మనసు మార్చుకుంటారా?

మాజీ ప్రధాని దేవెగౌడపై వత్తిడి పెరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా ఆయనపై ప్రెజర్ పెడుతున్నారు. రాజ్యసభకు పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. [more]

Update: 2020-02-07 17:30 GMT

మాజీ ప్రధాని దేవెగౌడపై వత్తిడి పెరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా ఆయనపై ప్రెజర్ పెడుతున్నారు. రాజ్యసభకు పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. పెద్దాయన దేవెగౌడ పదవి లేకుండా తాము ఊహించుకోలేకపోతున్నామంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా దేవెగౌడను రాజ్యసభకు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభకు తాను పోటీ చేయనని ఇప్పటికే దెవెగౌడ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీర్ఘకాలం ఎంపీగా…..

దేవెగౌడ దీర్ఘకాలంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. హాసన్ స్థానం దేవెగౌడ కుటుంబానికి పట్టుంది. 1991లోనే దెవెగౌడ హాసన్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో తన మనవడికి ఆ సీటు ఇచ్చారు. తాను తుముకూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కూడా కూలిపోవడంతో రాజ్యసభకు పోటీ చేయబోనని దేవెగౌడ ఇటీవల కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.

ఏదో ఒక పదవిలో ఉండాలని….

దేవెగౌడ ఏదో ఒక పదవిలో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులు సయితం గట్టిగా కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో దేవెగౌడ ప్రముఖంగా ఉండాలని కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పార్టీ నేతలు కూడా ఆయనను ప్రత్యేకంగా కలసి ఈ డిమాండ్ ను ఆయన ముందుంచారు. అయితే దేవెగౌడ అవునని చెప్పలేదు.. కాదని చెప్పలేదని అంటున్నాయి పార్టీ వర్గాలు.

ఆయన పోటీ చేస్తేనే….?

ఈ ఏడాది జూన్ లో కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే దేవెగౌడ రాజ్యసభ కు బరిలోకి దిగితే కాంగ్రెస్ కూడా సహకరించే అవకాశముంది. కాంగ్రెస్ సాయంతో దేవెగౌడ రాజ్యసభ పదవి పొందడం సులువవుతుంది. దేవెగౌడ కాకుండా మరో అభ్యర్థి అయితే కాంగ్రెస్ సహకరించకపోవచ్చు. అందుకే దేవెగౌడ చివరి నిమిషంలోనైనా తన మనసును మార్చుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఇంకా సమయం ఉండటంతో దేవెగౌడ నిర్ణయం పై ఇటు పార్టీలోనూ, అటు కుటుంబంలోనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News