దాసన్నకు కోపం వచ్చిందే

అలుగుటయే ఎరుగని ధర్మరాజు లాంటి వాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆయన మంత్రి అయి ఆరు నెలలు గడుస్తున్నా సైలెంట్ గానే ఉంటున్నారు. [more]

Update: 2019-11-17 11:00 GMT

అలుగుటయే ఎరుగని ధర్మరాజు లాంటి వాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆయన మంత్రి అయి ఆరు నెలలు గడుస్తున్నా సైలెంట్ గానే ఉంటున్నారు. తన పార్టీ వారే కాదు, అధికారులు కూడా మంత్రిగా మర్యాదా, మన్నన ఇవ్వకపోయినా కూడా ధర్మాన కృష్ణదాస్ సర్దుకునిపోతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు పూర్వాశ్రమంలో అధికారిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ కు ఆ నెమ్మదితనమే అలవాటుగా మారింది. రాజకీయాల్లో దూకుడు తనం పెరిగినా కూడా దాసన్న మాత్రం నిదానమే ప్రధానం అంటారు. అటువంటి ధర్మాన కృష్ణదాస్ కు విపరీతమైన కోపం వచ్చింది. అది కూడా కింజరపు కుటుంబం మీద. నిజానికి ధర్మాన, కింజరపు కుటుంబాలు రెండూ కూడా తెర వెనక ఒక్కటి అన్న భావన కూడా ఉంది. దానికి అనేక రుజువులు కూడా ఉన్నాయి. ఈ సంగతి అధినేతలుగా ఉన్న చంద్రబాబుకు, జగన్ కి కూడా తెలుసు అంటారు.

ఇసుక దుమారమే…

ఇసుక మాఫియాతో చేతులు కలిపిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాలో ధర్మాన కృష్ణదాస్ ని కూడా చేర్చి టీడీపీ ఈ మధ్య ఛార్జిషీట్ విడుదల చేసింది. దాని మీద ధర్మాన కృష్ణదాస్ గరం గరం అవుతున్నారు. తాను ఎక్కడ ఇసుక మాఫియాతో చేతులు కలిపానో చెప్పమంటూ అచ్చెన్నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను నీతి నిజాయతీగా రాజకీయాలు చేస్తూ వస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇసుకను మొత్తం భోంచేసిన ఘనత మంత్రులు, ఎమ్మెల్యేలకే సొంతమని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటిది ఇపుడు తన మీద నిందలు వేయడమేంటి దారుణం కాకపోతేనూ అని మంత్రి గారు మండిపడుతున్నారు. నిజానికి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మఫియా వెనక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారని ఇప్పటివరకూ వైసీపీ నేతలు ఆరోపించినా జిల్లా మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ కనీస మాత్రంగా కూడా స్పందించలేదు. దానికి పరిహారం అన్నట్లుగా అచ్చెన్నాయుడే దాసన్నను దగ్గరుండి మరీ ఇసుక అక్రమారుక జాబితాలో పెట్టించారని ధర్మాన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడితో ఆగేనా…?

ఇదిలా ఉండగా రాజకీయ పార్టీలు వేరుగా ఉన్నా మంచి సఖ్యతతో ఉండే ధర్మాన, కింజరపు కుటుంబాల మధ్యన ఇసుక చిచ్చు ఇపుడు రగులుకుంది. మంత్రిగా ఇసుక కొరతకు బాధ్యుడిగా చేస్తూ అచ్చెన్నాయుడు వర్గం రాజకీయ ఆరోపణలకు దిగడంతో ఇపుడు ధర్మాన కృష్ణదాస్ సైతం గట్టిగానే స్పందిచాల్సివచ్చిందని అంటున్నారు. మరి ఇసుక విషయంలో మొదలైన ఈ గొడవ ఎంతవరకూ వెళ్తుందో చూడాలని అంటున్నారు. అయితే ఇది పార్టీ అధినేతలను సంతృప్తి పరచేందుకు ఉత్తుత్తి వివాదంగానే చూడాలి తప్ప రెండు కుటుంబాల మధ్య సఖ్యత చెదిరిపోదు అని అంటున్న వారు రెండు పార్టీలలోనూ ఉన్నారు. బయటకు ఇలా అరచుకున్నా అంతా ఒక్కటేనని కూడా అంటున్నారు. అయితే జిల్లాకు చెందిన మంత్రిగా ఇంతవరకూ కింజరపు కుటుంబం మీద ఒక్క మాట కూడా అనని ధర్మాన కృష్ణదాస్ ఇపుడు ఏదో విధంగానైనా నోరు విప్పారని సెటైర్లు మాత్రం గట్టిగా పడుతున్నాయి. ఏది ఏమైనా జిల్లా రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాలను తక్కువ అంచనా వేయలేమని ప్రత్యర్ధులు అంటున్నారు.

Tags:    

Similar News