దాసన్న…. దూస్తున్నాడుగా…!!

శ్రీకాకుళం జిల్లాలో అప్పుడూ…ఇప్పుడూ హవా ఒకే రాజకీయ కుటుంబానిది. కింజరపు కుటుంబం అంటే…. శ్రీకాకుళం అంటారు. ఇలా జిల్లానే తమకు మారు పేరుగా మార్చుకున్న ఆ ఫ్యామిలీకి [more]

Update: 2019-07-05 11:00 GMT

శ్రీకాకుళం జిల్లాలో అప్పుడూ…ఇప్పుడూ హవా ఒకే రాజకీయ కుటుంబానిది. కింజరపు కుటుంబం అంటే…. శ్రీకాకుళం అంటారు. ఇలా జిల్లానే తమకు మారు పేరుగా మార్చుకున్న ఆ ఫ్యామిలీకి రాజకీయంగా సవాల్ చేస్తానంటున్నారు వైసీపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. మెత్తగా ఉంటాడని, ఎవరు ఏమన్నా పట్టించుకోడని భావిస్తే పప్పులే కాలేసినట్లే. ఇపుడు ధర్మాన కృష్ణదాస్ మారిపోయారు. ఎంతలా అంటే జగన్ ని ఫాలో అవుతున్నారు. దూకుడు రాజకీయం చేస్తున్నారు. నమ్మిన వారికి అభయం ఇస్తూనే గిట్టని వారిపై మూడో కన్ను తెరుస్తున్నారు. సౌమ్యుడుగా ఉంటాడని, మంత్రి గారికి నాలుగు మంచి మాటలు చెప్పి పబ్బం గడుపుకోవచ్చు అనుకున్న వారికి ధర్మాన కృష్ణదాస్ కొత్త స్టైల్ నోట మాట రానీయడంలేదు.

ప్రత్యర్ధి ఆసుపత్రిలో తనిఖీలు…..

తన సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రత్యర్ధి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు మేనత్తకు చెందిన ఓ సామాజిక ఆసుపత్రిని మంత్రి హోదాలో ధర్మాన కృష్ణదాస్ తనిఖీ చేసి హడలెత్తించారు. అక్కడ పరిస్థితులను ఆరా తీశారు. తాను ఏంటో చెప్పకనే చెప్పారు. ఆ విధంగా బగ్గుకు గట్టి ఝలక్ ఇచ్చారు. ఇక మరో రాజకీయ ప్రత్యర్ధి, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సొంత వూరు నిమ్మాడలోనూ మంత్రి పర్యటన పెట్టుకున్నారు. అక్కడ కూడా హల్ చల్ చేయడం ద్వారా మంత్రి అంటే ఇలాగే ఉంటారనిపించారు. అచ్చెన్నాయుడుని ఢీ కొట్టగలారా ధర్మాన కృష్ణదాస్ అని భావించిన వారి అంచనాలు తారుమారు చేస్తూ ఏకంగా నిమ్మడలోనే క్రిష్ణ దాస్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

పాత కాంట్రాక్టులు రద్దు….

టీడీపీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులు చేసిన పనులు నాణ్యత లేకపోతే ఆపేయాలని కూడా ధర్మాన కృష్ణదాస్ ఆదేశించడం ఆయన మార్క్ పాలిటిక్స్ కి అద్దం పడుతోంది. పాత కమిషన్ల కక్కుర్తితో అధికారులు పనులు కొనసాగించడంపై మంత్రి కన్నెర్ర చేశారు. మొత్తానికి తాను ఇలాగే ఉంటానని, తన రూట్ మారిందని జిల్లాలో ఏకైక మంత్రి ధర్మాన గట్టిగా ఢంకా భజాయిస్తున్నారు. అచ్చెన్నాయుడు రాజకీయానికి బ్రేకులు వేయాలని, అన్నీ వెనక నుంచి తాను చూసుకుంటానని జగన్ ఇచ్చిన భరోసాతో ధర్మాన కృష్ణదాస్ జిల్లాలో దూకుడు రాజకీయానికి సిధ్ధపడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి దాసన్న ఈ రేంజిలో రెచ్చిపోతే సిక్కోలులో ఫ్యాన్ గిర్రున పది కాలాలు తిరగడం ఖాయమని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News