తోంది అన్న నివేదికలు హై కమాండ్ ని కలవరపెడుతున్నాయి.

జిల్లా పీఠానికి నో …..

ధర్మాన ప్రసాదరావును వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ ని చేయాలని జగన్ ప్రతిపాదించారుట. ధర్మాన జనంలోకి వస్తే పార్టీకి అదే పెద్ద బలం అవుతుందని, క్యాడర్ సైతం ఉత్సాహంగా ఉంటారని కూడా లెక్కలు వేశారట. కానీ ధర్మాన మాత్రం ఆ పదవికి నో చెప్పేశారట. తన సహచరుడు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న తాను జిల్లా ప్రెసిడెంట్ ఏంటన్నది ధర్మాన వాదనగా ఉందిట. దీంతో చేసేది లేక జగన్ రెడ్డి శాంతికి జిల్లా ప్రెసిడెంట్ కిరీటాన్ని అందించాలనుకుంటున్నారుట. అదే సమయంలో జగన్ ధర్మాన ప్రసాదరావు మీద గుస్సా మీద ఉన్నారని చెబుతున్నారు.

తీరు మార్చుకోవాలి……

మాజీ మంత్రిగా, జిల్లా పెద్దగా ధర్మాన ప్రసాదరావు తన తీరుని మార్చుకోవాలన్న సందేశాన్ని జగన్ క్రిష్ణ దాస్ ద్వారా పంపించారని చెబుతున్నారు. ధర్మాన కనీసం శ్రీకాకుళంలో చురుకుగా ఉంటే జిల్లా మొత్తం పార్టీ గాడిన పడుతుందని కూడా జగన్ అంటున్నారుట. ఆయన ఇదే తీరున తరచూ అలక పానుపు ఎక్కితే మాత్రం కష్టమేనన్న భావనను జిల్లా నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. జగన్ ఇక ఏ మాత్రం ఉపేక్షించరని కూడా అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు టార్గెట్లు పెట్టి మరీ నేతల నుంచి విజయాన్ని రాబట్టుకోవాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారుట. తేడా వస్తే అపుడే పార్టీలో అసలైన ప్రక్షాళన మొదలవుతుంది అంటున్నారు. చూడాలి మరి జగన్ ధర్మాగ్రహం జిల్లాలో ఏ మార్పులను తీసుకొస్తుందో.

Tags:    

Similar News