వార్నర్ ది గ్రేట్

డేవిడ్ వార్నర్ ఇప్పుడు ప్రపంచ కప్ లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు. వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 447 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన [more]

Update: 2019-06-22 00:47 GMT

డేవిడ్ వార్నర్ ఇప్పుడు ప్రపంచ కప్ లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు. వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 447 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ లలో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు అంటే ఏ స్థాయిలో బౌలర్లపై వార్నర్ విరుచుకుపడుతున్నాడో చెప్పక్కర్లేదు. ఆసీస్ ఆడిన ఆరు మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ సాధించిన పరుగులు ఐదు మ్యాచ్ లలో ఆ టీం కి విలువైన విజయాలు అందించడమే కాదు పాయింట్ల పట్టికలో ఆ టీం ను అగ్రగామిగా నిలిపాయి. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగే వార్నర్ ఇప్పటివరకు ఆరు సిక్సులు, 40 ఫోర్లతో రెండు అద్భుత సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 89.40 బ్యాటింగ్ యావరేజ్ తో ప్రత్యర్థులకు సింహ స్వప్నం గా నిలవడం వెనుక చాలా శ్రమే దాగి వుంది. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఇక డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ విన్యాసాలు చూడలేమని అభిమానులు భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా తెరపైకి రావడం అందరికి స్ఫూర్తి దాయకమే.

అన్ని గొడవలే . …

డేవిడ్ వార్నర్ కెరియర్ అంత వివాదాస్పదం ఏ క్రీడాకారుడిది ఉండదేమో. ఆసీస్ అత్యున్నత ఆటగాడిగా ప్రపంచం మెచ్చిన ఈ దిగ్గజ ఆటగాడు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డీకాక్ తో, భారత బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తో, బార్ లో జో రూట్ తో గొడవలు ఇలా ఒకటి కాదు ఆట తో బాటు వార్నర్, బోర్డు కి అనేక తలనొప్పులు తెచ్చిపెట్టాడు. ఇక బాల్ ట్యాపరింగ్ వివాదంలో చిక్కుకుని దేశం పరువు తీశాడు. తాను చేసిన తప్పులు తెలుసుకుని కన్నీళ్ళ పర్యంతమై జాతికి , తన కుటుంబానికి క్షమాపణలు చెప్పి టీం నుంచి బహిష్కరణకు గురయ్యి అధఃపాతాళానికి జారిపోయాడు.

పడిలేచిన కెరటంలా …

క్రికెట్ తన ప్రాణం గా భావించిన డేవిడ్ వార్నర్ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు కనిపించే ఛాన్స్ లేదనే అనుకున్నారు అంతా. అయితే పడిలేచిన కెరటంలా తన సస్పెన్షన్ పిరియడ్ ముగియగానే దేశవాళీ క్రికెట్ లో తదేక దీక్షతో రాణించి టీం కి తన అవసరాన్ని గుర్హ్టు చేశాడు. డిప్రెషన్ లోకి వెళ్ళి కోలుకుని వరల్డ్ కప్ కి ఎంపిక అయిన ఆస్ట్రేలియా టీం కి ప్రస్తుతం వెన్నెముక గా నిలిచి మచ్చలన్ని తుడిపేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు ఆట తప్ప వార్నర్ కి ఇక ఏమి లేదు. తలదించుకున్న చోటే తలెత్తుకుని తిరిగేలా తన బ్యాట్ కి పని చెప్పిన డేవిడ్ వార్నర్ జీవితం నేటి క్రీడాకారులకు స్ఫూర్తి అని చెప్పడానికి సంశయం అఖ్ఖర్లేదు.

Tags:    

Similar News