సౌండ్ కు రీసౌండ్ లేదే

చంద్రబాబునాయుడు రాజధానిపై రచ్చ రచ్చ చేయాలని భావించినా ఇతర ప్రాంతాల నేతలు ముందుకు రావకపోవడం తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర పరిణామం. రాజధాని అమరావతిని తరలిస్తారంటూ గత కొంతకాలంగా [more]

Update: 2019-08-31 11:00 GMT

చంద్రబాబునాయుడు రాజధానిపై రచ్చ రచ్చ చేయాలని భావించినా ఇతర ప్రాంతాల నేతలు ముందుకు రావకపోవడం తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర పరిణామం. రాజధాని అమరావతిని తరలిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని రాజధాని అమరావతిని తరలిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. త్వరలోనే ఆందోళన చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వం ప్రకటన చేయకున్నా…..

కానీ ఇప్పటివరకూ రాజధాని అమరావతిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఆర్డీఏ చేసిన సమీక్షలోనూ తరలింపు అంశం చర్చకు రాలేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజధాని మార్పు అంశంపై చంద్రబాబు తీసుకున్న స్టాండ్ ను స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా నేతలు మినహాయించి రాజధాని తరలింపు అంశాన్ని టీడీపీ సీనియర్ నేతలు లైట్ గా తీసుకున్నారు.

వారు మాత్రమే…..

రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, పరిటాల సునీత, నక్కా ఆనందబాబులు మాత్రమే స్పందించారు. రాజధాని అమరావతిని తరలిస్తే ఊరుకోమని వీరు హెచ్చరించారు. వీరిలో ఒక్క పరిటాల సునీత మినహాయిస్తే మిగిలిన అందరూ నేతలు గుంటూరు, కృష్ణా జిల్లా నేతలే కావడం గమనార్హం. గుంటూరు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా దీనిపై స్పందించడం లేదు.

మిగిలిన ప్రాంత నేతలు…..

పైగా గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని డిమాండ్ చేయడం పార్టీలో నేతల పరిస్థితిని చెప్పకనే చెబుతున్నట్లయింది. ఒక్కగంటా మాత్రమే కాదు రాయలసీమకు చెందిన నేతలెవ్వరూ అమరావతిపై నేటికీ రెస్పాండ్ కాలేదు. దీనికి కారణం లేకపోలేదు. జగన్ ప్రభుత్వం పాలనను వికేంద్రీకరిస్తే అది రాయలసీమకు లాభమవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు రాజధానిపై తొందరపడినా ప్రయోజనం ఉండదన్నది సీమ టీడీపీనేతల అభిప్రాయం. ఇదే ఉద్దేశ్యంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు అమరావతిపై తీసుకున్న నిర్ణయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News