దేవినేని ఉమ.. సామాన్యుడు కాదుగా.. రెండు చోట్ల ఆయనేనా?

మాజీ మంత్రి, టీడీపీలో అధినేత చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడు దేవినేని ఉమ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పుతున్నారా? త‌న నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం స‌హా.. గ‌తంలో తాను పోటీ [more]

Update: 2020-07-08 13:30 GMT

మాజీ మంత్రి, టీడీపీలో అధినేత చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడు దేవినేని ఉమ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పుతున్నారా? త‌న నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం స‌హా.. గ‌తంలో తాను పోటీ చేసి గెలిచిన నందిగామ నియోజ‌కవ‌ర్గంలోనూ ఆయ‌న హ‌వా చ‌లాయిస్తున్నారా ? అంటే టీడీపీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం.. నందిగామ‌. ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రిజ‌ర్వ్‌డ్ కాక‌ముందు.. అయిన త‌ర్వాత కూడా టీడీపీకి మంచి ప‌ట్టుంది. గ‌తంలో ఇక్కడ నుంచే మాజీ మం త్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు, ఆయ‌న సోద‌రుడు దివంగ‌త మాజీ మంత్రి దేవినేని వెంక‌ట ర‌మ‌ణ విజ‌యం సాధించారు. ఈ క్రమంలో ఇక్కడ టీడీపీకి బ‌ల‌మైన పునాదులు ప‌డ్డాయి.

ఎస్సీ నియోజకవర్గం కావడంతో…..

వ్యక్తులు మారినా.. టీడీపీకి ఇక్కడ ఓటు బ్యాంకు ప‌దిల‌మ‌నే గ‌ట్టి న‌మ్మకం ఉంది. 1994లో దేవినేని వెంక‌ట ర‌మ‌ణ‌, 1999, 2004లో దేవినేని ఉమ విజ‌యం సాధించారు. 2009లో ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎస్సీల‌కు కేటాయించారు. దీంతో ఇక్కడ నుంచి 2009లో తంగిరాల ప్రభాక‌ర‌రావు విజ‌యం సాధించారు. వాస్తవానికి 2009లో వైఎస్ హ‌వా కొన‌సాగుతోంది. అయినా కూడా దానిని సైతం త‌ట్టుకుని ప్రభాక‌ర‌రావు విజ‌యం సాధించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా 2014లో తంగిరాల విజ‌యం సాధించారు. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కొన్ని నెల‌లకే ఆయ‌న మృతి చెందారు. ఈ క్రమంలోనే తంగిరాల సౌమ్య రంగంలోకి దిగారు. బైపోల్స్‌లో ఆమె కూడా విజ‌యం సాధించారు.

అంతా ఆయనే…..

టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఇక్కడి స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టడ‌మే కాకుండా ప్రతి ఇంటికీ తిరిగి సానుభూతిని సొంతం చేసుకున్నారు. అయితే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో సౌమ్య ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి ఇక్కడి రాజ‌కీయాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమ జోక్యం పెరిగింద‌ని సౌమ్య అనుచ‌రులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే 2009లో ఈ సీటు ఎస్సీల‌కు రిజ‌ర్వ్‌డ్ అయిన‌ప్పటి నుంచే మాజీ మంత్రి దేవినేని ఉమ పెత్తన‌మే ఎక్కువ న‌డిచింది. ఆ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన వాయిస్ వినిపించే నేత‌గా పేరున్న వ‌ర్ల రామ‌య్య ఈ సీటు ఆశించినా ఉమ ఆయ‌న‌కు అడ్డుక‌ట్ట వేసి మ‌రీ తంగిరాల‌కు సీటు ఇప్పించుకున్నార‌న్న టాక్ ఉంది.

పట్టు వదులుకునేందుకు…..

ఆ త‌ర్వాత 2014లోనూ వ‌ర్లకు ఈ సీటు రానివ్వలేదు. ఇంద‌కు ఆయ‌న బ‌ల‌మైన వాయ‌స్‌తో ఉమను డామినేట్ చేస్తార‌న్న సందేహ‌మే ఆయ‌న‌కు ఉండ‌డమ‌ట‌. అందుకే ఆ ఎన్నిక‌ల్లో వ‌ర్లకు చంద్రబాబు పామ‌ర్రు సీటు ఇచ్చినా ఆయ‌న అక్కడ ఓడిపోయారు. ఇక 2009 నుంచి ఇక్కడ చ‌క్రం తిప్పుతోన్న దేవినేని ఉమ 2014లో పార్టీ గెలిచాక అన్ని ప‌ద‌వులు త‌న అనుకున్న వారికే క‌ట్టబెట్టుకున్నారు. పేరు ఇక్కడ తంగిరాల ప్రభాక‌ర్ రావు, సౌమ్య ఎమ్మెల్యేలుగా ఉన్నా వారు చేసిందేమి లేదన్నది వాస్తవం. ఈ నేప‌థ్యంలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం అయినా కూడా నందిగామ రాజ‌కీయాల‌పై ప‌ట్టు వ‌దుల‌కునేందుకు ఎంత మాత్రం ఇష్టప‌డ‌డం లేదు.

పార్టీ కార్యక్రమాలను…..

పార్టీ కీల‌క కార్యక్రమాల‌న్నీ కూడా ఇటీవ‌ల కాలంలో నందిగామ నియోజ క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే సౌమ్య కార్యక్రమాల‌న్నీ.. త‌న క‌నుస‌న్నల్లోనే జ‌రిగేలా చాప‌కింద నీరులా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని దేవినేని ఉమని గ‌మ‌నిస్తున్న వ‌ర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేర‌కు జ‌గ‌న్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో దేవినేని ఉమ దిశానిర్దేశం మేర‌కే సౌమ్య పాల్గొంటున్నారని అంటున్నారు. మొత్తంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వేలు పెడుతున్నార‌ని ఉమను ఉద్దేశించి అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News