ధర్మాన నిజం చెప్పారా… లేక…?

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంచి ఉపన్యాసకుడు. ఆయన మాటలలో చతురత బాగా ఉంటుంది. అవతల వ్యక్తికి పొగుడుతున్నారా లేక తిడుతున్నారా అన్నది [more]

Update: 2021-03-09 06:30 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంచి ఉపన్యాసకుడు. ఆయన మాటలలో చతురత బాగా ఉంటుంది. అవతల వ్యక్తికి పొగుడుతున్నారా లేక తిడుతున్నారా అన్నది అసలు అర్ధం కాకుండా ధర్మాన ప్రసంగం సాగిపోతుంది. ఆయన వైసీపీలో ఉన్న అసంతృప్త నేతగా చెబుతారు. నిజానికి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి కోరిక ఏ రేంజిలో ఉందో తాజాగా టీడీపీ నాయకులు చెప్పిన మాటలను వింటే అర్ధమవుతుంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. 2014 ఎన్నికల ముందర వైసీపీలో చేరిన ధర్మాన ప్రసాదరావుకు జగన్ శ్రీకాకుళం టికెట్ ఇచ్చారు. ఆ టైంలో ఆయన చేసిన ఎన్నికల ప్రచారం ఏంటి అంటే కాబోయే మంత్రి గారికి ఓటేయండి అనిట.

ఓడి గెలిచి …

అలా 2014లో తానే మంత్రిని, దర్జా అంతా తన ముంగిటే అని గొప్పగా చెప్పుకున్న ధర్మాన ప్రసాదరావు చివరికి ఓడారు, ఏపీలో వైసీపీ కూడా ఓడింది. మరి 2019 నాటికి ఆ ఆరాటం ఎంతలా ఉంటుంది. రెట్టించిన తపనతో ధర్మాన ప్రసాదరావు ప్రచారం చేసి కసిగా గెలిస్తే దానికి తగినట్లుగా ఏపీలో వైసీపీ కూడా పవర్ లోకి వచ్చింది. మరి అయిదేళ్ళ క్రితం నాటి కోరిక కల అలా తీరబోతోంది అని ధర్మాన ప్రసాదరావు అనుకోవడంలో తప్పు లేదు, కానీ జగన్ మాత్రం క్రిష్ణ దాస్ కి మంత్రి పదవి ఇచ్చేసి తమ్ముడిని తమాషా చూడమన్నారు. అక్కడే ధర్మాన ప్రసాదరావు రగిలిపోవడం మొదలైందిట.

డబ్బుతోనేనా ….?

ఏపీలో అన్ని కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ శ్రీకాకుళానికి న్యాయ వివాదాల వల్ల ఎన్నికలు ప్రస్తుతం జరగడంలేదు. ఏప్రిల్ లో జరుగుతాయని అంటున్నారు. తాజాగా జరిగిన వైసీపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఒక్కో కార్పోరేటర్ అభ్యర్ధి గెలవడానికి కనీసం యాభై లక్షలేనా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి నాయకులను అవాక్కు అయ్యేలా చేశారు. అంత డబ్బు ఉంటేనే బరిలోకి దిగండి, లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చోండి అంటూ ధర్మ పన్నాలు వల్లించారు మాజీ మంత్రి గారు. అధినాయకత్వం ఎన్నికల కోసం పార్టీ ఫండ్ పంపించదు, ఎవరికి వారే చేతి చమురు వదుల్చుకోవాలని కూడా ధర్మాన ప్రసాదరావు అనడం విశేషం. దీని మీద అపుడే టీడీపీ ఘాటు విమర్శలు మొదలెట్టింది. వైసీపీ ధనవంతులకే టికెట్లు ఇస్తుందని, ఓట్లను నోట్లు పెట్టి కొంటుందని టీడీపీ మాజీ మంత్రి గుండా అప్పల సూరయనారాయ‌ణ గట్టిగానే విమర్శలు చేశారు.

డ్యామేజే కదా….?

నిజానికి ఏ పార్టీ కూడా తన ఎన్నికల నిధుల గురించి బాహాటంగా చెప్పుకోదు, ఫండ్ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు, ఇంత ఖర్చు పెడితేనే పోటీ చేయండి అని అనడం ద్వారా ధర్మాన ప్రసాదరావు ఏం చెప్పదలచుకున్నారు అన్నదే వైసీపీలో ఇపుడు చర్చ. అంటే ఆయన వైసీపీ ధనవంతుల పార్టీ అని చెప్పడానికే ఇలా కామెంట్స్ చేశారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట. ధర్మాన ప్రసాదరావు తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారా అని కూడా నాయకులు తర్కించుకుంటున్నారుట. వైసీపీ గెలిస్తే ఓకే కానీ ఓడితే మాత్రం డబ్బులు ఖర్చు చేయలేక ఓడింది అని చెప్పడానికేనా ఈ రకమైన ప్రకటనలు మాజీ మంత్రి చేశారు అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ హై కమాండ్ ఎన్నికల నిధులు ఎంత ఇస్తుంది అన్నది ఎవరికీ తెలియదు కానీ ఏమీ ఇవ్వదు అంటూ ధర్మాన ప్రసాదరావు కుండబద్దలు కొట్టడం ద్వారా పార్టీ ఇమేజ్ ని తగ్గించారు అనే అంటున్నారు మరి.

Tags:    

Similar News