ఈ ఇద్దరి మధ్య గేమ్ మొదలయింది…?

ఆ ఇద్దరూ పూర్వాశ్రమంలో మంచి ఆటగాళ్ళు, ఇక రాజకీయాల్లోనూ కూడా మంచిగానే ఆడుతున్నారు. వారే స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్. తమ్మినేని [more]

Update: 2020-11-21 12:30 GMT

ఆ ఇద్దరూ పూర్వాశ్రమంలో మంచి ఆటగాళ్ళు, ఇక రాజకీయాల్లోనూ కూడా మంచిగానే ఆడుతున్నారు. వారే స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్. తమ్మినేని వెయిట్ లిఫ్టర్ గా 1970వ దశకంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ధర్మాన వాలీబాల్ క్రీడాకారుడు. ఇపుడు ఈ ఇద్దరూ కలసి క్రికెట్ ఆట‌ ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక్కటిగా కాదు రెండు జట్లుగా మారి ఆడుతున్న ఈ క్రికెట్ మ్యాచ్ లో గెలుపు ఎవరిదో అన్న ఆసక్తి సర్వత్రా ఉంది.

సైలెంట్ గా స్పీకర్ ….

రాష్ట్రంలో అన్ని జిల్లాలకు క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. ఒక్క శ్రీకాకుళానికి తప్ప. దాంతో శ్రీకాకుళంలో క్రికెట్ స్టేడియం కావాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాం ముగిసి చంద్రబాబు నవ్యాంధ్ర సీఎం అయినా కూడా ఆ కోరిక అలాగే ఉండిపోయింది. దాంతో వైసీపీ వచ్చాక మళ్ళీ పావులు కదిపారు. జగన్ తాజా మంత్రి వర్గ సమావేశంలో సిక్కోలుకి క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. అయితే ఆముదాలవలస దగ్గర ఉన్న క్రీడా మైదానాన్ని ఏడాదికి రెండు లక్షల లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అది స్పీకర్ నియోజకవర్గం. దాంతో ఇపుడు తమ్మినేని వర్గీయులు జిల్లాకు స్టేడియం తెచ్చామని సంబరపడుతున్నారు.

ససేమిరా అంటున్న ధర్మాన…..

ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అసంత్రృప్తి గా ఉన్నారట. తానున్న మంత్రి వర్గ సమావేశంలో తనకు కూడా తెలియకుండా సైలెంట్ గా ఫైల్ మూవ్ చేసి ఆముదాలవలసకు క్రికెట్ స్టేడియాన్ని తమ్మినేని తెచ్చుకోవడాన్ని ఆయన ప్రతిష్టగా తీసుకున్నారుట. అంతే కాదు, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం ఉండాలి కానీ ఆముదాలవలలో ఏంటని క్రికెట్ క్రీడాకారులు ధర్మాన కృష్ణదాస్ వద్ద మొర పెట్టుకున్నారుట. దాంతో దాన్ని శ్రీకాకుళానికి షిఫ్ట్ చేయడానికి ధర్మాన కంకణం కట్టుకున్నారని టాక్.

సమరమేనా…?

రాజకీయ సయ్యాటలో ఇద్దరూ ఆరితేరిన వారే. అయితే తమ్మినేని సీతారాం బాగా సీనియర్. పైగా జగన్ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఇక ధర్మాన అంటే కూడా ముఖ్యమంత్రికి ఇష్టమే. దాంతో ఇపుడు ఈ ఇద్దరూ క్రికెట్ స్టేడియం పంచాయతీ పెడితే జగన్ ఎటు మొగ్గుతారు అన్నది కూడా ఆసక్తికరమే. ఉప ముఖ్యమంత్రిగా తాను ఉండగా క్రికెట్ స్టేడియాన్ని శ్రీకాకుళానికి తేలేకపోవడం తలవంపులే అని ధర్మాన భావిస్తున్నారుట. మరి ఈ ఇద్దరిలో ఎవరు సిక్సర్లు, బౌండరీలు కొడతారో చూడాల్సిందే.

Tags:    

Similar News