మీట నొక్కేది మఠం చెబితేనే

రాజకీయం – మతం వేర్వేరని రాజకీయ నాయకులు తరచూ వల్లె వేస్తుంటారు. పైకి అలా ప్రకటించినప్పటికీ ఎన్నికల్లో మతం నుంచి లబ్ధిపొందని నాయకుడు ఒక్కరంటే ఒక్కరుండరు. నిజానికి [more]

Update: 2019-10-20 16:30 GMT

రాజకీయం – మతం వేర్వేరని రాజకీయ నాయకులు తరచూ వల్లె వేస్తుంటారు. పైకి అలా ప్రకటించినప్పటికీ ఎన్నికల్లో మతం నుంచి లబ్ధిపొందని నాయకుడు ఒక్కరంటే ఒక్కరుండరు. నిజానికి రాజకీయం, మతం మధ్య అవినాభావ సంబంధం ఉంది. రెండింటిని వేరు చేసి చూడటం అసాధ్యం. భారత రాజకీయాల్లో కొన్ని మత పార్టీలుగా ముద్రపడ్డాయి. మరికొన్ని మతం ముసుగులో పనిచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మతాలు – మఠాలు – పీఠాల ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేసే సాహసం ఏ పార్టీ చేయదు. ఎన్నికల సమయంలో వాటి చుట్టూ తిరగడం నాయకులకు పరిపాటి.

మఠాలకే…

తెలుగురాష్ట్రాల్లో పీఠాల ప్రాధాన్యం ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొరుగున ఉన్న కర్ణాటకలో మఠాల చుట్టూ రాజకీయాలు తిరుగుతుంటాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాదిరాష్ట్రం హర్యానా ఇందుకు మినహాయింపుకాదు. 90స్థానాలు గల ఈ రాష్ట్రంలో జాట్ సామాజిక ప్రభావం పట్టు ఎక్కువ. ఏ పార్టీ ఈ సామాజిక వర్గాన్ని విస్మరించదు. జాట్ అంటే సంపన్న రైతు వర్గం. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ స్థాపించిన ఐఎన్ఎల్డీ ( ఇండియన్ నేషనల్ లోక్ దళ్) పూర్తిగా వీరిపైనే ఆధారపడింది. కాంగ్రెస్ పార్టీ ఇందుకు మినహాయింపుకాదు. అధికార బీజేపీ గత ఎన్నికల్లో జాటేతర సామాజిక వర్గాల ఓట్లతో గెలిచింది.

డేరాలు…బాబాలు….

దీనికి తోడు హర్యానా రాజకీయాల్లో డేరాలు, బాబాల ప్రాధాన్యం అవసరం. ఎన్నికల రాజకీయాలను వీరు శాసిస్తారు. ఎంతటి నాయకుడు అయినా వీరి ముందు మోకరిల్లాల్సిందే. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిందే. వారి ప్రాపకం, ఆశీర్వాదం కోసం ఆరాటపడకతప్పదు. ఇటీవలి కాలంలో డేరాలు, బాబాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీలు వారిని విస్మరించడం లేదు. జిల్లా కేంద్రమైన సిర్సాలోని డేరా సచ్చా సౌదా ఆశ్రమం అత్యంత కీలకమైంది. 1948 ఏప్రిల్ లో దీనిని స్థాపించారు. దీని గురువు గుర్మీత్ రామ్ రహీమ్. ప్రస్తుతం ఆయన హత్య, అత్యాచారం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా ఆయన ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఇంకా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోలేదు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉంది. 15మంది సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఏ పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై చర్చించనుందని కమిటీ సభ్యుడు జోగిందర్ సింగ్ వెల్లడించారు.

జైల్లో ఉన్నప్పటికీ…..

ఓటర్లపై ప్రభావం చూపించగల మరో సంస్థ సత్ లోక్ ఆశ్రమ్స్ ఈ డేరా గురువు రామ్ పాల్. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఆయనపై ఓటర్ల ప్రభావం తక్కువేమికాదు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మధ్య చాలా వత్యాసం ఉంటుంది. ఈ దఫా ఎవరికీ మద్దతు ఇవ్వాలన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదు. త్వరలో ప్రకటిస్తామని డేరా మీడియా ఇన్ ఛార్జ్ చాంద్ రధి వెల్లడించారు. సత్ లోక్ ఆశ్రమ్స్ జిల్లాకేంద్రమైన హిస్సార్ లో ఉంది. రోహతక్ చుట్టు పక్కల అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఉంది. ఆశ్రమ అధిపతి గురు రామ్ పాల్ 1951 సెప్టెంబరులో జన్మించారు. 2014 నవంబరు నుంచి ఆయన జైలులో ఉన్నారు. రామ్ పాల్ జైల్లో ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం కష్టమే.

ఎన్నికలకు దూరంగా…..

మరోసంస్థ డేరా బాబా శ్రీ బాలక్ పురి కూడా రాజకీయంగా ఓటర్లపై గణనీయ ప్రభావం చూపగలదు. రాష్ట్రంలో నివసిస్తున్న పంజాబీలపై ప్రభావం చూపగలదు. ఈ డేరాను అధికార బీజేపీ నాయకులు అదేపనిగా సందర్శిస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. దీని గురువు కరణ్ పురి ప్రజలపై ప్రభావం చూపించగల రన్నది నాయకుల విశ్వాసం. మరో సంస్థ డేరా గౌకరణ్ ధామ్ కు సైతం ప్రజల్లో పట్టుంది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా కు ఈ సంస్థ కు మద్దతు దారుగా పేరుంది. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని డేరా చెబుతోంది. అయితే ప్రజల నాడి పసిగట్టిన డేరా సంస్థ అధికార భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ తమ అనుచర గణానికి బలమైన సంకేతాలు పంపుతోంది. హర్యానా ఆధ్యాత్మిక సంస్థలు అయిన డేరా ల ప్రభావాన్ని ఎవరూ అంత తేలిగ్గా తోసిపుచ్చలేరు. అయితే డేరాల అధిపతుల వివాదాల్లో చిక్కుకోవడం, జైలుపాలు కావడం జరుగుతున్న వాటిపై ప్రజలు విశ్వాసం కోల్పోకపోవడం విశేషం. కాంగ్రెస్ హయాంలో ఈ సంస్థల కార్యకలాపాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటి కార్యకలాపాలకు కొంత వరకు బ్రేకులు పడిన మాట వాస్తవమే. ధార్మిక సంబంధ కార్యకలాపాలు అంటే ఒకింత ఆసక్తి కలిగిన బీజేపీనే వాటిని నియంత్రించడం గమనార్హం. ఆ పార్టీ కూడా ఆయా సంస్థల అధిపతుల ఆశీస్సులుండటం విశేషం. మొత్తానికి ఈ దఫా ఎన్నికల్లో ఆధ్యాత్మిక సంస్థల మద్దతు ఎవరి దన్నది పూర్తిగా స్ఫష్టం కావడం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News