ధ‌ర్మాన మంత్రి ప‌ద‌వికి.. అడ్డం పడుతోందెవ‌రంటే.?

ధర్మాన ప్రసాద‌రావు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. మాజీ మంత్రి. కాంగ్రెస్‌లో ఉండ‌గా జిల్లా మొత్తం ఆయ‌న క‌నుస‌న్నల్లోనే ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో [more]

Update: 2020-07-03 14:30 GMT

ధర్మాన ప్రసాద‌రావు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. మాజీ మంత్రి. కాంగ్రెస్‌లో ఉండ‌గా జిల్లా మొత్తం ఆయ‌న క‌నుస‌న్నల్లోనే ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో జిల్లాను ధ‌ర్మాన త‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు. ధ‌ర్మాన ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా ఉండేది. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు వైసీపీలో చుక్కలు లెక్కపెడుతున్నారా? సొంత పార్టీలోనే శ‌త్రువుల‌ను ఆయ‌న పెంచుకున్నారా? లేక కొంద‌రు నాయ‌కులు ఆయ‌ననే శ‌త్రువుగా చూస్తున్నారా ? అందుకే ఆయ‌న ఎంత‌గా కోరుతున్నా.. మంత్రి కాలేక‌పోతున్నారా? అనే సందేహాలు.. శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.

సీనియర్ నేతగా ఉన్నా…..

విష‌యం లోకి వెళ్తే.. కాంగ్రెస్ హ‌యాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న ధ‌ర్మాన ప్రసాదరావు కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌ను నిర్వహించారు. సౌమ్యుడు, ఆలోచ‌నాప‌రుడు, స‌ద్విమ‌ర్శల‌తో ప్రత్యర్థుల‌ను సైతం క‌ట్టడి చేసే నిర్మాణాత్మక వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా ఆయ‌న‌కు పేరుంది. అసెంబ్లీలో ధ‌ర్మాన స్పష్టమైన మాట‌లు, విమ‌ర్శల‌కు ఆన్సర్ చేసేందుకు ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీ నేత‌ల ద‌గ్గర మాట‌లు కూడా ఉండ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలోనే గ‌త కాంగ్రెస్ హ‌యాంలో దివంగ‌త వైఎస్‌, ఆ త‌ర్వాత రోశ‌య్య, కిర‌ణ్‌కుమార్ సైతం ధ‌ర్మాన‌కు జిల్లా రాజ‌కీయాల్లో మంచి ప్రయార్టీ ఇచ్చారు. ఇక‌, రాష్ట్ర విభ‌జన త‌ర్వాత వైసీపీ గూటికి చేరారు. 2014లో శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసినా.. ఓడిపోయారు. గత ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్ నాయ‌కుడినైన త‌న‌కు మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని ధర్మాన ప్రసాద‌రావు భావించారు.

వీరంతా వ్యతిరేకమే…..

అయితే, అనూహ్యంగా ఆయ‌న అన్న, కృష్ణదాస్‌ను మంత్రి ప‌ద‌వి వ‌రించింది. వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా మెలిగిన నాయ‌కుడిగా కృష్ణదాస్ పేరు తెచ్చుకున్నారు. జ‌గ‌న్ కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని, ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంతో పాటు పార్టీ పెట్టిన‌ప్పుడు జిల్లా పార్టీ ప‌గ్గాలు కూడా మోశారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలో చోటు ఇచ్చార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, దీని వెనుక ధ‌ర్మాన‌ ప్రసాదరావుపై పెద్ద రాజ‌కీయ‌మే జ‌రిగింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. స్థానికంగా జిల్లా వైసీపీ నేత‌ల‌తో ధ‌ర్మాన‌కు పొస‌గ‌ద‌ని, వారంతా వ్యతిరేకిస్తార‌ని, అందుకే కృష్ణదాస్‌కు జైకొట్టార‌ని అంటున్నారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు సీదిరి అప్పల‌రాజు, రెడ్డి శాంతి స‌హా చాలా మంది వైసీపీ కీల‌క నాయ‌కులు ధ‌ర్మాన‌ ప్రసాదరావును వ్యతిరేకిస్తున్నారు.

ఒక ఓటు అటు.. ఒక ఓటు ఇటు….

ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పీఠం ద‌క్కితే.. త‌మ ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతుంద‌ని, త‌మ మాట అప్పుడు ఏ అధికారి కూడా ఖాత‌రు చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వీరంతా కూడా అంటున్నారు. అంతే కాకుండా జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ధ‌ర్మాన వేలు పెట్టేస్తార‌ని వారంతా జ‌గ‌న్ ముందు వాపోయార‌ట‌. ఇక టెక్కలిలో ఓడిపోయిన పేరాడ తిల‌క్ సైతం జగ‌న్ వ‌ద్ద ధ‌ర్మాన‌కు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసిన‌ట్టు టాక్‌..? ఇక జిల్లాలో టీడీపీలో ఉన్న త‌న వెల‌మ క‌మ్యూనిటీకి చెందిన వారు గెలిచేందుకు సైతం ధ‌ర్మాన ఒక ఓటు అటు.. ఒక ఓటు ఇటు అన్న సూత్రం ఎప్పుడూ ఫాలో అవుతార‌న్న విమ‌ర్శలు కూడా ఉన్నాయి.

రెండున్నరేళ్ల తర్వాత కూడా……

ఈ నేప‌థ్యంలో వీరంతా కూడా కృష్ణదాస్‌కే మొగ్గు చూపుతున్నారు. ఇక‌, వ‌చ్చే రెండున్నరేళ్ల త‌ర్వాత అయినా.. ధ‌ర్మాన‌ ప్రసాదరావుకు అవ‌కాశం ద‌క్కుతుందా? అంటే.. ఇది కూడా క‌ష్టమేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న జిల్లా నేత‌ల‌తో క‌లిసి మెలిసి ఉండ‌ర‌ని, రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటార‌ని, అంతా త‌న‌కే తెలుసున‌నే ధోర‌ణి వ్యవ‌హ‌రిస్తార‌ని, అందుకే ఎవ‌రూ ఆయ‌నంటే ఇష్టప‌డ‌డం లేద‌ని చెబుతున్నారు. మొత్తానికి ధ‌ర్మాన ప్రసాదరావు విష‌యంలో సొంత పార్టీ నుంచే ఇంత వ్యతిరేక‌త ఉంటే.. జ‌గ‌న్ మాత్రం త‌న కేబినెట్‌లో ఎలా చేర్చుకుంటారు! సో.. ఇదీ స్టోరీ!!

Tags:    

Similar News