ఓడిపోయామని విభజనకు దిగారుగా?

గూర్ఖాలాండ్…. ఉద్యమం గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. పాతతరం వారికి బాగా గుర్తుండి ఉంటుంది. తూర్పు రాష్ర్టమైన పశ్చిమ బెంగాల్ ను విభజించి ఉత్తర [more]

Update: 2021-07-06 16:30 GMT

గూర్ఖాలాండ్…. ఉద్యమం గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. పాతతరం వారికి బాగా గుర్తుండి ఉంటుంది. తూర్పు రాష్ర్టమైన పశ్చిమ బెంగాల్ ను విభజించి ఉత్తర బెంగాల్ ప్రాంతాలతో గూర్ఖాలాండ్ పేరుతో కొత్త రాష్ర్టం కోసం జరిగిన ఉద్యమమిది. 80వ దశకంలో ఈ ఉద్యమం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను కుదిపేసింది. తొలి రోజుల్లో ఉద్యమానికి నాయకత్వం వహించిన సుభాష్ ఘీషింగ్ కన్నుమూశారు. బిమల్ గురుంగ్, రోషన్ గిరి వంటి నాయకులు ఇప్పటి గూర్ఖాలాండ్ ఉద్యమానికి ప్రతినిధులుగా ఉన్నారు. ఎనిమిదో దశకం చివర్లో కేంద్రంలోని నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం ద్వారా పరిస్థితిని ఉపశమింపజేసింది. రాష్ర్టంలోని నాటి సీపీఎం సర్కారును ఇరుకున పెట్టేందుకే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఊతమిచ్చిందన్న ఆరోపణలు లేకపోలేదు.

బెంగాల్ విభజన అంశం….

తాజాగా బెంగాల్ విభజన డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. విభజన కాకుండా ఉత్తర బెంగాల్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ ను ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీలు మరోసారి లేవనెత్తారు. ఉత్తర బెంగాల్ లోని అలీపుర్దూర్ పార్లమెంటు సభ్యుడు జాన్ బార్లా నివాసంలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే ప్రాంతానికి చెందిన జల్పాయ్ గురి పార్లమెంటు సభ్యుడు జయంత్ రాయ్ సైతం సమావేశంలో పాల్గొని తన మద్దతు ప్రకటించారు. ఉత్తర బెంగాల్ లోని అలీపుర్దూర్, జల్పాయ్ గురి, మాల్దా, డార్జిలింగ్, కుచ్ బెహార్, ఉత్తర దీనాజ్ పూర్, దక్షిణ దీనాజ్ పూర్, కాలింపాగ్ జిల్లాలతో కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్ కంటే ఉత్తర బెంగాల్ అన్ని రంగాల్లో వెనకబడిందని,
ఇప్పటివరకు పాలించిన ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని వారు ఆరోపించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారం అని వారు చెబుతున్నారు.

వెనకబడిన ప్రాంతమంటూ…..

ఈ డిమాండ్ ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని బెంగాలీలను విభజించే కుట్రగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కమలనాథులు దానిని జీర్ణించుకోలేక పచ్చని రాష్ర్టంలో చిచ్చు పెడుతున్నారని, ఇందుకు కేంద్ర పెద్దల అండదండలు, ప్రోత్సాహం ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఉత్తర బెంగాల్ ప్రగతికి తాను ప్రతిన పూనానని, తన కంఠంలో ప్రాణం ఉండగా రాష్ర్ట విభజనను అంగీకరించనని మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, మెదినీపూర్ పార్లమెంటు సభ్యుడైన దిలీప్ ఘోష్ సైతం కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ ను తోసిపుచ్చారు. అయితే తాము రాష్ర్టం నుంచి విడిపోవాలని కోరుకోవడం లేదని, వెనకబడ్డ తమ ప్రాంత అభివద్ధికి కేంద్ర పాలిత ప్రాంతం చేయమని కోరుతున్న విషయాన్ని గమనించాలని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 54 అసెంబ్లీ సీట్లలో 31 సీట్లను కమలం కైవశం చేసుకోగా మమత పార్టీ టీఎంసీ 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకుంది.

బెంగాల్ లో ఉద్యమాలకు….

పేరు ఏదైనప్పటికీ ప్రత్యేక ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 80ల్లో గూర్ఖాలాండ్ పేరుతో ఉద్యమం సాగింది. 1995లో ప్రత్యేక కామత్ పూర్ పేరుతో ఆందోళనలు సాగాయి. 1998లో గ్రేటర్ కుచ్ బెహార్ తో పోరాటాలు కొనసాగాయి. ఉత్తర బెంగాల్ ప్రాంతాలతోపాటు పొరుగునున్న అసోంలోని ధుబ్రి, కోక్రాఝర్, గోపాల్ పూర్, బొంగైగావ్ జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేయాలని గతంలో ఉద్యమాలు జరిగాయి. ఇతర రాష్ర్టంలోని ప్రాంతాలను కలపడం అంత తేలికైన విషయం కాదు. ఉత్తర బెంగాల్ వెనకబడిన ప్రాంతమన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. అయితే ప్రత్యేక ప్రాంతమే ఇందుకు పరిష్కారమన్న వాదనలో ఏకాభిప్రాయం లేదు. మమతను ఇరుకున పెట్టేందుకే కేంద్ర పెద్దల ప్రోత్సాహంతో స్థానిక కమలం ఎంపీలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనను తోసిపుచ్చలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News