అలుగుటయే ఎరుగని ధర్మాన ?

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి రాజకీయ పాధాన్యత ఉంది. అయితే దశాబ్దాల పాటు తమ్ముడు ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో ఉంటే అన్న ధర్మాన కృష్ణ దాస్ మాత్రం [more]

Update: 2021-09-01 06:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి రాజకీయ పాధాన్యత ఉంది. అయితే దశాబ్దాల పాటు తమ్ముడు ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో ఉంటే అన్న ధర్మాన కృష్ణ దాస్ మాత్రం తెరచాటునే ఉండిపోయారు. ఆయన తమ్ముడి విజయానికి పని చేస్తూ వచ్చారు. ఇక 2004 ఎన్నికల్లో వైఎస్సార్ కృష్ణ దాస్ ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తొలిసారి నరసన్నపేట నుంచి గెలిచారు. ఇక ఆయన తరువాత జగన్ వైపు కూడా వచ్చి వైసీపీ ఆవిర్భావం వేళ కీలకమైన పాత్ర పోషించారు. జగన్ కూడా ధర్మాన కృష్ణ దాస్ సేవలను మెచ్చి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవే కట్టబెట్టారు.

ఆ మాటకర్ధమేంటి..?

తాజాగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ జగన్ ప్రభుత్వం మీద కాస్తా విమర్శనాత్మకమైన ధోరణిలో మాట్లాడారు. క్రీడలకు ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయడంలేదని విపక్ష సభ్యుని మాదిరిగా ఆయన మాట్లాడడం విడ్డూరమే. నిజానికి ధర్మాన కృష్ణ దాస్ చాలా సంయమనంతో వ్యవహరిస్తారు. కానీ మీడియా ముందే ఎవరేమనుకున్నా అనుకోనీయండి అంటూ అంటూ తన మనసులో భావాలను కుండబద్ధలు కొట్టారు. క్రీడల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దాసన్న గట్టిగానే మాట్లాడారు. క్రీడలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తే వైద్యానికి ఖర్చు చేసే బాధ తప్పుతుంది అని కూడా అన్నారు. నిజానికి ధర్మాన కృష్ణ దాస్ చేసిన సూచనలు మంచివే. ఆయన సీనియర్ నేత. జగన్ కి అత్యంత సన్నిహితుడు. నేరుగా ఇదే మాట జగన్ కి చెబితే పోయేదానికి జనంలో మాట్లాడడం ఏంటి అన్నదే చర్చగా ఉంది.

అసంతృప్తి ఉందా…?

ధర్మాన కృష్ణ దాస్ కి జగన్ పెద్ద పీట వేశారు. రెవిన్యూ మంత్రి వంటి కీలకమైన శాఖలు ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి అంటే ఉత్తరాంధ్రాలో ఆయనకే తొలి అవకాశం దక్కినట్లుగా చూడాలి. అలాంటిది దాసన్నలో ఎందుకీ అసంతృప్తి వచ్చింది అన్నదే అందరి మాటగా ఉంది. ఆయనకు తన పదవి ఉండదని తెలిసిపోయిందా అన్న చర్చ కూడా వస్తోంది. జగన్ ఏం చేయమన్నా క్షణాల్లో చేసే దాసన్న మంత్రి పదవి వదులుకోమన్నా నో అని చెప్పరనే అంతా అంటారు. కానీ కారణాలు దాని కంటే వేరే ఉన్నాయని అంటున్నారు. జిల్లాల్లోనూ సొంత పార్టీలోనూ మరో వర్గానికి జగన్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అన్నదే ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన అని కూడా చెబుతున్నారు.

అదే హోదా అట …

ఇక ధర్మాన కృష్ణ దాస్ మరో మాట కూడా అంటున్నారు. తనకు క్రీడాకారుడు అన్న హోదా కంటే మరేదీ ఎక్కువ కాదు అని. అంటే రేపటి రోజున మాజీ అయినా కూడా తనకు బే ఫికర్ అన్నట్లుగానే ఆయన మాటలు ఉన్నాయనే చెబుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కృష్ణ దాస్ కి తెలియకుండా అనేకమైనవి జరిగిపోతున్నాయి. దాంతో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభమని కూడా దాసన్న మధనపడిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి జగన్ ని నేరుగా ఏమీ అన‌కుండా ప్రజలకు అవసరమైన ఒక అంశం మీదనే తెలివిగా దాసన్న మాట్లాడి ప్రభుత్వం తప్పుని ఎత్తి చూపారు. మరి ఇది ఆరంభమా లేక ఇక్కడితో ఆయన ఆగుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా సీనియర్ నేతగా ఉన్న దాసన్న మాజీ అయితే ఆయన రాజకీయం ఎలా ఉంటుందో అన్నది మాత్రం వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ గానే ఉంది. .

Tags:    

Similar News