మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ ?

శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే కింజరపు, ధర్మాన కుటుంబాలు గుర్తుకువస్తాయి. ఈ రెండు కుటుంబాలే దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈ కుటుంబాలే సుదీర్ఘకాలం పదవులు అనుభవిసున్నాయి. ఏ [more]

Update: 2020-03-14 09:30 GMT

శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే కింజరపు, ధర్మాన కుటుంబాలు గుర్తుకువస్తాయి. ఈ రెండు కుటుంబాలే దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈ కుటుంబాలే సుదీర్ఘకాలం పదవులు అనుభవిసున్నాయి. ఏ ఎన్నిక అయినా ఈ రెండు కుటుంబాలు పార్టీలకు అతీతంగా అవగాహన కుదుర్చుకుని ముందుకు సాగుతాయన్నది బహిరంగ రహస్యం. దానివల్లనే మంచి బలం ఉండి గెలిచే అవకాశాలు ఉన్నా కూడా వైసీపీ వరసగా రెండు సార్లు శ్రీకాకుళం ఎంపీ సీటుని పోగొట్టుకుంది. జగన్ ప్రభంజనంలో కూడా బాబాయి అచ్చెన్నాయుడు, అబ్బాయి రామ్మోహన్ నాయుడు గెలిచారంటే అది ధర్మాన ఫ్యామిలీ పుణ్యమేనని అంటారు.

కాళింగులు గుస్సా….

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు కులాల ప్రాతిపదినక చీలిపోయాయి. పార్టీలకు అతీతంగా వెలమ సామాజికవర్గానికి చెందిన కింజరపు, ధర్మాన‌ కుటుంబాలు అవగాహనకు వస్తే బలమైన ఇతర సామాజిక వర్గాలు కూడా అదే తీరున జవాబు ఇస్తున్నాయి. జిల్లాలో కాపులు, కాళింగులు, మత్స్యకారులు, బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా ఈ అవగాహన రాజకీయాల మీద మండిపడుతున్నారు. ఇక కాళింగులైతే జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ వైఖరి మీద మండిపడుతున్నారు. ఆయన వల్లనే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సీట్లు పోతాయని ముందే అధినాయకత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

జెడ్పీ పీఠం కోసం…….

ఇక జెడ్పీపీఠం కోసం కాళింగులు ఓ వైపు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన కుమారుడు క్రిష్ణ చైతన్యను రాజకీయ వారసత్వం కోసం తహతహలాడుతున్నారు. కుమారుడి చేత పోలంకి నుంచి జెడ్పీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారు. నిజానికి ఈ జెడ్పీ పీఠం బీసీ మహిళకు ఇక్కడ రిజర్వ్ అయింది. అయితే తనకు అనుకూలమైన వారిని జెడ్పీ పీఠం ఎక్కించి వైస్ చైర్మన్ పదవిలో కొడుకుని పెట్టాలన్నది ధర్మాన ఎత్తుగడగా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. దాంతో వైసీపీలో అగ్గి రాజుకుంది. ఓ వైపు బంధువులకు టికెట్లు ఇవ్వవద్దని జగన్ నుంచి ఆదేశాలు వచ్చినా కూడా మంత్రి ఇలా చేయడమేంటని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి.

దువ్వాడకేనా…?

మరో వైపు గత ఏడాది శ్రీకాకుళం ఎంపీ పదవికి పోటీ చేసి ఫిక్సింగ్ రాజకీయాల మూలంగా పార్లమెంట్ కి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయిన వైసీపీ నేత దువ్వాడ శ్రీను పట్ల జగన్ సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. ఆయన సతీమణి దువ్వాడ శ్రీవాణికి జెడ్పీ పీఠం ఖరారు అయిందని అంటున్నారు. ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు ఉండడంతో దువ్వాడ శ్రీను ధర్మాన మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు భయపడుతున్నారట. తనకు జరిగినట్లుగానే తన సతీమణికి కూడా సొంత పార్టీ నుంచి వెన్నుపోట్లు ఎదురైతే ఊరుకోనని ఆయన అంటున్నట్లు భోగట్టా. చూడాలి మరి.

Tags:    

Similar News