ఎంత సర్దుకుపోదామన్నా….ఎలా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అయిన ఖ‌ర్చెంత‌? ఇప్పుడు ఏ ఇద్దరు క‌లిసినా చ‌ర్చించుకుంటున్న తీవ్రమైన అంశం ఇదే. నిజానికి ఇద్దరు వ్యక్తులే కాదు.. ఎక్కడిక‌క్కడ జ‌రుగుతున్న చ‌ర్చ [more]

Update: 2020-01-14 14:30 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అయిన ఖ‌ర్చెంత‌? ఇప్పుడు ఏ ఇద్దరు క‌లిసినా చ‌ర్చించుకుంటున్న తీవ్రమైన అంశం ఇదే. నిజానికి ఇద్దరు వ్యక్తులే కాదు.. ఎక్కడిక‌క్కడ జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే. ప్రస్తుతం మూడు రాజ‌ధానుల‌ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అని అధికార వైసీపీ మంత్రుల నుంచి నాయ‌కుల‌ను ఎవ‌రిని అడిగినా అమ్మో.. ల‌క్ష కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో కూడుకున్నది కాబ‌ట్టి.. మేం మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చాం. అయినా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద‌గ్గర అంత డ‌బ్బులు ఎక్కడ‌? ఉన్నా మాత్రం ఇంత సొమ్మును ఒకే చోట కుమ్మరిస్తే ఎట్టా? అని స‌మాధానం వ‌స్తోంది. దీంతో నిజ‌మేనా? అమ‌రావ‌తి రాజ‌ధానికి రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చవుతాయా? సామాన్యులు బుగ్గలు నొక్కుకుంటున్నారు.

అన్నీ ఉన్నాయంటూ…..

మ‌రి ఇదే విష‌యాన్ని ప్రతిప‌క్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయ‌న ప‌రివారాన్ని ప్రశ్నిస్తే.. భిన్నమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న స‌మ‌యంలో రూ.ల‌క్ష కోట్ల విలువైన రాజ‌ధానిని నిర్మిస్తున్నామ‌ని ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, ప్రపంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఇక‌, అధికారం కోల్పోయాక కూడా ఇదే కొన్ని రోజులు వెల్లడించారు. అయితే, రాజ‌ధాని విష‌యంలో వైసీపీ స్టాండ్ విన్నాక‌.. ఒక్కసారిగా చంద్రబాబు స‌హా త‌మ్ముళ్ల నోళ్లు త‌డ‌బ‌డ్డాయి. తూచ్‌… ల‌క్ష కోట్లతో ఇప్పుడు ప‌నిలేదు. ఇప్పుడు రూ.10 వేల కోట్లుంటే చాలు.. అని ఆదిలో చెప్పారు. రోజులు గడిచి అమ‌రావ‌తికి ప్రాణ‌సంక‌టం ఉంద‌ని తెలుస్తుండ‌డంతో అస్సలు పైసా కూడా ఖ‌ర్చులేద‌ని ఇక్కడే అన్నీ క‌ట్టి ఉన్నాయ‌ని కాబ‌ట్టి ఇదే రాజ‌ధానిగా కొన‌సాగాల‌ని డిమాండ్లు చేస్తున్నారు.

అద్దె భవనాలు.. తాత్కాలిక కట్టడాలు….

ఇక‌, చంద్రబాబు అనుకూల మీడియాలోనూ భిన్నమైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. బాబు వాయిస్‌నే ప‌రోక్షంగా క‌థ‌నాల రూపంలో ఇవి వెల్లడిస్తున్నాయి. దీంతో సాధార‌ణ ప్రజ‌ల్లో అస‌లు ఈ రాజ‌ధాని విష‌యం ఏంట‌నే చ‌ర్చ వ‌స్తోంది. ఒక్కసారి వాస్తవంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఉన్న భ‌వ‌నాల్లో చాలా మ‌టుకు శాఖ‌ల‌కు ఉన్నవ‌న్నీ.. కూ డా విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి, గుంటుప‌ల్లి, గుంటూరు త‌దిత‌ర ప్రాంతాల్లో అద్దె భ‌వ‌నాల్లోనే న‌డుస్తున్నాయి . ఇక‌, హైకోర్టు, స‌చివాల‌యం, అసెంబ్లీ వంటివి చంద్రబాబు హ‌యాంలోనే నిర్మించినా.. వాటిని తాత్కాలిక క‌ట్టడాలుగానే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శాశ్వత క‌ట్టడాల‌కు పునాదులు వేశారు.

సర్దుకుపోదామన్నా…..

ఇక‌, కేంద్రం నుంచి ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న రాజ‌ధానికి నిధులు ఇప్పటి వ‌ర‌కు వ‌చ్చింది కేవ‌లం రు. 2500 కోట్లు మాత్రమే. ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున కేంద్రం ఇచ్చింది. ఇక‌, గ్రాంటు రూపంలో మ‌రో రు. 500 కోట్లుఇచ్చింది. మొత్తంగా చూస్తే.. కేంద్రం ఇచ్చింది రు. 2500 కోట్లు దాట‌దు. ఇక‌, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హయాంలో మొత్తంగా చేసిన ఖ‌ర్చు రు. 5300 కోట్లు. ఇక‌, రైతుల భూముల విష‌యంలో చేసుకున్న ఒప్పందాలు, బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు వంటివి భారీ ఎత్తున పేరుకు పోయాయి. వాస్తవానికి గ‌త ప్రభుత్వం రాజ‌ధాని పేరుతో తీసుకువ‌చ్చిన రుణం అక్షరాలా రు. 9 వేల‌ కోట్లు. మ‌రి ఈ సొమ్ములో రాజ‌ధానికి ఖ‌ర్చు పెట్టింది స‌గం కూడాలేదు. పోనీ.. ఇప్పటికిప్పుడు చంద్రబాబు చెబుతున్నట్టు ఉన్నవాటితో స‌ర్దుకుపోదామంటే సాధ్యమ‌య్యే ప‌నికాదు.

పది శాతం మాత్రమే….

చుట్టూ విశాల‌మైన ఖాళీ స్థలాలు.. రోడ్డు అసంపూర్ణం.. అభివృద్ధి అసంపూర్ణం.. నీటికి ఇబ్బందులు.. ఇలా అనేక స‌మ‌స్యలున్నాయి. కొన‌సాగించాల‌న్నా క‌నీసం రు. 25 వేల కోట్లు ఇప్పటికిప్పుడు కావాలి. ఇంత మొత్తం ఇచ్చేదెవ‌రు ? ఇక‌, ప‌రిశ్రమ‌లు, ఐటీ వంటివి కూడా ఇప్పట్లో వ‌చ్చే అవ‌కాశం నిజంగానే క‌నిపించడం లేదు. ఇదే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న మాట‌. పైగా ప్రభుత్వం సేక‌రించిన భూమిలో ఇప్పటి వ‌ర‌కు ప‌నులు జ‌రుగుతున్నది కేవ‌లం 10శాతంలో మాత్రమే కావ‌డం కూడా గ‌మ‌నార్హం. సో.. మొత్తానికి పైకి జ‌రుగుతున్న ప్రచారానికీ.. క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌కు మ‌ధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News