మామను గెలవాలంటే అదొక్కటే మార్గమా?

రాజ‌కీయాల్లో మామా అల్లుళ్లు ఒకే పార్టీలో ఉన్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా నే క‌నిపిస్తాయి. మ‌న ద‌గ్గర టీడీపీలో అన్నగారు ఎన్టీఆర్‌, ఆయ‌న అల్లుడు చంద్రబాబు, పెద్దల్లుడు [more]

Update: 2020-05-07 00:30 GMT

రాజ‌కీయాల్లో మామా అల్లుళ్లు ఒకే పార్టీలో ఉన్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా నే క‌నిపిస్తాయి. మ‌న ద‌గ్గర టీడీపీలో అన్నగారు ఎన్టీఆర్‌, ఆయ‌న అల్లుడు చంద్రబాబు, పెద్దల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు మిన‌హా పెద్దగా మామా అల్లుళ్లు ఒకే పార్టీలో రాజ‌కీయాలు చేసిన సంద‌ర్భాలు క‌నిపించ‌వు. ఈ క్రమంలోనే టీడీపీలో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మామా అల్లుళ్లు రాజ‌కీయాలు చేశారు. వారే దివంగ‌త చిత్తూరు మాజీ ఎంపీ శివ‌ప్రసాద్‌, ఆయ‌న అల్లుడు పంత‌గాని న‌ర‌సింహ‌ప్రసాద్‌. టీడీపీలో శివ‌ప్రసాద్ ఎలాంటి పెద్ద పెద్ద ప‌ద‌వులు నిర్వహించ‌క పోయినా.. ఎంపీగా రెండు సార్లు విజ‌యం సాధించారు. స్థానికంగా మంచి నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. వివాదాల‌కు, విమ‌ర్శల‌కు కూడా దూరంగా ఉన్నారు.

వారసుడిగా అల్లుడిని….

అదే స‌మ‌యంలో పార్టీ పిలుపు మేర‌కు శివ‌ప్రసాద్ న‌టుడిగా త‌న విశ్వరూపాన్ని అనేక నిర‌స‌న‌ల కోసం వినియోగించారు. ప్రత్యేక హోదా స‌హా అనేక సంద‌ర్భాల్లో త‌న న‌ట‌న ద్వారా స‌ద‌రు నిర‌స‌న‌ను ర‌క్తి క‌ట్టించారు. హోదా కోసం పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్న ఐదేళ్లలో ఢిల్లీలో పార్లమెంటు ముందు ఆయ‌న వేయ‌ని వేషం లేదు. ఇక‌, ఆయ‌న వార‌సుడిగా త‌న అల్లుడు న‌ర‌సింహ ప్రసాద్‌ను రంగంలోకి తెచ్చారు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం రైల్వే కోడూరు టికెట్‌ను కూడా ఇప్పించుకున్నారు. అయితే, ఇక్కడ వైసీపీ నాయ‌కుడు, కోరుముట్ల శ్రీనివాస్ హ‌వా ముందు ప్రసాద్ నిలువ లేక పోయారు. దీంతో న‌ర‌సింహా ప్రసాద్‌ ఓట‌మిపాల‌య్యారు.

శివప్రసాద్ మరణంతో…..

ఇక‌, ఆ త‌ర్వాత శివ‌ప్రసాద్ మ‌ర‌ణంతో ఈ కుటుంబం రాజ‌కీయంగా ఒడిదుడుకులకు లోనైంది. నిజానికి త‌న అల్లుడు గెలుస్తాడ‌ని ఆశించిన శివ‌ప్రసాద్ త‌న వార‌సుడిని ఆయ‌న‌లో చూసుకోవాల‌ని భావించారు. ఇది తీర‌లేదు. ఇదిలావుంటే, టీడీపీ త‌ర‌ఫున ఓడిపోయిన నరసింహప్రసాద్‌.. ప్రజ‌ల‌కు ద‌గ్గర‌య్యేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. రాజ‌కీ యంగా ఎత్తులు వ్యూహాల మాట అటుంచితే.. సంద‌ర్భం ఏదైనా స‌రే గ‌తంలో త‌న మామ వివిధ రూపాలు ధ‌రించి వ్యక్తం చేసిన న‌ట‌న‌ను ఇప్పుడు న‌ర‌సింహ ప్రసాద్ అనుక‌రిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట చంద్రబాబు పిలుపు మేర‌కు తెలుగు మీడియం ముద్దు, ఇంగ్లీషు వ‌ద్దు అనే నినాదంతో శ్రీకృష్ణదేవ‌రాయ‌లు వేషం వేసుకుని నియోజ‌క‌వ‌ర్గంలో సంద‌డి చేశారు. ఇక‌, తాజాగా కూడా క‌రోనా వేషం వేసుకుని హ‌ల్ చ‌ల్ చేయాల‌ని భావించి రోడ్డు మీద‌కు వ‌చ్చినా.. పోలీసులు ఆయ‌న‌ను అనుమ‌తించ‌లేదు.

కలసి రాదని భావిస్తున్నారా?

ఇదెలా ఉన్నప్పటికీ.. త‌న మామ దారిలో న‌ర‌సింహ‌ప్రసాద్ చేస్తున్న ప్రయ‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. అయితే, ఏదైనా కూడా రాజ‌కీయంగా శివ‌ప్రసాద్ సాధించిన విజ‌యం చేరుకునేందుకు ఈ ఒక్కటే మార్గం కాద‌ని, నేరుగా ప్రజ‌ల‌ను క‌లిసి వారి సానుభూతిని సొంతం చేసుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈయ‌న మామ‌గారి న‌ట‌న‌ను మాత్రమే అనుక‌రిస్తారో.. వ్యూహ ప్రతివ్యూహాల‌ను కూడా ఒంట‌బ‌ట్టించుకుంటారో చూడాలి. అయితే అదే స‌మ‌యంలో న‌ర‌సింహా ప్రసాద్‌కు కోడూరు నియోజ‌క‌వ‌ర్గం అంత‌గా క‌లిసి రాద‌న్న అప‌న‌మ్మకం కూడా వెంటాడుతోంద‌ట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీకి కంచుకోట‌. గ‌త ఐదు ఎన్నిక‌ల్లో ఇక్కడ టీడీపీ గెలుప‌న్నదే ఎర‌గ‌దు. అందుకే ఆయ‌న చిత్తూరు ఎంపీ సీటుపై కూడా క‌న్నేశార‌ని మ‌రో టాక్‌..?

Tags:    

Similar News