డేటా చోరీ కేసులో తప్పెవరిది..?

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈ కేసు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తెలంగాణ సర్కార్ ఈ [more]

Update: 2019-03-08 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈ కేసు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తెలంగాణ సర్కార్ ఈ కేసును సీరియస్ గా తీసుకొని ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. తెలంగాణలో సిట్ వేసిన రోజే ఏపీలో టీడీపీ తెలంగాణ ప్రభుత్వంపై, వైసీపీపై ఫిర్యాదు చేయడం, తెల్లారే ఈ కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం కూడా సిట్ వేయడం జరిగిపోయాయి. ఈ కేసును మొత్తం రెండు రాష్ట్రాల వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డేటా చోరీ వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఫారం – 7 ద్వారా వైసీపీ తమ ఓట్లు తొలగిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. అసలు ప్రజలకు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఈ కేసులో ఎందుకీ హైరానా..?

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజల డేటా, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండకూడని వివరాలు టీడీపీకి సంబంధించి సేవామిత్ర యాప్ లో ఉన్నాయని, ఈ డేటా ఆధారంగా టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారనేది ప్రధానంగా ఐటీ గ్రిడ్ సంస్థపై వచ్చిన ఫిర్యాదు. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు వచ్చాక పోలీసులు ఈ సంస్థలో సోదాలు జరిపారు. దీంతో వెంటనే ఏపీ ప్రభుత్వం హైరానా పడిపోయింది. వెంటనే పోలీసులను పంపించింది. ఓ ఉద్యోగి మిస్సింగ్ అంటూ కేసు దాఖలైంది. కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు. ఒక ప్రైవేటు కంపెనీపై, అన్నీ సక్రమంగా పనిచేస్తున్న కంపెనీలో సోదాలు జరిగితే తెలుగుదేశం ఎందుకు ఇంతలా హైరానా పడుతుందనేది వైసీపీ వాదన. తప్పు జరగకపోతే ఇంత ఉలిక్కిపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంది, ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా చోరీ అయితే నామమాత్రమైన ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందా, వివరణ కోరిందా వంటి ప్రశ్నలు టీడీపీ నుంచి వస్తున్నాయి.

అశోక్ దాకవరపు ఎక్కడ..?

ఈ కేసు వ్యవహారంలో టీడీపీ తప్పు చేసిందనే ప్రచారం ప్రజల్లోకి వెళుతుండటంతో టీడీపీ కూడా తేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం పోలీసులను దొంగల్లా మార్చి తమ డేటాను ఎత్తుకెళ్లి జగన్ కు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో ఫారం – 7 అంశాన్ని కూడా తెరపైకి వచ్చి జగన్ తప్పు చేశారు అనే వాదన ప్రజల్లోకి తీసుకుపోతోంది. అయితే, డేటా చోరీలో ఏమి జరిగిందో తెలియాలంటే విచారణ జరగాలి. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు అశోక్ దాకవరపు ఎక్కడ ఉన్నారు. తప్పు చేయకపోతే అతడు ఎందుకు పరారీ అయ్యాడు. విచారణకు సహకరిస్తే తప్పు జరిగిందో లేదో తేలిపోతుంది కదా అని ఈ వ్యవహారాన్ని చూస్తున్న వారు అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ డేటా చోరీకి గురయ్యింది అనే టీడీపీ ఆరోపణలపై కూడా పూర్తి విచారణ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయి కదా అంటున్నారు. అలా విచారణకు ఇరు పక్షాలు సహకరించుకోకుండా ఆరోపణలు గుప్పించుకుంటూ రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిస్తే మాత్రం నష్టపోయేది సామాన్య ప్రజలే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News