చిక్కుల్లో చిన్నమ్మ..!

దగ్గుబాటి కుటుంబంలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. కుమారుడికి మంచి రాజకీయ జీవితం ఇవ్వాలనుకుంటున్న దగ్గుబాటి పురందేశ్వరి – వెంకటేశ్వరరావు దంపతులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. కుమారుడు ఒక [more]

Update: 2019-03-01 03:30 GMT

దగ్గుబాటి కుటుంబంలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. కుమారుడికి మంచి రాజకీయ జీవితం ఇవ్వాలనుకుంటున్న దగ్గుబాటి పురందేశ్వరి – వెంకటేశ్వరరావు దంపతులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. కుమారుడు ఒక పార్టీలో తల్లి ఒక పార్టీలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పురందేశ్వరి వైఖరి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమవుతోంది. కుమారుడి కోసం ఆమె పనిచేస్తారా లేదా పార్టీనే ముఖ్యం అనుకుంటారా అనేది తెలియడం లేదు. ఇంతకాలం లేని డైలమాలో ఇప్పుడు పురందేశ్వరి పడిపోయారు. ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయ ప్రవేశం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకురాలిగా ఎదిగి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన దెబ్బకు ఆమె కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీచేసి ఓడారు. కానీ బీజేపీలో ఆమెకు బాగానే గౌరవం దక్కింది. రాష్ట్ర పార్టీ కీలక నాయకురాలిగా ఉండటంతో పాటు జాతీయ మహిళా మోర్చాకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇంచుమించు జీరోగా ఉంది. ఆ పార్టీ తరపున పోటీ చేయాలంటే గెలుపుపై ఆశలు లేకుండానే బరిలో దిగాలి. కావున ఈసారి పురందేశ్వరి పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

రాజకీయాల్లో అనాధగా హితేష్…

కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ను క్రీయాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకున్న దగ్గుబాటి దంపతులు అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన వేదిక అని నిర్ణయించుకున్నారు. బీజేపీలో ఉంటే భవిష్యత్ కష్టమే అని నిర్ణయించుకొని వారు వైసీపీ వైపు మొగ్గారు. మొన్న అమరావతిలో హితేష్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలు మారారనే చెడ్డ పేరు వద్దనుకుంటున్న పురందేశ్వరి మంచోచెడో బీజేపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె కుమారుడి చేరికకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక తండ్రి వెంకటేశ్వరరావు కూడా కుమారుడితో కలిసి పార్టీలో చేరలేదు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన వారే ఉన్నా హితేష్ చెంచురామ్ పరిస్థితి రాజకీయాల్లో అనాధలా మారింది.

కుమారుడి వైపా… పార్టీ వైపా..?

రానున్న ఎన్నికల్లో హితేష్ చెంచురామ్ తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన పర్చూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. యువకుడైన హితేష్ ను ఎమ్మెల్యేగా కంటే ఎంపీగానే పోటీ చేయిస్తే బాగుంటుందని పార్టీతో పాటు దగ్గుబాటి దంపతులు కూడా భావిస్తున్నారట. విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయనను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడి నుంచి 2009లో పురందేశ్వరి ఎంపీగా పనిచేశారు. దీంతో హితేష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తల్లిదండ్రుల మద్దతు ఉంటేనే గెలుపు సులువవుతుంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా వెంకటేశ్వరరావు కుమారుడి విజయానికి పనిచేసే అవకాశం ఉంది. కానీ పురందేశ్వరి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. హితేష్ నిలబడే చోట బీజేపీ నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటారు. కాబట్టి ఆమె కుమారుడికి మద్దతు ఇస్తారా లేదా బీజేపీ నుంచి నిలబడ్డ అభ్యర్థికి మద్దతు ఇస్తారో చూడాలి. ఏమైనా దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడి కోసం కూడా మనస్ఫూర్తి పనిచేయలేని స్థితిలో ఉన్నారు.

Tags:    

Similar News