మన తెలుగు జాతి రత్నాలు..భారత రత్నాలే !

రత్నం అంటే ఏ వంకా పెట్టలేనిది. అందరికీ ఒకేలా కనిపించేది. అందుకే గొప్పవారిని రత్నాలతో పోలుస్తారు. ఇక దేశానికే దశ, దిశ చూపిన వారిని భారత రత్నాలు [more]

Update: 2020-09-08 00:30 GMT

రత్నం అంటే ఏ వంకా పెట్టలేనిది. అందరికీ ఒకేలా కనిపించేది. అందుకే గొప్పవారిని రత్నాలతో పోలుస్తారు. ఇక దేశానికే దశ, దిశ చూపిన వారిని భారత రత్నాలు అని కూడా అంటారు. ఒక జీవితకాలంలో కొన్ని తరాలను ప్రభావితం చేసిన వారికి అంతటి ఉత్తమమైన గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఇక విషయానికి వస్తే తెలుగు వారిని అపరిమితంగా ఆకర్షించిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు. రాజకీయ రంగంలో తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నుంచి దివంగత నేత వైఎస్సార్ వరకూ చాలా మంది నాయకులు తెలుగు జీవితాలను విశేషంగా ప్రభావితం చేశారు. అయితే ఇపుడు వీరిలో చాలా మందికి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.

ఆయనుండగా…

ముందుగా చెప్పుకుంటే ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని పాతికేళ్ళుగా డిమాండ్ ఉంది. బతికుండగా మామకు దూరమైన అల్లుడు చంద్రబాబు ఆయన చనిపోయాక విగ్రహన్ని చేసి తన పక్కనే పెట్టుకున్నారు. చంద్రబాబు తన‌ రాజకీయాన్ని ఎన్టీఆర్ చుట్టూ బలంగా అల్లుకున్నారు. మరి తాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన రోజుల్లోనే కేంద్రంలో మిత్ర ప్రభుత్వం ఉండేది, అది వాజ్ పేయి అయినా మోడీ అయినా దోస్తీ కట్టింది బాబే. కానీ ఎన్టీయార్ కి భారత రత్న ఇప్పించుకోలేకపోయారు. అది ఆయనకు ఇష్టం ఉన్నా లక్ష్మీపార్వతి భార్యగా ఆ ఉత్తమ పురస్కారం అందుకుంటుందన్న కారణాన అడిగేవారు కాదని అంటారు. మరో వైపు చంద్రబాబు రాజకీయంతో ఎన్టీఆర్ ని కొందరి వాడుగా మార్చేసి ఆయన గౌరవం తగ్గించారని విమర్శలు ఎదుర్కొన్నారు.

పీవీకి కూడా…

ఇపుడు కొత్తగా భారత రత్న రేసులో మరో పేరు వినిపిస్తోంది. ఆయనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. నిజానికి ఆయన దేశానికి నాలుగు దశాబ్దాల పాటు ఎనలేని సేవ చేశారు. కానీ నోరూ వాయీ లేని సామాజికవర్గంలో పుట్టడమే ఆయన చేసుకున్న పాపం కాబోలు. అందుకే ఇన్నాళ్ళూ ఆయన జయంతి కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఇపుడు టీయారెస్ సర్కార్ పనిగట్టుకుని మరీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించబట్టి చనిపోయిన పదహారేళ్ళ తరువాత మళ్ళీ పీవీని అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయనకు భారత రత్న ఇవ్వమని కేసీయార్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెబుతున్నారు.

వైఎస్సార్ కి సైతం…..

ఇక తాజాగా వైఎస్సార్ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ వైసీపీ నేతల నుంచి వస్తోంది. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఈ డిమాండ్ కేంద్రం ముందు పెట్టారు. సంక్షేమ పధకాల శిల్పిగా ఉన్న వైఎస్సార్ దేశానికి దిశానిర్దేశం చేశారు. ఈ దేశంలో పేదవాడికి ఏం చేయాలో అన్నీ చేసి చూపించారు. అలాగే అభివ్రుధ్ధిని మరచిపోలేదు. ఉత్తమ పరిపాలకుడికి అభివ్రుధ్ధి,సంక్షేమం రెండు కళ్ళు అని చాటి చెప్పిన తొలి నేతగా దేశం ఆయన్ని గుర్తించింది. ఆయన స్పూర్తిని కూడా తీసుకుంది. ఓ విధంగా భారత రత్నకు ఆయన అర్హుడే.

అది వీడితేనే….

మన తెలుగు నేతల్లో ముందే చెప్పుకున్నట్లుగా ప్రకాశం పంతులు కూడా భారత రత్నకు తగినవారే. ఇలాంటి నాయకుల విషయంలో ఎవరైనా కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు లాంటివి ముందు వీడాలి, వారు అందరివారు అని జనం అనుకునేలా చేయాలి. భారత రత్నలు వచ్చినా రాకపోయినా కూడా వారు సిసలైన తెలుగు జాతి రత్నాలే. కానీ వారిని రాజకీయాలకు వాడుకుంటూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోవడం తగదు. తెలుగు జాతి సొత్తులుగా వారిని అందరూ భావించాలి. అదే వారికి అసలైన నివాళి అవుతుంది.

Tags:    

Similar News