ఆ…భయం…జయం వైపుగా..??

కాకలు తీరిన రాజకీయ నేతలు వాళ్లు. ఒకప్పుడు ఇద్దరూ ఒక గూటి పక్షులే. కానీ విడిపోయిన వారిద్దరూ మళ్లీ సంకీర్ణం పుణ్యమా అని తిరిగి కలిశారు. కర్ణాటకలో [more]

Update: 2019-04-11 18:29 GMT

కాకలు తీరిన రాజకీయ నేతలు వాళ్లు. ఒకప్పుడు ఇద్దరూ ఒక గూటి పక్షులే. కానీ విడిపోయిన వారిద్దరూ మళ్లీ సంకీర్ణం పుణ్యమా అని తిరిగి కలిశారు. కర్ణాటకలో గురు శిష్యులుగా పేరుగాంచిన జనతాదళ్ అధినేత దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఒకే వేదికపై ప్రచారం చేయడాన్ని కన్నడ ప్రజలు ఆసక్తిగా గమనించారు. కర్ణాటకలో అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, జేడీఎస్ ల క్యాడర్ మధ్య సఖ్యత లేదు. అనేక చోట్ల కాంగ్రెస్ క్యాడర్ జేడీఎస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని సరిచేయడానికి సిద్ధరామయ్య, దేవెగౌడ నడుంబిగించారు.

బద్ధ శత్రువులుగా….

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాస్తవానికి జనతాదళ్ ఎస్ నేత. దేవెగౌడ వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయనతో పొసగక కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా మారారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకూ జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ లు బద్ధ శత్రువులే. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనూ దెవెగౌడ, ఆయన పార్టీపై సిద్ధరామయ్య దుమ్మెత్తి పోశారు.

క్యాడర్ సహకరించకపోవడంతో….

కాని కాలం కలసి రాకపోవడంతో కాంగ్రెస్ అధికారం దక్కలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో దానిని కట్టడి చేయడానికి కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీట్ల పంపకం వరకూ కూడా సిద్ధరామయ్యదే పై చేయిగా కన్పించింది. ముఖ్యంగా దేవెగౌడ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న తుముకూరు, మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ జేడీఎస్ కు సహకరించడంలేదు. మాండ్యలో అయితే బహిరంగంగానే సుమలతకు మద్దతు తెలుపుతుండటంతో రెండు పార్టీల్లో కలవరం ప్రారంభమయింది.

చేయి..చేయి..కలిపి…..

దీంతోనే సిద్ధరామయ్య, దేవెగౌడలు కలసి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను, క్యాడర్ ను కట్టడి చేయాలంటే సిద్ధరామయ్య జోక్యం అవసరం. ఇది గుర్తించిన దేవెగౌడ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి కంబైన్డ్ టూర్లకు ప్లాన్ చేశారు. చిక్కబళ్లాపురలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి వీరప్పమొయిలికి మద్దతుగా ప్రచారం చేశారు. వీరిద్దరూ తుమకూరు, మైసూరు, హాసన్, మాండ్య, బెంగళూరు ఉత్తర నియోజకవర్గాల్లో కలసి పర్యటించాలని నిర్ణయించారు. నిన్నటి వరకూ బద్ధ శత్రువులగా మెలిగిన సిద్ధరామయ్య, దేవెగౌడలు కలసి ప్రచారంలో పాల్గొనడం పార్టీలో కొంత ఊపు తెస్తుందంటున్నారు. గెలుపునకు భయపడి దేవెగౌడ తన శిష్యుడినివెంట పెట్టుకుని తిరుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News