సేన షేక్ అవ్వక తప్పదా?

సంకీర్ణ సర్కార్ అంటే అంతే. నిత్యం కుంపటి మీద కూర్చుని పాలన చేయాల్సిందే. బాసిజం, కుటుంబ పెత్తనం కూడా ఉన్న శివసేన దీనికి అతీతం కాదు. శివసేనలో [more]

Update: 2020-01-04 17:30 GMT

సంకీర్ణ సర్కార్ అంటే అంతే. నిత్యం కుంపటి మీద కూర్చుని పాలన చేయాల్సిందే. బాసిజం, కుటుంబ పెత్తనం కూడా ఉన్న శివసేన దీనికి అతీతం కాదు. శివసేనలో ఇప్పటికే మంత్రి పదవులు దక్కని వారు అసంతృప్తికి లోనయ్యారు. శివసేనలో సీనియర్ నేతగా ఉన్న సంజయ్ రౌత్ కూడా తన సోదరుడికి మంత్రిపదవి దక్కలేదన్న కోపంతో ఉన్నారు. ఆయన శివసేనకు దూరం కాకపోయినప్పటికీ కొంత అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

మంత్రి పదవుల కోసం…..

అయితే మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన శివసేన సభ్యుడు తన పదవికి రాజీనామా చేయడం నిజంగా సంచలనం కల్గించే విషయమే. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ జరిగి దాదాపు వారం అవుతుంది. మంత్రివర్గాన్ని అయితే విస్తరించారు కాని శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యమైన శాఖల కోసం కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పట్టుబడుతున్నాయి. కేవలం మంత్రిపదవికోసమే తాము కేబినెట్ లో చేరలేదని, కీలక శాఖలను దక్కించుకుని తమ పార్టీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఇటు కాంగ్రెస్, అటు ఎన్సీపీలు పట్టుబడ్డుతున్నాయి.

శాఖల కేటాయింపు జరగక….

దీంతో కేబినెట్ విస్తరణ జరిగినప్పటికీ శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి కారణం ఆయనకు శాఖ కేటాయించక పోవడమే. మంత్రిగా ప్రమాణం చేసినా ఫలితం లేదని, శాఖలేని మంత్రిగా ఎన్నాళ్లు కొనసాగాలని అబ్దుల్ సత్తార్ ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ సత్తార్ ఆషామాషీ నేత కాదు. మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి ఆయన.

మంత్రి రాజీనామాతో….

అబ్దుల్ సత్తార్ సిల్లోద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అబ్దుల్ సత్తార్ మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీలోకి వెళ్లాలనుకున్నా టిక్కెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో బీజేపీలో చేరి విజయం సాధించారు. అబ్దుల్ సత్తార్ రాజీనామాతో శివసేన షేక్ అయిందనే చెప్పాలి. ఒకవైపు మంత్రి పదవులు దక్కని వారిని బుజ్జగించడం ఎలా అని తలపట్టుకున్న సమయంలో సత్తార్ రాజీనామా సేనానికి చికాకు కల్పిస్తుంది.

Tags:    

Similar News