భార్య చూపిన బాటలోనే

భార్యాభర్తలు ఏడడుగులు నడుస్తారు. అలాగే జీవితాంతం కలసి అడుగులో అడుగులేస్తామని అగ్నిసాక్షిగా చెబుతారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ జీవితంలో కూడా అనుకోకుండా భార్య [more]

Update: 2019-08-24 09:30 GMT

భార్యాభర్తలు ఏడడుగులు నడుస్తారు. అలాగే జీవితాంతం కలసి అడుగులో అడుగులేస్తామని అగ్నిసాక్షిగా చెబుతారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ జీవితంలో కూడా అనుకోకుండా భార్య గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాల్సి వచ్చింది. భార్య రూటే కరెక్ట్ అని అనాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఆయన అమిత్ షాను కలిశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నారు.

త్వరలోనే కమలం కండువా….

ఇది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన వార్త కాంగ్రెస్ పార్టీకి కాదు. ఎందుకంటే దామోదర రాజనర్సింహ గత కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. పాల్గొనడం లేదు. ఎన్నికలకు ముందు కొంత హడావిడి చేసి టిక్కెట్ తెచ్చుకుని ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలకు ముందు ఒక సంఘటన జరిగింది. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ అభర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన భార్య పద్మిని బీజేపీలో చేరిపోయారు. దామోదర రాజనర్సింహకు తెలియకుండానే పద్మిని నేరుగా బీజేపీ కార్యాలయానికి వచ్చి కమలం కండువా కప్పుకున్నారు.

భార్యకు నచ్చజెప్పి…

ఎన్నికలకు ముందు కావడంతో దామోదర రాజనరసింహకు ఇది షాక్ తగిలింది. దీంతో బంధుమిత్రులు, సన్నిహితుల సాయంతో పద్మిని ఆలోచనలో మార్పు తీసుకువచ్చారు. కమలం పార్టీ కండువా కప్పుకున్న పద్మిని చేత తాను బీజేపీలో చేరడం లేదని బలవంతంగా చెప్పించారు. ఎన్నికల సమయంలో తప్పుడు సంకేతాలు వెళతాయని రాజనర్సింహ భార్యకు నచ్చ జెప్పి మరీ కాంగ్రెస్ లో కొనసాగేలా చేశారు. పద్మిని తాను మోదీ పథకాలకు, నిర్ణయాలకు ఫ్యాన్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఒక స్వామీజీ సూచనతోనే అప్పట్లో పద్మిని బీజేపీలో చేరారన్న ప్రచారం జరిగింది.

భవిష్యత్ లేదని….

కానీ గత ఎన్నికల తర్వాత బార్య ఆప్షన్ కరెక్ట్ అని దామోదర రాజనర్సింహ గుర్తించినట్లుంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ఇక భవిష్యత్ లేదని గుర్తించని దామోదర రాజనర్సింహ పార్టీకి గుడ్ బై చెప్పారు. సరైన నాయకత్వం కాంగ్రెస్ లో లేదని భావించిన రాజనర్సింహ బీజేపీ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. సీనియర్ నేత, దళిత నేతగా ముద్రపడిన రాజనర్సింహ చేరిక పార్టీకి ఎంతో మేలు చేస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద దామోదర రాజనర్సింహ భార్య చూపిన బాటలోనే చివరకు నడవాల్సి వచ్చింది. అయితే దామోదర రాజనర్సింహ పార్టీ మారనని, కాంగ్రెస్ లో నే కొనసాగుతానని చెబుతున్నప్పటికీ ఆయన త్వరలోనే కమలం పార్టీకి చేరుకోవడం ఖాయంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News