దగ్గుబాటి దిగులంతా అదేనా?

సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కాలం కలసి రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయంగా మరింత నష్టపోయారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ [more]

Update: 2021-01-02 06:30 GMT

సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కాలం కలసి రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయంగా మరింత నష్టపోయారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ కుటుంబం కొంత రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషించినా, విభజన తర్వాత మాత్రం పూర్తిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయేతర వ్యాపకాలకే పరిమితమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్లే. ఆయన పుస్తకాలు రాసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

పదేళ్ల నుంచి…..

దాదాపు పదేళ్ల నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. 2019 ఎన్నికలకు ముందు మాత్రం తిరిగి రాజకీయాల్లో వెలుగు వెలగాలని భావించారు. జైరాం రమేష్ వంటి నేతలను కూడా వైసీపీలోకి తీసుకొచ్చారు. తన కుమారుడు దగ్గుబాటి హితైష్ ను వైసీపీలో చేర్చారు. అయితే తన కుమారుడు పోటీ చేసేందుకు పౌరసత్వ సమస్య తలెత్తడంతో తానే పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పురంద్రీశ్వరి మాత్రం బీజేపీ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా విశాఖ నుంచి బరిలో ఉన్నారు.

వైసీపీకి దూరంగా…..

ఇద్దరూ ఓడిపోవడతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందేమోనని అందరూ భావించారు. కానీ పురంద్రీశ్వరి, ఆయన వేర్వేరు పార్టీల్లో ఉండటం నచ్చని జగన్ ఏదో ఒక పార్టీలో ఉండేలా నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకూ పర్చూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ను మార్చి ఆయన స్థానంలో రావి రామనాధం బాబును జగన్ నియమించారు.

పుస్తక రచనలోనే…..

ఇప్పుడు దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆమెకు పదవి వచ్చే అవకాశముంది. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి పూర్తిగా దూరమయ్యారు. ఆయన పర్చూరు నియోజకవర్గంలోనూ పెద్దగా ఉండటం లేదు. ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్ పై కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆందోళన చెందుతున్నారు. ఇక బీజేపీ తప్ప ఆ కుటుంబానికి వేరే ఆప్షన్ లేకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాలిటిక్స్ ను పక్కన పెట్టి పుస్తక రచనలో మునిగిపోయారు.

Tags:    

Similar News