పులివెందులలో కలి పెడుతున్న కమలం…?

పులివెందుల. పేరులొనే పులి ఉంది. అక్కడ నాయకుల గెలుపులోనూ రాజసం ఉంది. పులివెందుల నాలుగున్నర దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకే రాజ్యం రాసిచ్చేసింది. ఇక్కడ తొలిసారిగా 1978లో వైఎస్సార్ [more]

Update: 2021-01-30 15:30 GMT

పులివెందుల. పేరులొనే పులి ఉంది. అక్కడ నాయకుల గెలుపులోనూ రాజసం ఉంది. పులివెందుల నాలుగున్నర దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకే రాజ్యం రాసిచ్చేసింది. ఇక్కడ తొలిసారిగా 1978లో వైఎస్సార్ యువ నేతగా ఉన్నపుడు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు. నాటి నుంచి వైఎస్సార్ అనేక సార్లు పులివెందుల నుంచే గెలుస్తున్నారు. ఇక ఆయన కడప ఎంపీగా ఢిల్లీకి వెళ్తే ఆయన సోదరుడు వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు. అలాగే వైఎస్సార్ సతీమణి విజయమ్మకూడా ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. గత రెండు దఫాలుగా పులివెందుల నుంచి జగన్ రికార్డ్ స్థాయి మెజారిటీతో గెలుస్తున్నారు.

ఒక్కటి ముక్కలేనా….?

పులివెందులలో గెలుపు వెనక వైఎస్ ఫ్యామిలీ ఒక్కటిగా ఉండడం కూడా ప్రధాన కారణం. అతి పెద్ద కుటుంబం వారిది. ఇక రాజకీయంగా కూడా ఎదురులేని ఫ్యామిలీ అది. మరో వైపు చూసుకుంటే ఈ కుటుంబం 2012 ఉప ఎన్నికల్లో ఒకసారి వేరు పడింది, వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే విజయమ్మ వైసీపీ నుంచి పోటీ చేసి మరిదిని ఓడించారు. ఆ తరువాత మళ్లీ అంతా ఒక్కటి అయ్యారు. ఇపుడు మాత్రం మరోమారు వివేకా కుటుంబం వేరు పడేలా పొలిటికల్ సీన్ ఉందని అంటున్నారు. దానికి వివేకా కుమార్తె సునీత సారధి అని కూడా అంటున్నారు.

మండిపోతున్నారా…?

సొంత అన్న ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. కానీ తన తండ్రి దారుణ హత్యకు కారకులు ఎవరో తేలలేదు. రెండేళ్ళు అవుతోంది వివేకా మరణించి. కానీ ఇంతవరకూ దోషులెవరో తెలియడంలేదు. దాంతో హై కోర్టుకు వెళ్ళి మరీ సీబీఐ విచారణ కోరినా ఉపయోగం లేకపోయింది అని వివేకా కుటుంబం వగచి వాపోతోందిట. జగన్ విపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు సీఎం గా ఉండగా 2018 మార్చిలో ఈ మర్డర్ జరిగింది. నాడు బాబు మీద పెద్ద గొంతు చేసుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక దీని సంగతి మొత్తం తేలుస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ కేసు అతీ గతీ లేదు అంటున్నారు. దాంతో సొంత అన్న మీదనే చెల్లెలు సునీత మండిపోతున్నారని టాక్. ఆమె ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళి పెద్దలను కూడా కలిసారు అంటున్నారు.

కమలతీర్ధమేనా…?

ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి జగన్ చెల్లెలు సునీత ఒక ఆయుధం అవుతారా అన్న చర్చ అయితే వస్తోంది. పులివెందులలో జగన్ ని ఓడించడం అంటే అది కలలో మాటే. కానీ ఇది రాజకీయం, ఇక్కడ ఏమైనా జరగవచ్చు. ఒకసారి వైఎస్సారే కడప ఎంపీ గా అతి తక్కువ మెజారిటీతో ఒడ్డుకు చేరిన సంగతి కూడా అంతా గుర్తు చేస్తున్నారు. దాంతో జగన్ మీదకు ఒక బాణంగా చెల్లెలుని ప్రయోగిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. పులివెందులలో వివేకా కుటుంబానికి కూడా బలం ఉంది. మిగిలిన వారు ఎలా ఉన్నా వైఎస్సార్ కి ఆయన ఫ్యామిలీకి కూడా వెన్నూ దన్నూ వివేకానే. దాంతో వివేకా కూతురుని పులివెందుల బరిలో దింపి జగన్ అన్న మీదకు బీజేపీ వదిలిన బాణంగా గురి చూస్తారని అంటున్నారు. అదే జరిగితే పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీ రాజకీయంలోకి కలి ప్రవేశించినట్లే అంటున్నారు.

Tags:    

Similar News