ప్రమోషన్ ఇచ్చినా పవర్ చూపించలేకపోతున్నారా..?

అదేంటో కొందరు అంతే అనుకోవాలేమో. ఏ అధికారం లేకుండా దర్జా చలాయించే నేతలు ఒక వైపు ఉంటే అన్నీ ఉండి కూడా మెతగ్గా వ్యవహరించే వారు మరో [more]

Update: 2020-09-01 02:00 GMT

అదేంటో కొందరు అంతే అనుకోవాలేమో. ఏ అధికారం లేకుండా దర్జా చలాయించే నేతలు ఒక వైపు ఉంటే అన్నీ ఉండి కూడా మెతగ్గా వ్యవహరించే వారు మరో రకం. ఇపుడు ఆ జాబితాలో ముందు వరసలో చెప్పుకోవాల్సింది డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ నే. తమ్ముడు ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా ఉంటూ జిల్లాను మొత్తం గుప్పిట పట్టాడు. చీమ చిటుక్కుమన్నా కూడా క్షణాల్లో సమాచారం వచ్చేలా అంతా ఏర్పాటుచేసుకున్నాడు. కాంగ్రెస్ మంత్రిగానే సామంత రాజుగా వెలుగు వెలిగాడు. తమ్ముడితో పోలిస్తే ధర్మాన కృష్ణ దాస్ చాలా మెత్తన. ఆయనకు అతి కీలకమైన పదవులు వస్తున్నాయి. కానీ పవర్ చూపించడం ఎలాగో తెలియడంలేదు. దాంతో క్యాడర్ సైతం డీలా అవుతోంది.

నేర్చుకోమన్నా కూడా….

ఇక దాసన్న మెతకతనాన్ని చూసి జిల్లా ఇంచార్జి మంత్రి కొడాలి నాని అయితే సెటైర్లు కూడా వేశారు. తమ్ముడు ప్రసాదరావును చూసి నేర్చుకోవయ్యా అంటూ క్లాస్ కూడా తీసుకున్నారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. అపుడు ధర్మాన కృష్ణ దాస్ కేవలం మంత్రి మాత్రమే. ఇపుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జగన్ ఆయన హోదాను ఒక్కసారిగా పెంచేశారు. అయినా సరే ఏ విషయం మీదనైనా స్వేచ్చగా దూకుడుగా దాసన్న నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. జిల్లాలో పదవులు లేక క్యాడర్ అల్లాడుతోంది. లీడర్లు కూడా నిరాశలో ఉన్నారు. వారంతా ధర్మాన కృష్ణ దాస్ చుట్టూ తిరుగుతున్నారు.

ఇచ్చిందే పుచ్చుకుని …..

తమకు ఏదైనా పదవి ఇప్పించండి అంటూ వైసీపీ నేతలు ధర్మాన కృష్ణ దాస్ చుట్టూ ప్రదక్షిణం చేసినా వారికి ఆయన నుంచి చిరునవ్వు మాత్రమే బహుమానంగానే వస్తోంది. గట్టిగా బతిమాలుకుంటే చెప్పి చూస్తానులే అని మరో మాట వస్తుందిట. అంతే తప్ప ఈ పదవి నీకే. వెళ్ళి పనిచేసుకో అంటూ గట్టి భరోసా ఇచ్చే ధైర్యం దాసన్న చేయలేకపోతున్నారని అంటున్నారు. తన మనుషులకు ఈ సమయంలో నాలుగు పదవులు ఇప్పించుకునే దమ్ముని ఎందుకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ చూపించలేకపోతున్నారన్న ప్రశ్న కూడా వస్తోంది. జగన్ ఏది చెబితే అదేనంటూ దాసన్న తలూపేస్తున్నారని కూడా క్యాడర్ గొణుక్కుంటున్నారు. జగన్ ఏది ఇస్తే అదే పదివేలు అని పుచ్చుకుని వచ్చేస్తున్నారని కూడా అంటున్నారు.

గాడిన పడదే….

శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పెట్టని కోట. ఆ జిల్లాను ఇకపైన వైసీపీకి కంచుకోట చేయాలన్నది జగన్ నిర్ణయం. దానికోసమే ఆయన ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. అంతే కాదు ధర్మాన కృష్ణ దాస్ ను ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. దాంతో జిల్లాను ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీ పక్షం చేయాల్సిన అతి ముఖ్య బాధ్యత దాసన్న మీద ఉంది. కానీ జిల్లాలో అనేక అధికార కేంద్రాలు ఉన్నాయి. అందులో తాను కూడా ఒకడిగా ధర్మాన కృష్ణ దాస్ మారిపోయారని, జిల్లాను శాసించే రాజకీయం చేయలేకపోతున్నారని తన వారికి కూడా పదవులు ఇప్పించుకోలేకపోతున్నారని అంటున్నారు. మొత్తానికి పదవుల్లో పవర్ లేదన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా దాసన్న నిలిచారు అని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News