భారత్- చైనా మధ్య శాంతిపర్వం.. కొనసాగేనా?

భారత్, చైనా సంబంధాల్లో 1964, 2020 విషాదకర సంవత్సరాలుగా మిగిలిపోతాయి. 1964లో చైనా నేరుగా భారత్ పై దండెత్తగా గత ఏడాది దాదాపుగా అలాంటి పనే చేసింది. [more]

Update: 2021-03-08 16:30 GMT

భారత్, చైనా సంబంధాల్లో 1964, 2020 విషాదకర సంవత్సరాలుగా మిగిలిపోతాయి. 1964లో చైనా నేరుగా భారత్ పై దండెత్తగా గత ఏడాది దాదాపుగా అలాంటి పనే చేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ) వద్ద తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గత ఏడాది మే 5న చైనా సైనికుల దుందుడుకు వైఖరి వల్ల 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అదే సమయంలో బీజింగ్ కూ భారీ నష్టం వాటిల్లింది. చైనా నేటికీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు 45 మంది చైనా సైనికులు హతులైనట్లు అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. ముఖ్యంగా గత ఏడాది జూన్ నుంచి గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద ఉభయ దేశాలు భారీగా సైనికులను మోహరించడం వల్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య పలుమార్లు జరిగిన చర్చల్లో దళాల ఉపసంహరించాలన్న నిర్ణయం తీసుకోవడం వివేకమంతమైన చర్య సంపూర్ణంగా స్వాగతించదగ్గది, ఆహ్వానించదగ్గ దనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా బీజింగ్ మొండితనాన్ని వీడి ప్రాప్తకాలజతను ప్రదర్శించడం శుభసూచికం.

కొన్ని చోట్ల వివాదాలున్నా…..

ఇరు దేశాల మధ్య చర్చల మేరకు తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల నుంచి రెండు దేశాల దళాల ఉపసంహరణ ప్రారంభమయ్యాయి. దశలవారీగా సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణను పూర్తి చేస్తారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర రేవులోని ఫింగర్ -8కు తూర్పున చైనా తన బలగాలను ఉంచుతుందని రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారు. అదే సమయంలో భారత్ కూడా ఫింగర్-3కు సమీపంలోని ధన్ సింగ్ థాపా శిబిరం వద్ద తన బలగాలను ఉంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. పాంగాంగ్ దక్షిణ రేవు వద్ద కూడా ఇలాంటి చర్యలు చేపడతారు. అంతేకాక గత ఏడాది ఏప్రిల్ తరవాత పాంగాంగ్ వద్ద చేపట్టిన నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తం బలగాల ప్రక్రియ పూర్తయ్యేసరికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బలగాల మోహరింపు, గస్తీ తదితర అంశాలపై వివాదాలు లేకపోలేదు.

ఉపసంహరణ ప్రక్రియ….

ఫిబ్రవరి 10 నుంచి దళాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైనట్లు చైనా రక్షణ శాఖ సీనియర్ కర్నల్ వు క్వియాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో మాస్కోలో జరిగిన ఉభయ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం, జనవరి 24 జరిగిన 9వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చల ఫలితంగా దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పష్టం చేశారు. తొలుత ఆర్టిలరీ యూనిట్లు వెనక్కు మళ్లాయి. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల నుంచి మాత్రం సైనికులు అప్పుడే తిరిగిరారు. వారు అక్కడే ఉంటారు. సరిహద్దుల్లో ముందు వరుసలో మోహరించిన దళాలు కూడా అక్కడే ఉంటాయి. చివరిదశలో వారు వెనక్కి వస్తారు. పాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఏకకాలంలో జరుగుతుంది. ఉపసంహరణను ఇరు దేశాల సీనియర్ సైనికాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

గతంలో కాదని…..

ప్రస్తుత విషయాన్ని పక్కనబెడితే ఇప్పటికీ 1960ల నుంచి 43వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆధీనంలో ఉంది. అంతేకాక ఈశాన్య రాష్రమై అరుణాచల్ ప్రదేశ్ లోని 90 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తనదిగా చైనా వాదిస్తోంది. అసలు యావత్ అరుణాచల్ ను దక్షిణ టిబెట్ అని అది తమ ప్రాంతమేనని వితండ వాదం చేస్తోంది. ఈవాదనలు ఎలా ఉన్నప్పటికీ 60ల నాటి ఇండియా కు, ఇప్పటి ఇండియాకు తేడా ఉందని, నాటి ఆటలు నేడు సాగవన్న విషయం అనుభవ పూర్వకంగా అర్థమవడంతోనే బీజింగ్ వెనక్కి తగ్గిందన్నది అసలు నిజం.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News