తోచినప్పుడే పాలిటిక్స్ …మెరుపు తీగ మాదిరిగానేనా?

ఉత్తరాంధ్రాలో ఆయన సీనియర్ నేత. మాజీ మంత్రి. నోరు విప్పితే అనర్గళంగా మాట్లాడుతూ ప్రత్యర్ధులకు మాట రాకుండా చేసే నైపుణ్యం ఆయన సొంతం. అటువంటి ధర్మాన వైసీపీలో [more]

Update: 2020-05-09 15:30 GMT

ఉత్తరాంధ్రాలో ఆయన సీనియర్ నేత. మాజీ మంత్రి. నోరు విప్పితే అనర్గళంగా మాట్లాడుతూ ప్రత్యర్ధులకు మాట రాకుండా చేసే నైపుణ్యం ఆయన సొంతం. అటువంటి ధర్మాన వైసీపీలో చేరిన తరువాత ఎందుకో నీరుకారిపోయారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా, అంతకు ముందు కాంగ్రెస్ మంత్రిగా తనను ఎన్నో మాటలు అన్నా కూడా జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా టికెట్ ఇచ్చారు. అయితే ఆయన తెలుగుదేశం చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన స్తబ్దుగా మారారు. ప్రతిపక్షంలో ఉంటూ పెద్దగా పోరాటాలు చేయలేదు. ఓ దశలో జగన్ కి ఆయనకు మధ్య పెద్ద వివాదమే రేగింది. ధర్మాన ప్రసాదరావు పార్టీలో ఉంటారా? అన్నంతగా సీన్ మారింది.

అధినేత మీదనే …..

జగన్ ఎక్కడో కడపలో ఉంటూ పులివెందుల నుంచి గెలుస్తూ ఏపీ అంతా వైసీపీ అలాగే ఉందని భావిస్తే పొరపాటు, జగన్ అయినా శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలవడం కష్టమని నాలుగేళ్ళ క్రితం ధర్మాన ప్రసాదరావు అన్న మాటలు అప్పట్లో మంటలు పుట్టించాయి. వైసీపీ పరిశీలకుల ఎదుటనే ఆయన అధినేతను అంతేసి మాటలన్నారు. ఆ తరువాత ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు. అది వేరే సంగతి. ఆ నోటి దురుసు వల్లనే ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మంత్రి కాలేకపోయారని అంటారు.

అపుడపుడు…..

శ్రీకాకుళంలో రాజకీయంగా టీడీపీ గట్టిగా ఉంది. ఆ పార్టీ నేతలు, ముఖ్యులు అక్కడ ఎక్కువే. ప్రతీ రోజూ కనీసం ఇద్దరు నాయకులైనా జగన్ ని టార్గెట్ చేస్తారు. దానికి వైసీపీ నుంచి కూడా కౌంటర్లు ఉండాలిగా. కానీ తన పని కానట్లుగా ధర్మాన ప్రసాదరావు ఎందుకో ఊరుకుంటున్నారు. పైగా రాజకీయాన్ని ఆయన పార్ట్ టైంగా తీసుకుంటున్నారు. కొడుకు రాంమనోహర్ నాయుడు మీదకే బాధ్యతలు వదిలేసి ఆయన రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని కూడా సెటైర్లు ఉన్నాయి. అటువంటి ధర్మాన ప్రసాదరావు అపుడపుడు మాత్రం జగన్ ని మెచ్చుకుంటూ టీడీపీ నేతలును నిందిస్తూ మీడియా ముందు కనిపిస్తారు. అది ఆయన తానున్నానని చెప్పుకోవడానికా, లేక పార్టీలో తాను జగన్ వీరవిధేయుడినని అని రుజువు చేసుకోవడానికి అన్నట్లుగా ఉంటోందన్న ప్రచారమూ ఉంది.

అవసరమా…?

ఏ ఒక్క టీడీపీ నేతనూ నేరుగా పేరు పెట్టి విమర్శిచకుండా కేవలం చంద్రబాబు మీద కొన్ని విసుర్లు విసిరేస్తే చాలు తన బాధ్యత పూర్తి అయినట్లుగా ధర్మాన ప్రసాదరావు భావిస్తున్నారు. ఇక్కడే ఆయన కోరి దొరికిపోతున్నారు. ధర్మాన ప్రసాదరావు కుటుంబంతో కింజరపు కుటుంబానికి రాజకీయానికి మించి బంధం ఉందని వైసీపీ అధినాయకత్వం అనుమానిస్తోంది. అందుకే అక్కడ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధి రెండు సార్లు కూడా గెలవలేదని నివేదికలు కూడా హై కమాండ్ వద్ద ఉన్నాయి. మరి అవన్నీ ఉన్నా కూడా ధర్మాన ప్రసాదరావు తనకు తోచినపుడు మాత్రమే రాజకీయం చేయాలనుకోవడం వల్ల ఆయనకు పార్టీలో ఎంతవరకూ మైలేజ్ దక్కుతుందో తెలియదు అంటున్నారు. ఇక ధర్మానకు రెండవసారి కూడా మంత్రి పదవి రాదని అంటున్న వారూ ఉన్నారు. ఈసారి జగన్ కాళింగ సామాజికవర్గానికి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇస్తారని వినిపిస్తోంది. దాంతో ధర్మాన ప్రసాదరావు మెరుపు రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి కొడుకుకైనా టికెట్ తెచ్చిపెడతాయా అన్నది చూడాలి.

Tags:    

Similar News