ధర్మానకు మంత్రి గ్యారంటీనట.. కన్ఫర్మ్ ఇలా?

మొత్తానికి గత ఏడాదిగా అలకపానుపు ఎక్కి తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కుతుందా అంటే [more]

Update: 2020-06-19 15:30 GMT

మొత్తానికి గత ఏడాదిగా అలకపానుపు ఎక్కి తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కుతుందా అంటే ఆయన సొంత అన్నగారూ, ప్రస్తుత మంత్రి అయిన క్రిష్ణదాస్ అవును అంటున్నారు. అది కూడా తమ్ముడు సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ప్రసాదరావు సమక్షంలోనే క్రిష్ణదాస్ ఈ రకమైన కామెంట్స్ చేయడంతో ప్రసాదరావు మోములో నవ్వులు కనిపించాయట. తమ్ముడు మంచి పాలనాదక్షుడు. ఆయనకు తొందరలోనే ఉన్నత పదవులు వస్తాయని అన్నగారు మీడియాముఖంగానే చెప్పడంతో మాజీ మంత్రి వర్గీయుల్లో కొత్త ఆనందం
తొణికిసలాడుతోంది.

అన్నకే ఎసరా…?

మరి ప్రసాదరావుకే మంత్రి పదవి అంటే దాసన్నకే ఎసరు కదా అని ఆయన వర్గీయులు తలచుకుని కుంగిపోతున్నారు. అయితే మొదటి నుంచి పదవీరాజకీయాలకు క్రిష్ణదాస్ దూరమంటారు. ఆయన తమ్ముడి రాజకీయ అభివృధ్ధి కోసమే దశాబ్దాలుగా తెరవెనక పనిచేశారు. ఇక 2009లో అసెంబ్లీ సీట్లు పెరగడంతో తన సొంత నియోజకవర్గంలో అన్న క్రిష్ణ దాస్ ని నిలబెట్టి తాను శ్రీకాకుళానికి ధర్మాన ప్రసాదరావు షిఫ్ట్ అయ్యారు. అలా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చిన క్రిష్ణదాస్ మెత్తగా ఉంటారు, ఎత్తులు జిత్తులు ఆయనకు తెలియవని అంటారు. అయితే ఆయన జగన్ కి మంచి సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. అందుకే ఆయనకు పదవి వరించింది. ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు కి కూడా చెప్పి మరీ క్రిష్ణదాస్ ని జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారని అంటారు. అయితే తనకు పదవి దక్కపోవడం పట్ల ప్రసాదరావు మాత్రం అసంత్రుప్తితోనే ఉంటూ వస్తున్నారు.

దూకుడు లేదుగా…..

ఇక క్రిష్ణదాస్ ని ఏరి కోరి జగన్ మంత్రిగా నియమించినా కూడా ఆయనలో దూకుడు లేదు, దాంతో శ్రీకాకుళంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఒక్కలెక్కన రెచ్చిపోతోంది. ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన జగన్ మీద సవాల్ చేసే స్థాయికి రావడానికి జిల్లా మంత్రి రాజకీయం సరిగ్గా లేకపోవడమే కారణమని కూడా జగన్ వద్ద విశ్లేషణలు ఉన్నాయట. దానికి తోడు జిల్లా ఇంచార్జి మంత్రిగా వెళ్ళిన కొడాలి నాని సైతం ధర్మాన ప్రసాదరావే మంత్రిగా బెస్ట్ అంటూ జగన్ కి రిపోర్ట్ ఇచ్చారని టాక్.

మరో ఏడాదేనా…?

ఇక ఇప్పటికిపుడు క్రిష్ణదాస్ ని తప్పించి ధర్మాన ప్రసాదరావుని మంత్రిని చేయరు కానీ రెండున్నరేళ్ల తరువాత జరిగే భారీ మార్పుల్లో జగన్ సమర్ధులకు పెద్ద పీట వేస్తారని అంటున్నారు. బహుశా అధి ఎన్నికల టీం కూడా అవుతుంది అని చెబుతున్నారు. అపుడు కచ్చితంగా ధర్మాన ప్రసాదరావుకు చాన్స్ ఇస్తారని చెబుతున్నారు. ఈ రకమైన సమాచారం ఉండడంతోనే అన్న క్రిష్ణదాస్ తమ్ముడికి హితవచనాలు చెబుతూనే మంచి రోజులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమంటూ సూచించారని అంటున్నారు. దాంతో ఇపుడు మాజీ మంత్రి క్యాంప్ ఫుల్ హ్యాపీగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News